అపొస్తలుల కార్యములు 1

1
యేసు క్రీస్తుని ఆరోహణం
1-2ఓ థెయోఫిలా, యేసు ఆరంభం నుండి ఆయన ఏర్పరచుకొన్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వార సూచనలు ఇచ్చిన తర్వాత, పరలోకానికి ఆయన కొనిపోబడిన సమయం వరకు ఆయన ఏమేమి చేశారో ఏ విషయాలను బోధించారో వాటన్నిటిని గురించి నా మొదటి పుస్తకంలో నేను వ్రాశాను. 3అనగా, ఆయన హింసను పొందిన తర్వాత, తాను సజీవునిగా ఉన్నారని అనేక రుజువులతో తనను తాను వారికి నలభై రోజులు కనుపరచుకుంటూ దేవుని రాజ్యాన్ని గురించి బోధించారు. 4ఒక రోజు యేసు వారితో కలసి భోజనం చేస్తున్నప్పుడు ఆయన వారికి ఈ ఆజ్ఞ ఇచ్చారు: “మీరు యెరూషలేమును వదిలి వెళ్లకండి, నేను మీతో ముందే చెప్పినట్లు, నా తండ్రి వాగ్దానం చేసిన ఆ బహుమానాన్ని పొందుకొనే వరకు కనిపెడుతూ ఉండండి. 5ఎందుకంటే, యోహాను నీటితో బాప్తిస్మమిచ్చాడు, కాని కొన్ని రోజుల్లో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుకొంటారు.”
6అప్పుడు ఆ అపొస్తలులు ఆయన చుట్టుచేరి, “ప్రభువా, ఇప్పుడు నీవు ఇశ్రాయేలు రాజ్యాన్ని తిరిగి నిర్మిస్తావా?” అని అడిగారు.
7అందుకు ఆయన వారితో, “తండ్రి తన అధికారంతో నిర్ణయించిన సమయాలను, కాలాలను తెలుసుకోవడం మీ పని కాదు. 8అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకొంటారు. అప్పుడు మీరు యెరూషలేములో, సమస్త యూదయ, సమరయ ప్రాంతాల్లో, భూమి అంచుల వరకు నాకు సాక్షులుగా ఉంటారు” అన్నారు.
9ఈ మాటలను చెప్పిన తర్వాత, వారి కళ్ళ ముందే, ఆయన ఆరోహణమయ్యారు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను కమ్ముకున్నది.
10ఆయన వెళ్తునప్పుడు వారు ఆకాశంవైపే తేరి చూస్తూ నిలబడ్డారు, అప్పుడు తెల్లని వస్త్రాలను ధరించుకొన్న ఇద్దరు వ్యక్తులు వారి దగ్గరకు వచ్చి, 11“గలిలయ వాసులారా, మీరు ఇక్కడ నిలబడి ఆకాశం వైపు ఎందుకు చూస్తున్నారు? మీ ముందు ఆరోహణమైన ఈ యేసే, ఏ విధంగా పరలోకానికి వెళ్లడం చూశారు, అదే విధంగా ఆయన తిరిగి వస్తారు” అని వారితో చెప్పారు.
యూదాకు బదులుగా ఎన్నుకోబడిన మత్తీయా
12తర్వాత అపొస్తలులు ఒలీవల కొండ నుండి బయలుదేరి యెరూషలేముకు తిరిగి వెళ్లారు, అది ఒక సబ్బాతు దిన ప్రయాణం అనగా దాదాపు ఒక కిలోమీటరు దూరం ఉంటుంది. 13వారు పట్టణం చేరి, తాము ఉంటున్న మేడ గదికి ఎక్కి వెళ్లారు. అక్కడ ఎవరు ఉన్నారంటే:
పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ,
ఫిలిప్పు, తోమా;
బర్తలోమయి, మత్తయి;
అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే#1:13 జెలోతే అంటే అత్యాసక్తి గలవాడైన కనానీయుడైన సీమోను సీమోను, యాకోబు కుమారుడైన యూదా.
14వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియైన మరియ, ఆయన తమ్ముళ్ళు కలిసి, ఏకమనస్సుతో విడువక ప్రార్థిస్తున్నారు.
15ఇంచుమించు నూట ఇరవైమంది విశ్వాసులు ఒక్కచోట చేరినప్పుడు పేతురు వారి మధ్యలో నిలబడి, 16“సహోదరీ సహోదరులారా,#1:16 దేవుని కుటుంబానికి చెందిన స్త్రీ పురుషులైన విశ్వాసులకు వర్తిస్తుంది. యేసును బంధించడానికి వారికి దారి చూపించిన యూదా గురించి, చాలా కాలం క్రిందట దావీదు ద్వారా పరిశుద్ధాత్మ చెప్పిన లేఖనాలు నెరవేరవలసి ఉంది. 17‘అతడు మనలో ఒకనిగా ఉండి మన పరిచర్యలో భాగం పంచుకొన్నాడు.’ ”
18ద్రోహం చేసి సంపాదించిన డబ్బుతో యూదా ఒక పొలాన్ని కొన్నాడు; అక్కడే అతడు తలక్రిందులుగా పడి, శరీరం చీలి అతని ప్రేగులన్ని బయట చెదరిపడ్డాయి. 19ఈ సంగతిని గురించి యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరు విన్నారు, కాబట్టి ఆ పొలాన్ని వారి భాషలో అకెల్దమా అని పిలుస్తున్నారు, అకెల్దమా అనగా రక్త భూమి అని అర్థం.
20పేతురు ఇలా అన్నాడు, “ఎందుకంటే, కీర్తన గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది:
“ ‘అతని స్థలం పాడైపోవును గాక;
దానిలో ఎవరు నివసించకుందురు గాక’#1:20 కీర్తన 69:25
‘అతని నాయకత్వం వేరొకడు తీసుకొనును గాక.’#1:20 కీర్తన 109:8
21కాబట్టి యోహాను ద్వార బాప్తిస్మం పొందుకున్నది మొదలుకొని ప్రభువైన యేసు మన దగ్గర నుండి పరలోకానికి వెళ్లిన సమయం వరకు, 22ఆయన మన మధ్య ఉన్న కాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానం గురించి సాక్షిగా ఉండాలి.”
23కాబట్టి వారు యూస్తు, బర్సబ్బా అని పిలువబడే యోసేపు మత్తీయా అనే ఇద్దరి పేర్లు సూచించారు. 24తర్వాత వారు, “ప్రభువా, నీకు అందరి హృదయాలు తెలుసు. ఈ ఇద్దరిలో ఎవరు 25యూదా విడిచి వెళ్లిన ఈ అపొస్తలిక పరిచర్యను కొనసాగించడానికి మీరు ఎవరిని ఎన్నుకున్నారో మాకు చూపించండి” అని ప్రార్థించారు. 26తర్వాత వారు చీట్లు వేసినప్పుడు, మత్తీయా పేరున చీటి వచ్చింది, కాబట్టి పదకొండు మంది అపొస్తలులతో అతన్ని చేర్చారు.

Sorotan

Berbagi

Salin

None

Ingin menyimpan sorotan di semua perangkat Anda? Daftar atau masuk

Video untuk అపొస్తలుల కార్యములు 1