Logo de YouVersion
Ícono Búsqueda

యోహాను 10

10
1గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై యున్నాడు. 2ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱెల కాపరి. 3అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. 4మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. 5అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 6ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు.
7కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను 8–గొఱ్ఱెలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱెలు వారి స్వరము వినలేదు. 9నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. 10దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 11నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును. 12జీతగాడు గొఱ్ఱెల కాపరికాడు గనుక గొఱ్ఱెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱెలను పెట్టి చెదరగొట్టును. 13జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱెలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును. 14నేను గొఱ్ఱెల మంచి కాపరిని. 15తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. 16ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును. 17నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 18ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.
19ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను. 20వారిలో అనేకులు–వాడు దయ్యము పెట్టినవాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. 21మరికొందరు–ఇవి దయ్యము పెట్టినవాని మాటలుకావు; దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి.
22ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగుచుండెను. 23అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా 24యూదులు ఆయనచుట్టు పోగై–ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. 25అందుకు యేసు–మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. 26అయితే మీరు నా గొఱ్ఱెలలోచేరినవారుకారు గనుక మీరు నమ్మరు. 27నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. 28నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. 29వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు; 30నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను. 31యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేతపట్టుకొనగా 32యేసు– తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను. 33అందుకు యూదులు–నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. 34అందుకు యేసు–మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? 35లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల–నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, 36తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో – నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? 37నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి, 38చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. 39వారు మరల ఆయనను పట్టుకొన చూచిరిగాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను.
40యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చు చుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను. 41అనేకులు ఆయనయొద్దకు వచ్చి–యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి. 42అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.

Actualmente seleccionado:

యోహాను 10: TELUBSI

Destacar

Compartir

Copiar

None

¿Quieres guardar tus resaltados en todos tus dispositivos? Regístrate o Inicia sesión