రోమా 14
14
బలహీనుడు మరియు బలవంతుడు
1వివాదస్పదమైన అంశాలపై వాదాలను పెట్టుకోవద్దు, కాని విశ్వాసంలో బలహీనంగా ఉన్న వారిని అంగీకరించండి. 2ఒకని విశ్వాసం దేనినైనా తినడానికి అంగీకరిస్తుంది కాని, బలహీనమైన విశ్వాసం కలవారు కేవలం కూరగాయలనే తింటారు. 3అన్నిటిని తినేవారు అలా తినని వారిని తిరస్కరించకూడదు, అదే విధంగా అన్నిటిని తిననివారు తినేవారిని తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే దేవుడు వారిని అంగీకరించాడు. 4మరొకరి సేవకుడికి తీర్పు తీర్చడానికి నీవు ఎవరు? ఆ సేవకుడు నిలిచివుండాలన్నా లేక పడిపోవాలన్నా అది అతని సొంత యజమాని చూసుకుంటాడు. ప్రభువు వారిని నిలబెట్టడానికి శక్తిగలవాడు కనుక వారు నిలబడతారు.
5ఒకరు ఒక రోజు మరొక రోజు కన్నా మంచిదని భావిస్తారు, మరొకరు అన్ని రోజులు ఒకేలాంటివని భావిస్తారు. వారిరువురు తమ మనస్సులలో దానిని పూర్తిగా నమ్ముతారు. 6ఒక రోజును మంచి రోజుగా భావించేవారు ప్రభువు కొరకే భావిస్తున్నారు. మాంసాన్ని తినేవారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు కనుక వారు ప్రభువు కొరకే తింటున్నారు. ఆ విధంగా చేయనివారు కూడా ప్రభువు కొరకే చేస్తున్నారు, దేవునికి కృతజ్ఞతలను చెల్లిస్తున్నారు. 7మనలో ఎవరు కేవలం తన కొరకు మాత్రమే జీవించరు, తన కొరకు మాత్రమే మరణించరు. 8మనం జీవిస్తే అది ప్రభువు కొరకే జీవిస్తాము, మరణిస్తే అది ప్రభువు కొరకే మరణిస్తాం, కనుక మనం జీవించినా మరణించినా ప్రభువుకు చెందినవారం అవుతాము. 9ఈ కారణంగానే, క్రీస్తు తాను మరణించినవారికి జీవించి ఉన్నవారికి ప్రభువుగా ఉండడానికి ఆయన మరణించి తిరిగి సజీవంగా లేచారు.
10అయితే మనమందరం దేవుని న్యాయసింహాసనం యెదుట నిలబడవలసి ఉండగా మీరు మీ సహోదరీ సహోదరులకు ఎందుకు తీర్పు తీర్చుతున్నారు? మీరు వారిని ఎందుకు తిరస్కరిస్తున్నారు? 11దీని కొరకు లేఖనంలో,
“ప్రభువు ఇలాచెప్తున్నాడు, ‘నేను జీవించినంత ఖచ్చితంగా,
ప్రతి మోకాలు నా యెదుట వంగును,
ప్రతి నాలుక దేవుని అంగీకరించును,’#14:11 యెషయా 45:23 ”
అని వ్రాయబడి ఉంది. 12కనుక, మనలో ప్రతి ఒక్కరం మన గురించి మనం దేవునికి లెక్క అప్పగించాలి.
13కాబట్టి ఒకరిపై ఒకరు తీర్పు తీర్చడం మానేద్దాం. దానికి బదులు, సహోదరి లేదా సహోదరుని మార్గంలో ఆటంకంగా ఉండకుండా మీ మనస్సును సిద్ధపరచుకోండి. 14యేసు ప్రభువులో అంగీకరించబడిన వాటిలో అపవిత్రమైనది ఏదీ లేదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాని ఎవరైనా ఒక దానిని అపవిత్రమైనదని భావిస్తే వానికి అది అపవిత్రమైనదే. 15నీవు తినే దానిని బట్టి నీ సహోదరి లేదా సహోదరుడు దుఃఖపడితే, నీవు ప్రేమ చూపడం లేదన్నట్టు. ఎవరి కోసమైతే క్రీస్తు చనిపోయాడో వారిని నీవు తినే దానిని బట్టి నాశనం చేయకు. 16కనుక నీకు మంచిదని తెలిసిన దాన్ని చెడ్డదని మాట్లాడుకునేలా చేయకు. 17దేవుని రాజ్యం తిని త్రాగే వాటికి సంబంధించింది కాదు గాని, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందానికి సంబంధించింది. 18కాబట్టి ఇలా క్రీస్తుకు సేవ చేసేవారు దేవుని సంతోషపరుస్తారు, మానవుల అంగీకారాన్ని పొందుతారు.
19కాబట్టి ఏది మనల్ని సమాధానం వైపు, పరస్పర వృద్ధి వైపుకు నడిపిస్తుందో దాన్ని మనం చేద్దాం. 20ఆహారం గురించి దేవుని పనిని నాశనం చేయవద్దు. ఆహారమంతా శుభ్రమైనదే, కాని మరొకరికి ఆటంకాన్ని కలిగించేది తినేవానికి అది తప్పవుతుంది. 21మాంసం తినకపోవడం గాని మద్యం త్రాగకపోవడం గాని మీ సహోదరులు లేక సహోదరీలు పడిపోయేలా చేసే ఏదైనా చేయకపోవడమే మంచిది.
22వీటి గురించి మీకు గల నమ్మకాన్ని మీకు దేవునికి మధ్యనే ఉండనివ్వండి. తాను అంగీకరించిన వాటిని బట్టి శిక్ష పొందనివారు దీవించబడినవారు. 23అయితే సందేహంతో తినేవారు విశ్వాసం కలిగి తినలేదు కనుక శిక్ష పొందుతారు. విశ్వాసం లేకుండా చేసే ప్రతిది పాపమే అవుతుంది.
Currently Selected:
రోమా 14: TCV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.