యోహాను 2

2
నీటిని ద్రాక్షరసంగా మార్చిన యేసు
1మూడవ రోజున గలిలయ ప్రాంతంలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉన్నది. 2యేసు, ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు. 3అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు, యేసు తల్లి ఆయనతో, “ద్రాక్షరసం అయిపోయింది” అని చెప్పింది.
4అందుకు యేసు, “అమ్మా, దాంతో మనకేంటి? నా సమయం ఇంకా రాలేదు” అన్నారు.
5ఆయన తల్లి పరిచారకులతో, “ఆయన మీతో చెప్పేది చేయండి” అని చెప్పింది.
6అక్కడ ఆరు రాతి నీటి బానలు ఉన్నాయి, యూదులు శుద్ధీకరణ ఆచారం కొరకు వాడుతారు, ఒక్కొక్క దానిలో వంద లీటర్ల#2:6 వంద లీటర్ల పాత ప్రతులలో రెండేసి మూడేసి తూములు నీళ్ళు పడతాయి.
7యేసు “ఆ బానలను నీటితో నింపండి” అని చెప్పారు; కనుక ఆ పరిచారకులు వాటిని అంచుల వరకు నింపారు.
8ఆయన వారితో, “ఇప్పుడు అందులో నుండి ముంచి తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి” అని చెప్పారు.
వారు ఆ విధంగా చేసినప్పుడు, 9ఆ విందు ప్రధాని ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని రుచి చూసాడు. ఆ నీటిని తెచ్చిన పరిచారకులకు తప్ప, అది ఎక్కడ నుండి వచ్చిందో అతనికి తెలియలేదు. కనుక అతడు పెండ్లికుమారుని ప్రక్కకు పిలిచి, 10“అందరు మొదట మంచి ద్రాక్షరసాన్ని పోసి, అతిథులు తాగలేని స్థితిలో ఉన్నప్పుడు చౌక ద్రాక్షరసాన్ని పోస్తారు, కాని నీవైతే ఇప్పటి వరకు మంచి ద్రాక్షరసాన్నే ఉంచావు” అన్నాడు.
11గలిలయ ప్రాంతపు కానాలో యేసు ఈ మొదటి అద్బుతం చేసి తన మహిమను కనుపరిచారు. దీని వలన ఆయన శిష్యులు ఆయనను నమ్మారు.
12దీని తర్వాత యేసు, తన తల్లి, తన సహోదరులు, తన శిష్యులతో కలిసి కపెర్నహూముకు వెళ్లారు. వారు కొన్ని రోజులు అక్కడ ఉన్నారు.
యేసు దేవాలయ ఆవరణాన్ని శుభ్రపరచుట
13యూదుల పస్కా పండుగ దగ్గర పడుతున్నప్పుడు, యేసు యెరూషలేముకు వెళ్లారు. 14దేవాలయ ఆవరణంలో కొందరు ఎడ్లను, గొర్రెలను, పావురాలను అమ్మడం, మరికొందరు విదేశీ డబ్బులు మార్చే బల్లల దగ్గర కూర్చొని ఉండడం ఆయన చూసారు. 15ఆయన తాళ్ళతో ఒక కొరడాను చేసి, గొర్రెలను ఎడ్లను అన్నిటిని దేవాలయ ఆవరణంలో నుండి బయటకు తోలివేసి, డబ్బు మార్చే వారి నాణాలను చెల్లాచెదురు చేసి వారి బల్లలను పడవేసారు. 16పావురాలను అమ్మేవారితో, “వీటిని ఇక్కడి నుండి తీసివేయండి! నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మార్చడం మానేయండి!” అన్నారు. 17“నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినేస్తుంది”#2:17 కీర్తన 69:9 అని వ్రాయబడి ఉన్నదని శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు.
18అప్పుడు యూదులు ఆయనకు స్పందించి, “ఇదంతా చేయడానికి నీకు అధికారం ఉన్నదని నిరూపించడానికి మాకు ఏ సూచనను చూపిస్తావు?” అని ఆయనను అడిగారు.
19యేసు, “ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను మూడు దినాలలో దానిని తిరిగి లేపుతాను” అని వారికి జవాబిచ్చారు.
20దానికి వారు, “ఈ దేవాలయాన్ని కట్టడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది, నీవు మూడు దినాల్లో దానిని తిరిగి లేపుతావా?” అని అడిగారు. 21అయితే ఆయన తన శరీరమనే దేవాలయం గురించి చెప్పారు. 22ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత, ఆయన శిష్యులు ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. వారు లేఖనాలను, యేసు చెప్పిన మాటలను నమ్మారు.
23పస్కా పండుగ సమయంలో ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు, ఆయన చేస్తున్న అద్బుత క్రియలను చూసిన చాలామంది ఆయన పేరును నమ్మారు. 24అయితే యేసుకు ప్రజలందరి గురించి తెలుసు కనుక, ఆయన తనను తాను వారికి అప్పగించుకోలేదు. 25ప్రతి వ్యక్తిలో ఏమి ఉందో ఆయనకు తెలుసు, కనుక మానవుల గురించి ఏ సాక్ష్యం ఆయనకు అవసరం లేదు.

Pilihan Saat Ini:

యోహాను 2: TCV

Sorotan

Berbagi

Salin

None

Ingin menyimpan sorotan di semua perangkat Anda? Daftar atau masuk