Logo YouVersion
Ikona vyhledávání

మార్కు సువార్త 6

6
ఘనత పొందని ప్రవక్త
1యేసు తన శిష్యులతో కలిసి, అక్కడినుండి తన స్వగ్రామానికి వెళ్లారు. 2సబ్బాతు దినాన, సమాజమందిరంలో ఆయన బోధించడం మొదలుపెట్టారు. ఆయన బోధ విని అనేకమంది ఆశ్చర్యపడ్డారు.
“ఎక్కడ నుండి ఇతనికి ఇవి వచ్చాయి? ఈయనకు ఇవ్వబడిన ఈ జ్ఞానం ఏంటి? ఈయన చేస్తున్న ఈ అద్భుతాలు ఏంటి? 3ఇతడు ఒక వడ్రంగివాడు కాడా? ఇతడు మరియ కుమారుడు కాడా? యాకోబు, యోసే, యూదా, సీమోను ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరీలు ఇక్కడ మనతో లేరా?” అని చెప్పుకుంటూ ఆయన విషయంలో అభ్యంతరపడ్డారు.
4అందుకు యేసు వారితో, “ఒక ప్రవక్త తన స్వగ్రామంలో, తన సొంత బంధువుల మధ్యలో తన సొంత ఇంట్లో తప్ప అంతటా గౌరవం పొందుతాడు” అని అన్నారు. 5కొద్దిమంది రోగుల మీద మాత్రమే యేసు చేతులుంచి వారిని బాగుచేశారు తప్ప మరి ఏ అద్భుతాలు అక్కడ చేయలేదు. 6ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు.
పన్నెండుమంది శిష్యులను సేవకు పంపిన యేసు
తర్వాత యేసు బోధిస్తూ చుట్టూ ఉన్న గ్రామ గ్రామానికి వెళ్లారు. 7ఆయన పన్నెండుమందిని దగ్గరకు పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టడానికి వారికి అధికారం ఇచ్చి, వారిని ఇద్దరిద్దరిగా పంపించడం మొదలుపెట్టారు.
8-9ఆయన వారికిచ్చిన సూచనలు ఇవే: “ప్రయాణానికి చేతికర్ర తప్ప వేరే ఏది తీసుకెళ్లకూడదు. ఆహారం కాని, చేతిలో సంచి కానీ, నడికట్టులో డబ్బు కాని తీసుకుని వెళ్లకూడదు. చెప్పులు వేసుకోండి కాని ఒక అంగీ ఎక్కువ తీసుకెళ్లకూడదు. 10మీరు ఒక ఇంట్లో ప్రవేశించినప్పుడు, అక్కడినుండి వెళ్లేవరకు ఆ ఇంట్లోనే బసచేయండి. 11ఏ స్థలంలోనైనా ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే లేదా మీ మాటలు వినకపోతే, మీరు అక్కడినుండి బయలుదేరే ముందు వారికి సాక్ష్యంగా ఉండడానికి మీ పాదాల దుమ్మును అక్కడ దులిపి వెళ్లండి.”
12శిష్యులు వెళ్లి, ప్రజలు పశ్చాత్తాపపడాలని ప్రకటించారు. 13వారు అనేక దయ్యాలను వెళ్లగొట్టారు అనేక రోగులను నూనెతో ముట్టి వారిని బాగుచేశారు.
బాప్తిస్మమిచ్చే యోహాను శిరచ్ఛేదనం
14యేసు పేరు ప్రసిద్ధిచెందడం గురించి రాజైన హేరోదుకు తెలిసింది. కొందరు, “బాప్తిస్మమిచ్చే యోహాను చనిపోయి మళ్ళీ బ్రతికాడు, అందుకే ఇతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి” అని చెప్తున్నారు.
15మరికొందరు, “ఈయన ఏలీయా” అన్నారు.
ఇంకొందరు, “ఈయన పూర్వకాల ప్రవక్తల్లో ఒక ప్రవక్తలాంటివాడు” అని చెప్పుకొన్నారు.
16అయితే హేరోదు ఇదంతా విని, “నేను తల నరికించిన యోహాను ఇతడేనా, ఇతడు చావు నుండి లేచాడా!” అనుకున్నాడు.
17ఎందుకంటే, హేరోదు తన సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియను పెళ్ళి చేసుకున్నప్పుడు, “నీ సహోదరుని భార్యను నీవు ఉంచుకోవడం న్యాయం కాదు” అని యోహాను హేరోదుతో అంటూ ఉండేవాడు. 18హేరోదు ఆమె కోసం యోహానును బంధించి చెరసాలలో వేయమని ఆదేశాన్ని జారీ చేశాడు. 19హేరోదియ యోహానును చంపాలని చూసింది. కాని అలా చెయ్యలేకపోయింది. 20ఎందుకనగా యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు అని హేరోదు తెలుసుకొని అతనికి భయపడి అతని కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలను విన్నప్పుడు ఎంతో కలవరపడే వాడు; అయినా అతని మాటలను వినడానికి ఇష్టపడేవాడు.
21చివరికి సరియైన సమయం రానే వచ్చింది. హేరోదు తన జన్మదినం సందర్భంగా తన ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలయ ప్రాంత ప్రముఖులకు విందు ఇచ్చాడు. 22అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యంచేసి హేరోదును అతని అతిథులను సంతోషపరిచింది.
అందుకు రాజు ఆమెతో, “నీకు ఏమి కావాలో అడుగు, నేను ఇస్తాను” అని అన్నాడు. 23అతడు, “నీవు ఏది అడిగినా నేను ఇస్తాను, నా రాజ్యంలో సగం అడిగినా ఇచ్చేస్తాను!” అని ఆమెతో ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేశాడు.
24కాబట్టి ఆమె బయటకు వెళ్లి తన తల్లిని, “నేనేమి అడగాలి?” అని అడిగింది.
అందుకు ఆమె తల్లి, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను అడుగు” అని చెప్పింది.
25వెంటనే ఆమె రాజు దగ్గరకు త్వరగా వెళ్లి, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను పళ్లెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించాలని కోరుకొంటున్నాను” అని చెప్పింది.
26రాజు ఎంతో దుఃఖించాడు, కాని తనతో కూడ భోజనానికి కూర్చున్న అతిథులు తాను చేసిన ప్రమాణం కోసం ఆమె అడిగిన దానిని కాదనలేకపోయాడు. 27అందువల్ల రాజు వెంటనే ఒక సైనికున్ని పిలిచి, యోహాను తలను తెమ్మని ఆదేశించి పంపించాడు. వాడు వెళ్లి, చెరసాలలో యోహాను తలను నరికి, 28ఆ తలను పళ్లెంలో పెట్టి తీసుకువచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాడు, ఆమె దానిని తన తల్లికి ఇచ్చింది. 29ఈ సంగతి విన్న యోహాను శిష్యులు వచ్చి, అతని శవాన్ని తీసుకెళ్లి సమాధి చేశారు.
అయిదు వేలమందికి ఆహారం పెట్టిన యేసు
30అపొస్తలులు యేసు చుట్టూ గుమికూడి తాము బోధించినవి, తాము చేసినవి ఆయనకు తెలియజేశారు. 31అనేకమంది వస్తూ పోతూ ఉండడంతో వారికి భోజనం చేయడానికి కూడా అవకాశం దొరకలేదు. కాబట్టి ఆయన, “మీరు నాతో కూడా ఏకాంత స్థలానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి” అని చెప్పారు.
32కాబట్టి వారు పడవ ఎక్కి ఏకాంత స్థలానికి వెళ్లారు. 33అయితే వారు వెళ్తున్నారని చూసిన అనేకమంది వారిని గుర్తుపట్టి, అన్ని పట్టణాల నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి వారికంటే ముందే ఆ స్థలానికి చేరుకొన్నారు. 34యేసు పడవ దిగి, గొప్ప జనసమూహం రావడం చూసినప్పుడు, వారు కాపరి లేని గొర్రెలవలె ఉన్నారని వారి మీద కనికరపడ్డారు. వారికి అనేక సంగతులను బోధించడం మొదలుపెట్టారు.
35అప్పటికి ప్రొద్దుపోయే సమయం అయ్యింది, కాబట్టి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం, పైగా ఆలస్యం కూడా అవుతుంది. 36కాబట్టి జనాన్ని పంపివేయండి, వారే చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు” అన్నారు.
37అందుకు యేసు, “మీరే వారికి భోజనం పెట్టండి” అన్నారు.
అందుకు వారు, “రెండువందల దేనారాల కంటే ఎక్కువవుతుంది. మేము వెళ్లి, అంత డబ్బు ఖర్చుపెట్టి రొట్టెలను కొని, వారికి పెట్టాలా?” అని ఆయనను అడిగారు.
38అందుకు ఆయన, “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? వెళ్లి చూడండి” అని అడిగారు.
వారు వెళ్లి చూసి, “అయిదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అన్నారు.
39అప్పుడు ఆయన వారందరిని గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోపెట్టమని శిష్యులతో చెప్పారు. 40వారు వంద యాభైల చొప్పున గుంపులుగా కూర్చున్నారు. 41అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి, కృతజ్ఞత చెల్లించి ఆ రొట్టెలను విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు. ఆయన ఆ రెండు చేపలను కూడా వారందరికి విభజించారు. 42వారందరు తిని తృప్తి పొందారు. 43తర్వాత శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు. 44తిన్న వారి సంఖ్య అయిదు వేలమంది పురుషులు.
నీటి మీద నడిచిన యేసు
45వెంటనే యేసు జనసమూహాన్ని పంపివేస్తూ తన శిష్యులు తనకన్న ముందుగా బేత్సయిదా గ్రామానికి వెళ్లేలా వారిని పడవ ఎక్కించారు. 46వారిని పంపివేసిన తర్వాత, ఆయన ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్లారు.
47ఆ రాత్రి సమయాన, ఆ పడవ సరస్సు మధ్యలో ఉంది, ఆయన ఒంటరిగా నేలపైన ఉన్నారు. 48ఎదురుగాలి వీస్తుండడంతో, శిష్యులు పడవను చాలా కష్టపడుతూ నడపడం యేసు చూశారు. రాత్రి నాల్గవ జామున#6:48 అంటే, ఉదయం మూడు గంటలకు ఆయన సరస్సు మీద నడుస్తూ, వారి దగ్గరకు వెళ్లారు. 49కాని ఆయన నీళ్ల మీద నడవటం వారు చూసినప్పుడు, భూతం అనుకుని వారు కేకలు వేశారు, 50ఎందుకంటే వారందరు ఆయనను చూసి భయపడ్డారు.
వెంటనే ఆయన వారితో, “ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి!” అన్నారు. 51అప్పుడు ఆయన వారితో పడవలోనికి ఎక్కారు, అప్పుడు గాలి అణగిపోయింది. వారు ఎంతో ఆశ్చర్యపడ్డారు. 52రొట్టెల అద్భుతం యొక్క ప్రాముఖ్యతను వారు ఇంకా అర్థం చేసుకోలేదు; వారి హృదయాలు కఠినమయ్యాయి.
53వారు అవతలకు వెళ్లి, గెన్నేసరెతు అనే ప్రాంతంలో దిగారు, అక్కడ లంగరు వేశారు. 54వారు పడవ దిగగానే, ప్రజలు యేసును గుర్తుపట్టారు. 55వారు ఆ ప్రాంతమంతా పరుగెత్తుకొనిపోయి, ఆయన ఎక్కడ ఉన్నాడని విన్నారో అక్కడికి రోగులను పరుపుల మీద మోసుకొచ్చారు. 56యేసు గ్రామాలకు, పట్టణాలకు, పల్లెటూళ్ళకు, ఎక్కడికి వెళ్లినా వారు రోగులను తెచ్చి సంత వీధుల్లో ఉంచారు. ఆయన వస్త్రపు అంచునైనా ముట్టనివ్వండని వారు ఆయనను బ్రతిమాలారు. ఆయనను ముట్టిన వారందరు స్వస్థత పొందారు.

Zvýraznění

Sdílet

Kopírovat

None

Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas

Video k మార్కు సువార్త 6