ఆదికాండము 15

15
1ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి–అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. 2అందుకు అబ్రాము–ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా 3మరియు అబ్రాము–ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా 4యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి –ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. 5మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి–నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి–నీ సంతానము ఆలాగవునని చెప్పెను. 6అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. 7మరియు ఆయన–నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు 8అతడు–ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనెదనని నాకెట్లు తెలియుననగా 9ఆయన–మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్లగువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. 10అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు 11గద్దలు ఆ కళేబరములమీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. 12ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్ర పట్టెను. భయంకరమైన కటికచీకటి అతని కమ్మగా 13ఆయన–నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. 14వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. 15నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయె దవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. 16అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.
17మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండములమధ్య నడిచిపోయెను. 18ఆ దినమందే యెహోవా–ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు#15:18 ఫరాతు. నదివరకు ఈ దేశమును, అనగా 19కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను 20హిత్తీయులను పెరి జ్జీయులను రెఫాయీయులను 21అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요