YouVersion logo
Ikona pretraživanja

ఆది 12

12
అబ్రాముకు పిలుపు
1యెహోవా అబ్రాముతో ఇలా అన్నారు, “నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు.
2“నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను,
నిన్ను ఆశీర్వదిస్తాను;
నీ పేరును గొప్పగా చేస్తాను,
నీవు దీవెనగా ఉంటావు.
3నిన్ను దీవించే వారిని దీవిస్తాను,
శపించే వారిని శపిస్తాను;
నిన్ను బట్టి భూమి మీద ఉన్న
సర్వ జనాంగాలు దీవించబడతారు.”#12:3 లేదా భూమి దీవించడానికి నీ పేరును వాడుకుంటారు (48:20 చూడండి)
4యెహోవా చెప్పినట్టే అబ్రాము బయలుదేరాడు; లోతు అతనితో వెళ్లాడు. హారాను నుండి ప్రయాణమైనప్పుడు అబ్రాము వయస్సు డెబ్బై అయిదు సంవత్సరాలు. 5అబ్రాము తన భార్య శారాయిని, తమ్ముని కుమారుడైన లోతును, హారానులో వారు కూడబెట్టుకున్న మొత్తం ఆస్తిని, సంపాదించుకున్న ప్రజలను తీసుకుని కనాను దేశం చేరుకున్నాడు.
6అబ్రాము ఆ దేశం గుండా ప్రయాణమై షెకెములో మోరె యొక్క సింధూర వృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో ఆ దేశంలో కనానీయులు నివసిస్తున్నారు. 7యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై, “నీ సంతానానికి#12:7 లేదా విత్తనం నేను ఈ దేశాన్ని ఇస్తాను” అని అన్నారు. కాబట్టి తనకు ప్రత్యక్షమైన చోట యెహోవాకు బలిపీఠం కట్టాడు.
8అక్కడినుండి బేతేలుకు తూర్పున ఉన్న కొండల వైపు వెళ్లి అక్కడ గుడారం వేసుకున్నాడు. దానికి పడమర బేతేలు, తూర్పున హాయి ఉన్నాయి. అక్కడ అతడు యెహోవాకు బలిపీఠం నిర్మించి యెహోవాను ఆరాధించాడు.
9తర్వాత అబ్రాము ప్రయాణిస్తూ దక్షిణంగా వెళ్లాడు.
ఈజిప్టులో అబ్రాము
10అప్పుడు దేశంలో కరువు వచ్చింది, అది తీవ్రంగా ఉన్నందుకు అబ్రాము కొంతకాలం ఉందామని ఈజిప్టుకు వెళ్లాడు. 11అతడు ఈజిప్టు ప్రవేశిస్తుండగా తన భార్య శారాయితో, “నీవు చాలా అందంగా ఉంటావని నాకు తెలుసు. 12ఈజిప్టువారు నిన్ను చూసినప్పుడు, ‘ఈమె అతని భార్య’ అని అంటారు. తర్వాత వారు నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. 13నీవు నా చెల్లివని చెప్పు, అప్పుడు నీకోసం నన్ను మంచిగా చూసుకుంటారు, అప్పుడు నిన్ను బట్టి నా ప్రాణం సురక్షితంగా ఉంటుంది” అని చెప్పాడు.
14అబ్రాము ఈజిప్టుకు వచ్చినప్పుడు ఈజిప్టువారు శారాయి అందంగా ఉందని చూశారు. 15ఫరో అధికారులు ఆమెను చూసి, ఆమె అందాన్ని ఫరో ఎదుట పొగిడారు, ఆమెను రాజభవనం లోనికి తీసుకెళ్లారు. 16ఆమెను బట్టి అతడు అబ్రామును మంచిగా చూసుకున్నాడు, అబ్రాము గొర్రెలు, మందలు, ఆడ మగ గాడిదలు, ఆడ మగ దాసులు, ఒంటెలను ఇచ్చాడు.
17కాని యెహోవా అబ్రాము భార్య శారాయిని బట్టి ఫరోను అతని ఇంటివారిని ఘోరమైన వ్యాధులతో శిక్షించారు. 18కాబట్టి ఫరో అబ్రామును పిలిపించి, “నాకెందుకిలా చేశావు?” అని అన్నాడు. “ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు? 19నేను ఆమెను నా భార్యగా చేసుకునేలా, ‘ఈమె నా చెల్లెలు’ అని నీవెందుకు నాతో చెప్పావు? ఇదిగో నీ భార్య, నీవు ఆమెను తీసుకుని వెళ్లిపో!” అని అన్నాడు. 20అప్పుడు ఫరో తన మనుష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు, వారు అతన్ని, అతని భార్యను, అతనితో ఉన్న ప్రతి దానితో పాటు పంపివేశారు.

Trenutno odabrano:

ఆది 12: OTSA

Istaknuto

Podijeli

Kopiraj

None

Želiš li svoje istaknute stihove spremiti na sve svoje uređaje? Prijavi se ili registriraj