Logo YouVersion
Icona Cerca

అపొస్తలుల కార్యములు 4

4
యూదుల న్యాయసభ ముందుకు పేతురు యోహానులు
1పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతున్నపుడు యాజకులు దేవాలయ కావలివారి అధిపతి సద్దూకయ్యులు వారి దగ్గరకు వచ్చారు. 2అపొస్తలులు ప్రజలకు యేసును గురించి బోధిస్తూ, ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని ప్రకటించడం విని వారు చాలా కలవరపడ్డారు. 3వారు పేతురు యోహానులను పట్టుకుని, సాయంకాలం కావడంతో, మరుసటిరోజు వరకు వారిని చెరసాలలో బంధించారు. 4కానీ సువార్తను విన్న అనేకమంది నమ్మారు; ఆ విధంగా నమ్మినవారిలో పురుషుల సంఖ్య సుమారు అయిదువేల వరకు పెరిగింది.
5మరుసటిరోజు అధికారులు, యూదా నాయకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేములో కలుసుకొన్నారు. 6ముఖ్య యాజకుడు అన్నా, అతని అల్లుడు కయప, యోహాను, అలెగ్జాండరు ప్రధాన యాజకుని ఇతర కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు. 7వారు పేతురు యోహానులను తీసుకువచ్చి వారి ముందు నిలబెట్టి, “మీరు ఈ పనిని ఏ అధికారంతో ఏ పేరిట చేశారు?” అని ప్రశ్నించడం మొదలుపెట్టారు.
8అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని, వారితో, “అధికారులారా, ప్రజా నాయకులారా! 9మేము కుంటివానిపట్ల చూపించిన దయను బట్టి వాడు ఎలా స్వస్థత పొందాడో ప్రశ్నించడానికి నేడు మేము పిలువబడినట్లైతే, 10మీరు ఇశ్రాయేలు ప్రజలందరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీరు ఎవరిని సిలువ వేశారో, దేవుడు మరణం నుండి ఎవరిని తిరిగిలేపారో, ఆ నజరేయుడైన యేసు క్రీస్తు నామాన్ని బట్టే, ఇతడు స్వస్థపడి మీ ముందు నిలబడ్డాడు. 11యేసు గురించి,
“ ‘ఇల్లు కట్టే మీరు నిషేధించిన రాయి
మూలరాయి అయ్యింది’#4:11 కీర్తన 118:22 అని వ్రాయబడింది.
12కాబట్టి మరి ఎవరి వలన రక్షణ పొందలేము, ఎందుకంటే ఆకాశం క్రింద మనుష్యులకు రక్షణ పొందడానికి మరి ఏ ఇతర పేరులేదు” అన్నాడు.
13వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వీరు విద్యలేని సామాన్య మనుష్యులని తెలుసుకొని ఆశ్చర్యపడి, వీరు యేసుతో పాటు ఉన్నవారని గుర్తించారు. 14కానీ ఆ స్వస్థపడినవాడు వీరితో కూడా నిలబడి ఉండడం చూసి మరి ఏమి చెప్పలేకపోయారు. 15కాబట్టి వారు వీరిని న్యాయసభ నుండి బయటకు వెళ్లమని ఆదేశించి, తమలో తాము చర్చించుకొంటూ, 16“ఈ మనుష్యులను మనం ఏమి చేద్దాం? యెరూషలేములో నివసించే వారందరికి వీరు ఈ గొప్ప సూచకక్రియను చేశారని తెలుసు, కాబట్టి అది జరగలేదని చెప్పలేము. 17అయినా ఈ సంగతిని ప్రజల్లో మరింతగా వ్యాపించకుండా ఆపడానికి, ఈ పేరట మరి ఎవరితో మాట్లాడకుండా వారిని మనం బెదిరిద్దాం” అని అనుకున్నారు.
18మరల ఆ అపొస్తలులను లోపలికి పిలిచి యేసు పేరట ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధించకూడదు అని ఆదేశించారు. 19అందుకు పేతురు యోహానులు, “దేవుని దృష్టిలో మీ మాట వినడం న్యాయమా లేదా దేవుని మాట వినడం న్యాయమా? మీరే న్యాయం చెప్పండి. 20మా మట్టుకైతే, మేము చూసినవాటిని విన్నవాటిని గురించి మేము మాట్లాడకుండా ఉండలేము” అని బదులిచ్చారు.
21ప్రజలందరు జరిగినదాని గురించి దేవుని స్తుతిస్తున్నారు, అందుకని వీరిని ఎలా శిక్షించాలో నిర్ణయించలేకపోయారు. కాబట్టి వారిని మరింత బెదిరించి విడిచిపెట్టారు. 22అద్భుతంగా స్వస్థపడినవాని వయస్సు నలభై సంవత్సరాలు.
విశ్వాసులు ప్రార్థించుట
23పేతురు యోహానులు విడుదల పొందిన తర్వాత, వారి సహవిశ్వాసుల దగ్గరకు వెళ్లి ముఖ్య యాజకులు యూదా పెద్దలు తమతో చెప్పిన వాటన్నింటి గురించి వారికి చెప్పారు. 24అది విన్న వెంటనే, వారందరు ఏకమనస్సుతో బిగ్గరగా దేవునికి ఈ విధంగా ప్రార్థించారు, “సర్వాధికారియైన ప్రభువా, మీరు ఆకాశాలను, భూమిని సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించారు. 25చాలా కాలం ముందే మీ సేవకుడు, మా పితరుడైన దావీదు ద్వారా పరిశుద్ధాత్మ పలికించిన మాటలు:
“ ‘దేశాలు ఎందుకు కోపంతో ఉన్నాయి
ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు?
26ప్రభువుకు ఆయన అభిషిక్తునికి
వ్యతిరేకంగా భూరాజులు లేచారు
అధికారులు ఏకమయ్యారు.’#4:26 కీర్తన 2:1,2
27నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధంగా, యూదేతరులతో ఇశ్రాయేలు ప్రజలతో కలిసి హేరోదు పొంతి పిలాతు ఈ పట్టణంలో కుట్ర చేశారు. 28ఏమి జరగాలని నీ శక్తి నీ చిత్తం ముందుగానే నిర్ణయించిందో అలాగే వారు చేశారు. 29ప్రభువా, ఇప్పుడు, వీరి బెదిరింపుల మధ్య మీ సేవకులకు మీ మాటలను చెప్పడానికి గొప్ప ధైర్యం ఇవ్వండి. 30మీ పరిశుద్ధ సేవకుడైన యేసు పేరట స్వస్థపరచడానికి, సూచకక్రియలు, అద్భుతాలు చేయడానికి మీ హస్తాన్ని చాపండి.”
31వారు ప్రార్థించిన తర్వాత, వారు ఉన్న స్ధలం కంపించింది. వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.
విశ్వాసుల ఐక్యత
32నమ్మినవారందరు ఏక హృదయం, ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఎవ్వరూ తమకు కలిగిన ఆస్తిపాస్తులు తమకే సొంతం అనుకోలేదు, తమ దగ్గర ఉన్నవాటన్నిటిని అందరు సమానంగా పంచుకున్నారు. 33అపొస్తలులు గొప్ప శక్తితో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్ష్యమివ్వడం కొనసాగించారు. వారందరిలో దేవుని కృప ఎంతో శక్తివంతంగా పని చేస్తూ ఉన్నది. 34అవసరాన్ని బట్టి సమయానికి పొలాలు, ఇల్లు ఉన్నవారు వాటిని అమ్మి ఆ డబ్బును తెచ్చి, అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. 35అది అవసరంలో ఉన్నవారికి పంచిపెట్టబడింది. కాబట్టి వారి మధ్య అవసరంలో ఉన్నవారెవరు లేరు.
36కుప్రకు చెందిన యోసేపు అనే ఒక లేవీయుడు ఉన్నాడు. అపొస్తలులు అతన్ని బర్నబా అని పిలిచేవారు. ఆ పేరుకు “ఆదరణ పుత్రుడు” అని అర్థము. 37అతడు తన పొలాలను అమ్మివేసి ఆ డబ్బును తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.

Evidenziazioni

Condividi

Copia

None

Vuoi avere le tue evidenziazioni salvate su tutti i tuoi dispositivi?Iscriviti o accedi

Video per అపొస్తలుల కార్యములు 4