YouVersion Logo
Search Icon

పరమ గీతము 4

4
అతను ఆమెతో అంటున్నాడు
1నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు!
ఆహా, నువ్వు సుందరంగా ఉన్నావు!
నీ మేలి ముసుగు క్రింద
నీ కళ్లు పావురాల కళ్లలా ఉన్నాయి.
నీ శిరోజాలు పొడుగ్గా గిలాదు పర్వత సానువుల కింద
నృత్యం చేసే మేకపిల్లల్లా జారుతున్నాయి.
2గొడ్డువి కాక, కవలపిల్లల్ని కలిగి,
కత్తరించబడి, కడుగబడి, పైకి వస్తున్న
తెల్ల గొర్రె మందల్ని పోలినవి నీ పళ్లు.
3నీ పెదవులు ఎర్ర పట్టు దారంలా ఉన్నాయి.
నీ నోరు అందంగా ఉంది
నీ మేలి ముసుగు క్రింద నీ చెక్కిళ్లు రెండు
దానిమ్మపండు చెక్కల్లా ఉన్నాయి.
4నీ మెడ పొడుగ్గా సన్నగా
జయ సూచకాల్ని ఉంచే దావీదు గోపురంలా ఉంది
శక్తిమంతులైన సైనికుల డాళ్లు
వెయ్యి డాళ్ళు దాని గోడల మీద
అలంకరించడం కోసం ఆ గోపురాన్ని కట్టారు.
5నీ స్తనాలు,
తెల్ల కలువల్లో మేస్తున్న కవల జింక పిల్లల్లా ఉన్నాయి
కవల దుప్పి పిల్లల్లా ఉన్నాయి.
6సూర్యాస్తమయ వేళ, నీడలు కనుమరుగయ్యే వేళ
నేను ఆ గోపరస పర్వతానికి వెళ్తాను
ఆ సాంబ్రాణి కొండకు వెళ్తాను.
7నా ప్రియురాలా! నీ శరీరమంతా అందంగానే ఉంది.
నీకెక్కడా వికారమైన గుర్తుల్లేవు!
8నా వధువా! లెబానోను నుండి
నాతోరా! లెబానోనునుండి నాతోరా.
అమాన పర్వత శిఖరాన్నుండి
శెనీరు హెర్మోనుల కొండకొనల నుండి
సింహపు గుహల నుండి
చిరుత పులుల పర్వతాలనుండి రమ్ము!
9నా ప్రియురాలా!#4:9 ప్రేయసీ శబ్ధార్థ ప్రకారం “సోదరి.” నా ప్రియ వధువా,
నీవు నన్ను ఉద్రేక పరుస్తావు.
ఒకే ఒక చూపుతో
నీ హారంలోని ఒకే ఒక రత్నంతో
నా హృదయాన్ని దోచుకున్నావు.
10నా ప్రియురాలా! నా ప్రియ వధువా, నీ ప్రేమ చాలా సుందరమైనది
ద్రాక్షారసంకన్నా నీ ప్రేమ మధురమైంది,
నీ పరిమళ ద్రవ్యపు సువాసన
ఏ రకమైన సుగంధ ద్రవ్యంకన్నా గొప్పది!
11నా ప్రియవధువా, నీ పెదవులు తేనె లూరుతున్నాయి
నీ నాలుక (కింద) నుంచి తేనే, పాలూ జాలువారుతున్నాయి
నీ దుస్తులు మధుర పరిమళాన్ని#4:11 మధుర పరిమళాలు పరిమళ ద్రవ్యం లేక “లెబానోను.” గుబాళిస్తున్నాయి.
12నా నా ప్రియురాలా! నా ప్రియ వధువా, నీవు నిష్కళంకురాలివి.
మూయబడిన ఉద్యానవనం వలె,
మూయబడిన జలాశయంవలె,
మూయబడిన జలధారలవలె స్వచ్ఛమైనదానవు.
13నీ శరీరమొక తోటను పోలినది
దానిమ్మ వృక్షాలతో తదితర మధుర ఫల వృక్షాలతో గోరింట, జటా మాంసి,
14కుంకుమ పువ్వు, నిమ్మగడ్డి, లవంగ, సాంబ్రాణి బోళం, అగరు యిత్యాది
అతి శ్రేష్ట సుగంధ ద్రవ్యాలనిచ్చే తరులతాదులతో
నిండిన సుందర వనాన్ని పోలినది.
15నీవు ఉద్యాన జలాశయం వంటిదానివి,
మంచినీటి ఊటల బావిలాంటిదానివి,
లెబానోను పర్వతం నుంచి జాలువారే సెలయేరు వంటిదానివి.
ఆమె అంటుంది
16ఉత్తర పవనమా లే!
దక్షిణ పవనమా రా!
నా ఉద్యానవనంపై వీచి,
దాని మధుర సౌరభాన్ని వెద జల్లండి.
నా ప్రియుడు తన ఉద్యానవనానికి రావాలి
అందలి మధుర ఫలాలు ఆరగించాలి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in