Logo YouVersion
Ikona vyhledávání

మార్కు సువార్త 7

7
అపవిత్రపరిచేది
1యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసు చుట్టూ చేరారు. 2ఆయన శిష్యులలో కొందరు మురికి చేతులతో, అనగా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుండడం చూశారు. 3పెద్దల సాంప్రదాయం ప్రకారం, పరిసయ్యులు యూదులందరు తమ చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు. 4వారు సంతవీధులలో నుండి వచ్చిన తర్వాత స్నానం చేయకుండా భోజనం చేయరు. ఇంకా గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను, భోజనబల్లను నీళ్లతో కడగటం లాంటి అనేక ఆచారాలను వారు పాటిస్తారు.
5అందుకు పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, “నీ శిష్యులు ఎందుకు పెద్దల సాంప్రదాయాన్ని పాటించకుండా అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు?” అని యేసును అడిగారు.
6అందుకు ఆయన వారితో, “వేషధారులారా, మీ గురించి ఇలా యెషయా ప్రవచించింది నిజమే; అక్కడ వ్రాయబడి ఉన్నట్లు:
“ ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు
కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి.
7వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు;
వారి బోధలు కేవలం మానవ నియమాలు మాత్రమే.’#7:7 యెషయా 29:13
8మీరు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం విడిచిపెట్టి మానవ ఆచారాలకు కట్టుబడి ఉన్నారు” అన్నారు.
9ఆయన ఇంకా మాట్లాడుతూ, “మీరు మీ సొంత సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను పూర్తిగా ప్రక్కకు పెట్టేస్తున్నారు! 10మోషే, ‘మీ తండ్రిని తల్లిని గౌరవించాలి’#7:10 నిర్గమ 20:12; ద్వితీ 5:16 ‘ఎవరైనా తల్లిని గాని తండ్రిని గాని శపిస్తే, వారికి మరణశిక్ష విధించాలి’#7:10 నిర్గమ 21:17; లేవీ 20:9 అని ఆజ్ఞాపించాడు. 11కానీ మీరు, ఒక వ్యక్తి తన తల్లితో గాని తండ్రితో గాని నా వల్ల మీరు పొందదగిన సహాయమంతా కొర్బాన్ (అంటే దేవునికి అంకితం) అని ప్రకటిస్తే, 12వాడు తన తండ్రికి తల్లికి ఏమి చేయనక్కరలేదు అని చెప్తున్నారు. 13ఈ విధంగా మీరు నియమించుకొన్న మీ సాంప్రదాయం వలన దేవుని వాక్యాన్ని అర్థం లేనిదానిగా చేస్తున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నో మీరు చేస్తున్నారు” అని చెప్పారు.
14యేసు జనసమూహాన్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కరు, నా మాట విని, గ్రహించండి. 15బయట నుండి లోపలికి వెళ్లేవీ ఒకరిని అపవిత్రపరచవు. కాని లోపలి నుండి బయటకు వచ్చేవి మాత్రమే వారిని అపవిత్రులుగా చేస్తాయి. 16వినడానికి చెవులు కలవారు విందురు గాక!” అని అన్నారు.#7:16 కొన్ని ప్రతులలో ఈ వచనాలు ఇక్కడ చేర్చబడలేదు
17ఆయన ఆ జనసమూహాన్ని విడిచి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత, ఆయన శిష్యులు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగారు. 18ఆయన, “మీరు ఇంత బుద్ధిహీనులా? బయట నుండి లోపలికి వెళ్లేది ఏది ఒకరిని అపవిత్రపరచదని మీరు చూడలేదా? అని అడిగారు. 19ఎందుకంటే అది వాని హృదయంలోకి వెళ్లదు, కాని కడుపులోనికి వెళ్లి, తర్వాత శరీరం నుండి బయటకు విసర్జింపబడుతుంది.” (ఈ విషయాన్ని చెప్తూ, భోజనపదార్ధాలన్ని పవిత్రమైనవే అని యేసు ప్రకటించారు.)
20ఆయన ఇంకా మాట్లాడుతూ, “ఓ వ్యక్తి లోపలినుండి ఏవైతే బయటకు వస్తాయో అవే వారిని అపవిత్రపరుస్తాయి. 21ఎందుకంటే, అంతరంగంలో నుండి లైంగిక అనైతికత, దొంగతనం, నరహత్య, 22వ్యభిచారం, దురాశ, పగ, మోసం, అశ్లీలత, అసూయ, దూషణ, అహంకారం, అవివేకం లాంటి దుష్ట ఆలోచనలు వస్తాయి. 23ఈ దుష్టమైనవన్ని లోపలినుండే బయటకు వచ్చి వ్యక్తిని అపవిత్రపరుస్తాయి” అన్నారు.
సిరియా ఫెనికయాకు చెందిన స్త్రీ విశ్వాసాన్ని గౌరవించిన యేసు
24యేసు అక్కడినుండి లేచి తూరు ప్రాంతానికి వెళ్లారు. ఆయన ఒక ఇంట్లో ప్రవేశించి తాను అక్కడ ఉన్నట్లు ఎవరికి తెలియకూడదని కోరుకున్నారు; కాని, తాను అక్కడ ఉన్నాననే సంగతిని ఆయన రహస్యంగా ఉంచలేకపోయారు. 25ఒక స్త్రీ ఆయన గురించి విన్న వెంటనే, వచ్చి ఆయన పాదాల మీద పడింది. ఆమె చిన్నకుమార్తెకు అపవిత్రాత్మ పట్టింది. 26ఆ స్త్రీ, సిరియా ఫెనికయాలో పుట్టిన గ్రీసుదేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యాన్ని వెళ్లగొట్టమని యేసును వేడుకొంది.
27ఆయన ఆమెతో, “మొదట పిల్లలను వారు కోరుకున్నంతా తిననివ్వాలి, ఎందుకంటే పిల్లల రొట్టెలను తీసుకుని కుక్కలకు వేయడం సరికాదు” అన్నారు.
28అందుకు ఆమె, “ప్రభువా, బల్లక్రింద ఉండే కుక్కలు కూడా పిల్లలు పడవేసే రొట్టె ముక్కలను తింటాయి” అని జవాబిచ్చింది.
29అందుకు ఆయన, “జవాబు బాగుంది! నీవు వెళ్లు; నీ కుమార్తెను దయ్యం వదిలిపోయింది” అని చెప్పారు.
30ఆమె ఇంటికి వెళ్లి, తన కుమార్తె మంచం మీద పడుకుని ఉండడం, దయ్యం ఆమెను వదిలిపోయింది.
చెవిటి, నత్తి కలిగిన వ్యక్తిని స్వస్థపరచిన యేసు
31యేసు తూరు పట్టణ ప్రాంతాన్ని విడిచి సీదోను ద్వారా, గలిలయ సముద్రం దెకపొలి#7:31 అంటే, పది పట్టణాలు ప్రాంతాలకు వెళ్లారు. 32అక్కడ కొందరు చెవుడు, నత్తి ఉన్న ఒకన్ని ఆయన దగ్గరకు తీసుకువచ్చి, వాని మీద చేయి ఉంచమని ఆయనను వేడుకున్నారు.
33యేసు జనసమూహంలో నుండి వానిని ప్రక్కకు తీసుకెళ్లి, వాని చెవుల్లో తన వ్రేళ్ళను ఉంచారు. తర్వాత ఆయన ఉమ్మివేసి, వాని నాలుకను ముట్టారు. 34ఆయన ఆకాశం వైపు చూసి నిట్టూర్పు విడిచి వానితో, “ఎప్ఫతా!” అన్నారు. (ఆ మాటకు “తెరుచుకో!” అని అర్థం.) 35వెంటనే వాని చెవులు తెరువబడ్డాయి, అలాగే వాని నాలుక సడలి వాడు తేటగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
36ఆ సంగతి ఎవ్వరితో చెప్పవద్దని యేసు గుంపును ఆదేశించారు. కాని ఆయన ఎంత ఖచ్చితంగా చెప్పారో, వారు అంత ఎక్కువగా దానిని ప్రకటించారు. 37“ఆయన చెవిటివారిని వినగలిగేలా, మూగవారిని మాట్లాడేలా చేస్తూ, అన్నిటిని బాగు చేస్తున్నారు” అని చెప్పుకుంటూ ప్రజలు ఆశ్చర్యంతో నిండిపోయారు.

Zvýraznění

Sdílet

Kopírovat

None

Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas

Video k మార్కు సువార్త 7