విలాప వాక్యములు 4
4
యెరూషలేము పై దాడి భయాలు
1బంగారం ఎలా నల్లబడిందో చూడు.
మంచి బంగారం ఎలా మారిపోయిందో చూడు.
ఆభరణాలన్నీ నలుపక్కలా విసరివేయబడ్డాయి.
ప్రతి వీధి మూలలో ఆ నగలు వెదజల్లబడ్డాయి.
2సీయోను ప్రజలకు ఒకనాడు చాలా విలువ వుండేది.
వారికి బంగారంతో సరితూగే విలువ వుండేది.
కాని ఈనాడు శత్రువు వారిని మట్టి కుండల్లా చుస్తున్నాడు.
కుమ్మరి చేసిన మట్టి కుండల్లా ఈనాడు శత్రువు వారిని చూస్తున్నాడు.
3నక్క సహితం తన పిల్లలకు పొదుగు అందిస్తుంది.
నక్క సహితం తన పిల్లలను పాలు తాగనిస్తుంది.
కాని నా ప్రజల కుమార్తె (ఇశ్రాయేలు స్త్రీలు) మాత్రం కఠినాత్మురాలు.
ఆమె ఎడారిలో నివసించే ఉష్ట్రపక్షిలా వుంది.
4దాహంతో పసిబిడ్డ నాలుక
అంగిట్లో అతుక్కు పోతుంది.
చిన్న పిల్లలు అన్నానికి అలమటిస్తారు.
కాని వారికి ఎవ్వరూ ఆహారం ఇవ్వరు.
5ఒకనాడు విలువైన భోజనం చేసినవారు,
ఈనాడు వీధుల్లో చనిపోతున్నారు.
అందమైన ఎర్రని దుస్తుల్లో పెరిగిన ప్రజలు
ఇప్పుడు చెత్త కుండీలలో ఏరుకుంటున్నారు.
6నా ప్రజల కుమార్తె (యెరూషలేము స్త్రీలు) చేసిన పాపం మిక్కిలి ఘోరమైనది.
వారి పాపం సొదొమ, గొమొర్రాల పాపాలకు మించివుంది.
సొదొమ, గొమొర్రా పట్టణాలు అకస్మాత్తుగా నాశనం చేయబడ్డాయి.
ఏ మానవ హస్తమో చేసిన వినాశనం కాదది.
7దేవుని సేవకు ప్రత్యేకంగా అంకితమైన యూదా మనుష్యులు మంచుకంటె తెల్లనివారు.
వారు పాలకంటె తెల్లనివారు.
వారి శరీరాలు పగడంలా ఎర్రనివి.
వారి దేహకాంతి నీలమువంటిది.
8కాని వారి ముఖాలు ఇప్పుడు మసికంటె నల్లగా తయారైనాయి.
వీధిలో వారిని ఎవ్వరూ గుర్తు పట్టలేరు.
వారి ఎముకలపై వారి చర్మం ముడుతలు పడింది.
వారి చర్మం కట్టెలా అయిపోయింది.
9కరువుతో మాడి చనిపోయిన వారి స్థితికంటె కత్తి వేటుకు గురియైన వారు అదృష్టవంతులు.
ఆకలిచే మాడేవారు దుఃఖభాగ్యులు.
వారు గాయపర్చబడ్డారు.
పొలాల నుండి పంటలురాక వారు ఆకలితో చనిపోయారు.
10ఆ సమయంలో ఉత్తమ స్త్రీలు కూడా
తమ స్వంత పిల్లలను వండుకొని తిన్నారు.
ఆ పిల్లలు తమ తల్లులకు ఆహార మయ్యారు.
నా ప్రజలు నాశనం చేయబడినప్పుడు ఇది జరిగింది.
11యెహోవా తన కోపాన్నంతా ప్రయోగించాడు.
తన కోపాన్నంతా ఆయన కుమ్మరించాడు.
సీయోనులో ఆయన అగ్నిని ప్రజ్వరిల్ల జేశాడు.
ఆ అగ్ని సీయోను పునాదులను తగులబెట్టింది.
12జరిగిన దానిని ప్రపంచ రాజులెవ్వరూ నమ్మలేకపోయారు.
ప్రపంచ ప్రజానీకం ఏది సంభవించిందో దానిని నమ్మలేకపోయింది.
శత్రువులు యెరూషలేము నగర ద్వారాల
గుండా లోనికి ప్రవేశింపగలరని వారు అనుకోలేదు.
13యెరూషలేము ప్రవక్తలు పాపం చేసిన
నేరానికి ఇది జరిగింది.
యెరూషలేము యాజకులు దుష్ట కార్యాలు
చేయటం వలన ఇది సంభవించింది.
యెరూషలేము నగరంలో ఆ మనుష్యులు రక్తం చిందించుతున్నారు.
వారు మంచివారి రక్తాన్ని పారిస్తున్నారు.
14ప్రవక్తలు, యాజకులు అంధుల్లా వీధుల్లో తిరిగాడారు.
వారు రక్తసిక్తమై మలినపడ్డారు.
వారు మలినపడిన కారణంగా ఎవ్వరూ
వారి బట్టలను కూడ ముట్టరు.
15“పొండి! దూరంగా పొండి!
మమ్మల్ని తాకవద్దు.”
ఆ ప్రజలు చుట్టుపక్కల తిరుగాడినారు.
వారికి నివాసం లేదు.
“వారు మాతో కలిసి నివసించటం మాకు ఇష్టం లేదు.”
అని అన్యదేశీయులు అన్నారు.
16యెహోవాయే ఆ ప్రజలను నాశనం చేశాడు.
ఆయన వారి బాగోగులు ఎంతమాత్రం తెలుసు కోలేదు.
ఆయన యాజకులను గౌరవించలేదు.
ఆయన యూదా పెద్దలతో స్నేహ భావంతో లేడు.
17మా కండ్లు పనిచేయటం మానివేశాయి.
మేము సహాయం కొరకు నిరీక్షించాము.
కాని అది రాలేదు.
ఆ నిరీక్షణలో కండ్లు అలసిపోయాయి.
ఏదో ఒక రాజ్యం వచ్చి మమ్మల్ని రక్షిస్తుందని అదే పనిగా ఎదురుచూశాము.
మా కావలి బురుజులపై నుండి మేము చూశాము.
కాని ఏ దేశమూ మమ్మల్ని కాపాడటానికి రాలేదు.
18అన్ని వేళలా మా శత్రువులు మమ్మల్ని వేటాడారు.
మేము కనీసం వీధులలోకి కూడ పోలేకపోయాము.
మా అంతం సమీపించింది. మాకు సమయం దగ్గర పడింది.
మాకు అంతిమకాలం వచ్చేసింది!
19మమ్మల్ని వేటాడిన మనుష్యులు
ఆకాశంలో గద్దల కంటె వేగవంతులు.
ఆ మనుష్యులు మమ్మల్ని పర్వతాలలోకి తరిమివేశారు.
మమ్మల్ని పట్టుకోవటానికి వారు ఎడారిలో మాటువేశారు.
20మా ముక్కు రంధ్రాలలో ఊపిరిలా మెలగిన మా రాజును
వారు తమ గోతిలో పట్టుకున్నారు.
రాజు యెహోవాచే అభిషిక్తము చేయబడిన వ్యక్తి.
“మేము ఆయన నీడలో నివసిస్తాము;
ప్రపంచ రాజ్యాల మధ్య మేము ఆయన నీడలో నివసిస్తాము,”
అని మేము మా రాజును గురించి చెప్పుకున్నాము.
21ఎదోము ప్రజలారా, సంతోషంగా ఉండండి, ఆనందించండి.
ఊజు రాజ్యంలో నివసించే ప్రజలారా, సంతోషంగా వుండండి.
కాని ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. యెహోవా కోపపు గిన్నె మీవద్దకు కూడా వస్తుంది.
మీరు దానిని తాగినప్పుడు, మీకు మత్తెక్కుతుంది.
ఆ మత్తులో మిమ్మల్ని మీరు దిగంబరులుగా చేసుకుంటారు.
22సీయోనూ, నీ శిక్ష పూర్తి అయ్యింది.
మరెన్నడూ నీవు చెరపట్టబడవు.
కాని ఎదోము ప్రజలారా, యెహోవా మీ పాపాలకు తగిన శిక్ష విధిస్తాడు.
ఆయన మీ పాపాలను బహిర్గతం చేస్తాడు.
Currently Selected:
విలాప వాక్యములు 4: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International