సామెతలు 23
23
— 6 —
1నీవు ఒక ప్రముఖునితో భోజనానికి కూర్చున్నప్పుడు, నీవు ఎవరితో ఉన్నావో జ్ఞాపకం ఉంచుకో. 2నీకు చాలా ఆకలిగా ఉన్నాసరే, ఎప్పుడూ మరీ ఎక్కువ తినవద్దు. 3అతడు వడ్డించే శ్రేష్ఠమైం భోజనం మరీ ఎక్కువ తినవద్దు. అది ఒక ఎత్తుగడకావచ్చు.
— 7 —
4ధనవంతుడు అవ్వాలనుకొని, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నీవు బుద్ధిమంతుడవైతే ఓర్పుతో ఉండు. 5పక్షులు రెక్కలెలా విచ్చుకొని ఎగురుతాయో అదే విధంగా డబ్బు చాలా తొందరగా వెళ్లిపోతుంది.
— 8 —
6స్వార్థపరునితో కలిసి భోజనం చేయవద్దు. అతనికి వచ్చిన ప్రత్యేక భోజన పదార్థాలకు దూరంగా ఉండు. 7అతడు ఎంతసేపూ ఖర్చు గూర్చి ఆలోచించే రకం. “తినుము, త్రాగుము” అని అతడు నీతో చెప్పవచ్చు. కాని అతడు నిజంగా కోరుకునేది అదికాదు. 8అతని భోజనం నీవు తింటే, నీవు రోగివి కావచ్చు. నీవు యిబ్బంది పడిపోతావు.
— 9 —
9తెలివి తక్కువ వానికి నేర్పించేందుకు ప్రయత్నించకు. జ్ఞానముగల నీ మాటలను అతడు ఎగతాళి చేస్తాడు.
— 10 —
10ఆస్తి పాత సరిహద్దు గీతను ఎన్నడూ జరపవద్దు. మరియు అనాధలకు చెందిన భూమిని ఎన్నడూ తీసికొనవద్దు. 11యెహోవా నీకు విరోధంగా ఉంటాడు. యెహోవా శక్తిగలవాడు, అనాధలను ఆయన కాపాడుతాడు.
— 11 —
12నీ ఉపదేశకుని మాటలు విని నీకు చేతనైనంత నేర్చుకో.
— 12 —
13ఒక బిడ్డకు శిక్ష అవసరమైనప్పుడెల్లా శిక్షించు. వానిని దెబ్బలు కొట్టడం వానికేమీ బాధ కలిగించదు. 14నీవు వానిని కొట్టినట్లయితే నీవు వాని జీవితం కాపాడవచ్చు.
— 13 —
15నా కుమారుడా, నీవు జ్ఞానముగల వాడివైతే నాకెంతో సంతోషం. 16నీవు సరైన సంగతులు చెబుతూ ఉంటే నేను విని నా హృదయంలో ఎంతో సంతోషిస్తాను.
— 14 —
17దుర్మార్గులను చూచి అసూయపడకు. అయితే యెహోవాను గౌరవించేందుకు ఎల్లప్పుడూ నీవల్ల అయినంత గట్టిగా ప్రయత్నించు. 18ఎల్లప్పుడూ ఆశ ఉంటుంది. ఆ ఆశ ఎన్నటికీ పోదు.
— 15 —
19కనుక నా కుమారుడా ఆలకించి, జ్ఞానముగలవానిగా ఉండు. సరైన జీవితం జీవించేందుకు ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి ఉండు. 20ద్రాక్షారసం విపరీతంగా తాగుతూ, విపరీతంగా భోజనం చేసే వారితో స్నేహంగా ఉండవద్దు. 21విపరీతంగా తాగి, విపరీతంగా తినే మనుష్యులు దరిద్రులు అవుతారు. తిని, తాగి నిద్రపోవటమే వాళ్లు చేసేది అంతాను. కనుక త్వరలోనే వారికి ఏమీ ఉండదు.
— 16 —
22నీ తండ్రి నీతో చెప్పే విషయాలు విను. నీ తండ్రి లేకుండా నీవు ఎన్నడూ పుట్టి ఉండేవాడివి కావు. నీ తల్లి వృద్ధురాలైనప్పుడు కూడా ఆమెను గౌరవించు. 23సత్యము, జ్ఞానము, అభ్యాసము, వివేకము, ఇవి డబ్బు చెల్లించదగినంత విలువగలవి. అవి అమ్మేందుకు మరీ విపరీతమైన విలువగలవి. 24ఒక మంచి మనిషి యొక్క తండ్రి చాలా సంతోషంగా ఉంటాడు. ఒక మనిషికి జ్ఞానముగల బిడ్డ ఉంటే, ఆ బిడ్డ ఆనందం కలిగిస్తుంది. 25అందుచేత నీ విషయంలో నీ తల్లిదండ్రులను సంతోషించనివ్వు. నీ తల్లిని ఆనందించనిమ్ము.
— 17 —
26నా కుమారుడా, నేను చెప్పే దానిని జాగ్రత్తగా వినుము. నా జీవితం నీకు ఒక ఉదాహరణగా ఉంచుకో. 27వేశ్యలు, చెడు స్త్రీలు ఒక ఉచ్చులాంటివారు. నీవు బయట పడలేనంత లోతైన బావిలాంటివారు. 28ఒక చెడు స్త్రీ, ఒక దొంగలా నీ కోసం పొంచి ఉంటుంది. అనేక మందిని పాపులు అయ్యేటట్టుగా ఆమె చేస్తుంది.
— 18 —
29-30ద్రాక్షారసం, ఘాటు పానీయాలు విపరీతంగా తాగే మనుష్యులకు అవి చాలా చెడు చేస్తాయి. ఆ మనుష్యులకు చాలా కొట్లాటలు, వివాదాలు ఉంటాయి. వారి కళ్లు ఎర్రగా ఉండి వారు తూలిపోతూ, వాళ్లను వాళ్లే బాధ పెట్టుకుంటారు. వారు ఈ కష్టాలను తప్పించుకొని ఉండగలిగేవారే.
31అందుచేత ద్రాక్షారసం విషయం జాగ్రత్తగా ఉండు. అది అందంగా, ఎర్రగా ఉంటుంది. పాత్రలో అది మెరుస్తుంది. నీవు దానిని తాగినప్పుడు బాగున్నట్టు అనిపిస్తుంది. 32కాని అంతలో అది ఒక సర్పంలా కాటువేస్తుంది.
33ద్రాక్షారసం నీవు వింత విషయాలను చూచేటట్టుగా చేస్తుంది. నీ మనస్సు గందరగోళం అవుతుంది. 34నీవు పండుకొన్నప్పుడు నీవు ఉప్పొంగుతున్న సముద్రంమీద ఉన్నట్టుగా నీవు అనుకొంటావు. నీవు ఒక ఓడమీద పండుకొన్నట్టుగా నీకు అనిపిస్తుంది. 35“వారు నన్ను కొట్టారు. కాని నాకేమీ అనిపించలేదు. వారు నన్ను కొట్టారు. కాని అది నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు నేను లేవలేను. నేను మరోసారి తాగాలి” అని నీవు చెబుతావు.
Currently Selected:
సామెతలు 23: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International