యోహాను సువార్త 13

13
తన శిష్యుల పాదాలను కడిగిన యేసు
1పస్కా పండుగకు ముందే యేసు తాను ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు వెళ్లవలసిన సమయం వచ్చిందని గ్రహించారు. ఈ లోకంలో ఉన్న తన సొంత వారిని ఆయన అంతం వరకు ప్రేమించారు.
2వారు రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నారు, అప్పటికే యేసును అప్పగించాలని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాను అపవాది ప్రేరేపించాడు. 3తండ్రి అన్నిటిని తనకు అప్పగించాడని, తాను దేవుని దగ్గర నుండి వచ్చాడని, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తాడని యేసుకు తెలుసు. 4కాబట్టి ఆయన భోజనం దగ్గర నుండి లేచి తన పైవస్త్రాన్ని తీసి, ఒక తువాలును నడుముకు కట్టుకున్నారు. 5ఆ తర్వాత ఒక పళ్లెంలో నీళ్లు పోసి, తన శిష్యుల పాదాలు కడిగి తాను కట్టుకుని ఉన్న తువాలు తీసి దానితో పాదాలు తుడవడం మొదలుపెట్టారు.
6ఆయన సీమోను పేతురు దగ్గరకు వచ్చినప్పుడు, అతడు, “ప్రభువా, నీవు నా పాదాలు కడుగుతావా?” అని అన్నాడు.
7అందుకు యేసు, “నేను చేస్తుంది ఇప్పుడు నీకు అర్థం కాదు కాని తర్వాత నీవు అర్థం చేసుకుంటావు” అన్నారు.
8పేతురు, “వద్దు ప్రభువా, నీవు ఎప్పుడు నా పాదాలు కడుగకూడదు” అన్నాడు.
అందుకు యేసు జవాబిస్తూ, “నేను నిన్ను కడక్కపోతే, నాతో నీకు పాలు ఉండదు” అన్నారు.
9అప్పుడు సీమోను పేతురు, “అయితే ప్రభువా, నా పాదాలే కాదు నా చేతులు తల కూడా కడుగు!” అన్నాడు.
10అందుకు యేసు, “స్నానం చేసిన వారి శరీరం మొత్తం శుభ్రంగానే ఉంటుంది, కాబట్టి వారు పాదాలను మాత్రం కడుక్కుంటే చాలు; మీరు శుద్ధులే, కాని అందరు కాదు” అని అన్నారు. 11ఆయనను ఎవరు అప్పగించబోతున్నారో ఆయనకు ముందే తెలుసు, అందుకే ఆయన, “మీలో అందరు శుద్ధులు కారు” అన్నారు.
12ఆయన వారి పాదాలు కడిగి, తన పైవస్త్రాన్ని వేసుకుని తన కూర్చున్న చోటికి తిరిగివెళ్లి, “నేను చేసింది మీకు అర్థమైందా?” అని ఆయన వారిని అడిగి ఇలా చెప్పడం మొదలుపెట్టారు: 13“అవును, మీరు నన్ను ‘బోధకుడని, ప్రభువని’ పిలుస్తున్నారు. అది నిజమే కాబట్టి మీరలా పిలువడం న్యాయమే. 14నేను మీకు ప్రభువుగా బోధకునిగా ఉండి, మీ పాదాలు కడిగాను, కాబట్టి మీరు కూడ ఒకరి పాదాలు ఒకరు కడగాలి. 15నేను మీ కోసం చేసినట్లే మీరు కూడ చేయాలని నేను మీకు మాదిరిని చూపించాను. 16ఏ సేవకుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాలేడు, అలాగే ఒక సందేశాన్ని తీసుకెళ్లేవాడు సందేశాన్ని పంపినవాని కన్నా గొప్పవాడు కాలేడని నేను మీతో చెప్పేది నిజం. 17ఇప్పుడు మీకు ఈ సంగతులు తెలుసు కాబట్టి వాటిని పాటిస్తే మీరు ధన్యులు.
తాను అప్పగించబడుటను గురించి యేసు ముందే చెప్పుట
18“నేను మీ అందరి గురించి చెప్పడం లేదు; మీలో నేను ఎంపిక చేసుకున్నవారెవరో నాకు తెలుసు. అయితే ‘నా ఆహారం తిన్నవాడే నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తుతాడు’#13:18 కీర్తన 41:9 అనే లేఖనం నెరవేరడానికి అలా జరగాలి.
19“అయితే అది జరగకముందే నేను మీతో చెప్తున్నాను ఎందుకంటే అది జరిగినప్పుడు, ‘నేనే ఎల్లకాలం ఉన్నవాడను’ అని మీరు నమ్మాలని చెప్తున్నాను. 20నేను పంపేవాన్ని స్వీకరించేవారు నన్ను స్వీకరిస్తారు; నన్ను స్వీకరించిన వారు నన్ను పంపినవాన్ని స్వీకరిస్తారు అని నేను మీతో చెప్పేది నిజం” అని చెప్పారు.
21యేసు ఈ మాటలు చెప్పిన తర్వాత, తన ఆత్మలో కలవరపడి ఆయన వారితో, “మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు.
22ఆయన తమలో ఎవరిని గురించి చెప్తున్నాడోనని శిష్యులు ఒకరిని ఒకరు అనుమానంతో చూడసాగారు. 23ఆయన శిష్యులలో ఒకడు అనగా యేసు రొమ్మును ఆనుకుని ఉన్న యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రక్కన కూర్చుని ఉన్నాడు. 24సీమోను పేతురు ఆ శిష్యునికి సైగ చేసి, “ఆయన చెప్పేది ఎవరి గురించి అని ఆయనను అడుగు” అన్నాడు.
25అతడు యేసు రొమ్ముకు ఇంకా దగ్గరగా ఆనుకుని, “ప్రభువా, అతడు ఎవరు?” అని ఆయనను అడిగాడు.
26యేసు, “ఈ గిన్నెలో రొట్టె ముక్కను ముంచి నేను ఎవరికి ఇస్తానో అతడే” అని ఆయన ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకు ఇచ్చారు. 27యూదా ఆ రొట్టెను తీసుకున్న వెంటనే సాతాను అతనిలో ప్రవేశించాడు.
అప్పుడు యేసు అతనితో, “నీవు చేయబోయేది త్వరగా చేయు” అన్నారు. 28కాని యేసు అతనితో అలా ఎందుకు అన్నారో ఆ భోజనబల్ల దగ్గర ఉన్న ఎవరికీ అర్థం కాలేదు. 29యూదాకు డబ్బు బాధ్యత ఇవ్వబడి ఉండింది కాబట్టి పండుగ కోసం అవసరమైన వాటిని కొనడానికో, పేదవారికి ఏమైనా ఇవ్వమని యేసు అతనితో చెప్తున్నాడని కొందరు అనుకున్నారు. 30యూదా రొట్టెను తీసుకున్న వెంటనే వెళ్లిపోయాడు. అది రాత్రి సమయం.
పేతురు తనను తిరస్కరిస్తాడని యేసు ముందుగానే చెప్పారు
31అతడు వెళ్లిపోయిన తర్వాత యేసు, “ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమ పొందాడు, అలాగే దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు. 32దేవుడు కుమారునిలో మహిమపరచబడినట్లైతే దేవుడు తనలో ఆయనను మహిమపరుస్తారు. వెంటనే కుమారుని మహిమపరుస్తారు.
33“నా పిల్లలారా, నేను మీతో ఇంకా కొంత సమయమే ఉంటాను. నేను యూదులకు చెప్పినట్లే ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను: మీరు నన్ను వెదకుతారు, కాని నేను వెళ్లే చోటికి మీరు రాలేరు.
34“ఒక క్రొత్త ఆజ్ఞను మీకిస్తున్నాను: మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి; నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. 35మీరు ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉంటే, జనులందరు మీరు నా శిష్యులని తెలుసుకుంటారు” అన్నారు.
36సీమోను పేతురు ఆయనతో, “ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని ఆయనను అడిగాడు.
అందుకు యేసు, “నేను వెళ్లే చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు, నీవు తర్వాత వస్తావు” అని అతనితో అన్నారు.
37అయితే పేతురు, “ప్రభువా, నేను ఇప్పుడెందుకు రాలేను? నీకోసం నేను నా ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తాను” అన్నాడు.
38అప్పుడు యేసు, “నీవు నిజంగా నా కోసం నీ ప్రాణం త్యాగం చేస్తావా? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీవు కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదని మూడుసార్లు అబద్దమాడుతావు.

های‌لایت

به اشتراک گذاشتن

کپی

None

می خواهید نکات برجسته خود را در همه دستگاه های خود ذخیره کنید؟ برای ورودثبت نام کنید یا اگر ثبت نام کرده اید وارد شوید