సామెతలు 22
22
1ఐశ్వర్యవంతునిగా ఉండుటకంటే గౌరవింపబడటం మేలు. బంగారం, వెండి కంటే మంచి పేరు ఎక్కువ ముఖ్యం.
2ధనికులు, దరిద్రులు అంతా ఒక్కటే. వాళ్లందరినీ యెహోవాయే సృష్టించాడు.
3జ్ఞానముగలవారు కష్టం రావటం చూచి దాని దారిలో నుండి తప్పుకొంటారు. కాని తెలివి తక్కువ వాళ్లు తిన్నగా కష్టంలోనికి వెళ్లి, దాని మూలంగా శ్రమపడతారు.
4యెహోవాను గౌరవించి దీనుడవుగా ఉండు. అప్పుడు నీకు ఐశ్వర్యం, ఘనత నిత్యజీవం ఉంటాయి.
5దుర్మార్గులు అనేక కష్టాలవల్ల పట్టుబడతారు. అయితే తన ఆత్మ విషయం జాగ్రత్త గలవాడు కష్టాలకు దూరంగా ఉంటాడు.
6ఒక బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే, జీవిచుటకు సరైన మార్గం నేర్చించు. అప్పుడు ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు కూడ ఆ మార్గంలోనే జీవించటానికి కొనసాగిస్తాడు.
7పేదవాళ్లు ధనికులకు సేవకులు. అప్పు పుచ్చుకొనేవాడు, అప్పు ఇచ్చేవానికి సేవకుడు.
8కష్టాలను కలిగించే మనిషి కష్టాల పంటనే కోస్తాడు. ఆ మనిషి ఇతరులకు కలిగించిన కష్టాల మూలంగా చివరికి అతడు నాశనం చేయబడతాడు.
9ధారాళంగా ఇచ్చేవాడు ఆశీర్వదించబడతాడు. అతడు తన ఆహారం పేదవారితో పంచుకొంటాడు. గనుక ఆశీర్వదించబడుతాడు.
10ఒక వ్యక్తి యితరులకంటె తానే మంచివాడిని అని తలిస్తే, వానిని బలవంతంగా వెళ్లగొట్టండి. అతడు వెళ్లి పోయినప్పుడు అతనితోబాటు ఆ కష్టం కూడా వెళ్లిపోతుంది. అంతటితో వివాదాలు అంతరిస్తాయి.
11పవిత్ర హృదయం, దయగల మాటలను నీవు ప్రేమిస్తే రాజు నీ స్నేహితుడు అవుతాడు.
12యెహోవాను ఎరిగిన మనుష్యులను ఆయన కాపాడుతూ, భద్రంగా ఉంచుతాడు. కాని ఆయనకు విరోధంగా ఉండే వారిని ఆయన నాశనం చేస్తాడు.
13“నేను ఇప్పుడు పనికి వెళ్లలేను. బయట సింహం ఉంది. అది నన్ను చంపేస్తుందేమో” అంటాడు సోమరివాడు.
14వ్యభిచార పాపం ఒక లోతైన గొయ్యిలాంటిది. ఆ గొయ్యిలో పడే మనిషి అంటే యెహోవాకు చాలా కోపం వస్తుంది.
15పిల్లలు తెలివి తక్కువ పనులు చేస్తారు. కాని నీవు వారిని శిక్షిస్తే, వారు అలాంటి పనులు చేయకుండా ఉండటం నేర్చుకొంటారు.
16నిన్ను నీవే ధనికుణ్ణి చేసుకొనేందుకుగాను, పేదవాళ్లను బాధించటం, ధనికులకు కానుకలు ఇవ్వటం ఇవి రెండూ నిన్ను దరిద్రునిగా చేస్తాయి.
ముప్పయి జ్ఞాన సూక్తులు
17నేను చెప్పే మాటలు విను. జ్ఞానులు చెప్పిన మాటలు నేను నీకు నేర్పిస్తాను. ఈ ఉపదేశాల ద్వారా నేర్చుకో. 18వీటిని నీవు జ్ఞాపకం ఉంచుకోవటం నీకు మంచిది. ఒకవేళ నీ పెదవులు ఒప్పుకొనేందుకు అలవాటు పడితే అది నీకు సహాయంగా ఉంటుంది.
19ఈ విషయాలు ఇప్పుడు నీకు నేను నేర్పిస్తాను. నీవు యెహోవాను సమ్ముకోవాలని నేను కోరుతున్నాను.
20నీ కోసం నేను ముప్పయి సూక్తులు వ్రాశాను. ఇవి సలహాలు, జ్ఞానముగల మాటలూను. 21ఈ మాటలు సత్యమైన ముఖ్య విషయాలను నీకు నేర్పిస్తాయి. అప్పుడు నిన్ను పంపినవానికి నీవు మంచి జవాబులు ఇవ్వగలవు.
— 1 —
22పేదవారివద్ద నుండి దొంగిలించటం సులభం. కాని అలా చేయవద్దు. న్యాయస్థానంలో పేదవాణ్ణి అణగ తొక్కవద్దు. 23యెహోవా వారి పక్షంగా ఉన్నాడు. ఆయన వారిని బలపరుస్తాడు, వారివద్ద నుండి తీసికొన్నవి ఎవరినైనా సరే వారి వస్తువులను ఆయన తీసివేస్తాడు.
— 2 —
24త్వరగా కోపపడే వానితో స్నేహంగా ఉండవద్దు. త్వరగా వెర్రి ఎక్కేవానికి దగ్గరగా పోవద్దు. 25నీవు వెళ్తే, నీవు కూడ అతనిలా ఉండటం నేర్చుకొంటావేమో! అలా అయితే అతనికి ఉన్న చిక్కులే నీకూ ఉంటాయి.
— 3 —
26మరో వ్యక్తి అప్పులకు నీదే బాధ్యత అని ప్రమాణం చేయవద్దు. 27అతని అప్పు నీవు తీర్చలేక పోతే, అప్పుడు నీకు ఉన్నవన్నీ నీవు పోగొట్టుకొంటావు. నీవు పండుకొనే నీ పడకను నీవు ఎందుకు పోగొట్టుకోవాలి?
— 4 —
28నీ పూర్వీకులు ఎప్పుడో గుర్తించిన ఆస్తి సరిహద్దు గీతను ఎప్పుడూ జరిపివేయవద్దు.
— 5 —
29ఒక వ్యక్తి తన పనిలో నిపుణతగలవాడై ఉంటే. అతడు రాజుల సేవ చేయటానికి అర్హుడవుతాడు. ప్రముఖులుకానివారి వద్ద అతడు పని చేయాల్సిన అవసరం ఉండదు.
Currently Selected:
సామెతలు 22: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International