విలాప వాక్యములు 3
3
శ్రమ భావం
1నేను కష్టాలు అనుభవించిన వ్యక్తిని.
యెహోవా కోపపు కర్ర క్రింద నేను సంకట పరిస్థితులు చూశాను.
2యెహోవా నన్ను చీకటిలోకి
నడపించాడేగాని వెలుగులోకి కాదు.
3యెహోవా తన చేతిని నా మీదకి ఎత్తాడు.
రోజంతా పదే పదే ఆయన అలా చేశాడు.
4ఆయన నా మాంసం, నా చర్మం కృశింపజేశాడు.
ఆయన నా ఎముకలు విరుగగొట్టాడు.
5యెహోవా నా పైకి కష్టాలను, వేదనను రప్పించాడు.
ఆయన నాచుట్టూ విషాన్ని, సంకట పరిస్థితిని కలుగచేశాడు.
6ఆయన నన్ను చీకటిలో కూర్చునేలా చేశాడు.
ఏనాడో చనిపోయిన వ్యక్తిలా నన్ను ఆయన చేశాడు.
7యెహోవా నన్ను బయటకు రాకుండా బంధించాడు.
ఆయన నాకు బరువైన గొలుసులు తగిలించాడు.
8సహాయం కొరకు నేను మొర్ర పెట్టుకుని అర్థించినా,
యెహోవా నా ప్రార్థన ఆలకించలేదు.
9ఆయన నా మార్గాన్ని రాళ్లతో అడ్డగించాడు.
ఆయన నా మార్గాన్ని వక్రంగా, గతుకులమయం చేశాడు.
10నా మీదకు పడనున్న ఎలుగుబంటిలా యెహోవా ఉన్నాడు.
ఆయన పొంచి వున్న ఒక సింహంలా ఉన్నాడు.
11యెహోవా నన్ను నా మార్గం నుండి తొలగించాడు.
ఆయన నన్ను ముక్కలుగా చీల్చాడు. నన్ను నాశనం చేశాడు.
12ఆయన విల్లంబులు చేపట్టాడు.
ఆయన బాణాలకు నన్ను గురి చేశాడు.
13ఆయన నా పొట్టలో బాణం వేశాడు.
ఆయన బాణాలతో నన్ను తూట్లు పొడిచాడు.
14నా ప్రజలందరిలో నేను నవ్వులపాలయ్యాను.
రోజంతా పాటలు పాడి వారు నన్ను ఎగతాళి చేస్తారు.
15యెహోవా నాచేత చేదు పానీయం (శిక్ష) తాగించాడు.
ఆయన చేదు పానీయాలతో నన్ను నింపివేశాడు.
16నా పండ్లు రాత్రి నేలలో గుచ్చుకుపోయేలా యెహోవా నన్ను తోశాడు.
ఆయన నన్ను మట్టిలోకి త్రోసివేశాడు.
17ఇక నాకు శాంతి ఉండదని అనుకున్నాను.
మంచి విషయాలు ఎట్టివో నేను మర్చిపోయాను.
18“యెహోవా తిరిగి నాకు సహాయం చేస్తాడనే
ఆశ లేదనుకొన్నాను.”
19ఓ యెహోవా, నా దుఃఖాన్ని,
నేను నా నివాసాన్ని కోల్పోయిన తీరును గుర్తుపెట్టుకొనుము.
నీవు నాకిచ్చిన చేదుపానీయాన్ని, విషం (శిక్ష) కలిపిన పానీయాలను జ్ఞాపకం పెట్టుకొనుము.
20నా కష్టాలన్నీ నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి.
నేను మిక్కిలి విచారిస్తున్నాను.
21కాని నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశ పొడచూపింది.
నేను ఇలా అనుకున్నాను.
22యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి.
యెహోవా కృపా కటాక్షాలు తరగనివి.
23అవి నిత్య నూతనాలు.
ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది.
24“యెహోవా నా దేవుడు.
అందువల్లనే నాకీ ఆశ పొడచూపింది,” అని నేను అనుకున్నాను.
25ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం కలుగజేస్తాడు.
ఆయన కోసం వెదికేవారికి యెహోవా ఉదారుడు.
26యెహోవా రక్షణకై నెమ్మదిగా
వేచియుండటం క్షేమకరం
27యెహోవా కాడిని ధరించే వానికి మంచి కలుగుతుంది.
ఆయన కాడిని చిన్నతనం నుండే మోయటం ఆ వ్యక్తికి మరీ మంచిది.
28యెహోవా తన కాడిని వానిమీద వేయునప్పుడు
ఆ వ్యక్తి ఒంటరిగా కూర్చుని మౌనంగా ఉండాలి.
29ఆ వ్యక్తి బూడిదలో కూర్చొని యెహోవాకు సాష్టాంగపడి నమస్కరించాలి.
దానివల్ల తన ఆశ నెరవేరునేమో.
30తనను కొట్టేవానివైపు తన దవడను ఆ వ్యక్తి తిప్పాలి.
ఆ వ్యక్తి అవమానాలను భరించటానికి సంసిద్ధుడు కావాలి.
31యెహోవా తన ప్రజలను శాశ్వతంగా తిరస్కరించడని ఆ వ్యక్తి గుర్తుంచుకోవాలి.
32యెహోవా శిక్షించేటప్పుడు, ఆయనకు కరుణకూడ ఉంటుంది.
ఆయనకుగల అపారమైన ప్రేమ, కరుణ కారణంగా ఆయన జాలి పడతాడు.
33యెహోవా తన ప్రజలను శిక్షింపకోరడు.
తన ప్రజలను బాధపెట్టటానికి ఆయన ఇష్టపడడు.
34యెహోవా ఈ విషయాలంటే ఇష్టపడడు:
ఎవ్వరో ఒక్కరికోసం భూమిపైగల ఖైదీలందరినీ ఆయన పాదాలకింద తొక్కటానికి ఇష్టపడడు.
35ఒకని మేలుకోసం మరియొకనికి అన్యాయం చేయటం ఆయనకు ఇష్టముండదు.
కాని కొంత మంది ఈ అన్యాయాన్ని మహోన్నతుడైన దేవుని సన్నిధిలోనే చేస్తారు.
36ఒకని మంచి పనిని మరియొకని కోసం పాడు చేయటానికి ఆయన ఇష్టపడడు.
యెహోవా ఈ పనులేవీ చేయటానికి ఇష్టపడడు.
37యెహోవా ఆజ్ఞలేకుండా ఎవ్వరూ దేనినీ చెప్పలేరు;
చెప్పి జరిపించలేరు.
38మహోన్నతుడైన దేవుని నోటినుండి వరాలు,
శాపాలు రెండూ వెలువడతాయి.
39ఒక వ్యక్తియొక్క పాపాలననుసరించి యెహోవా అతన్ని శిక్షిస్తాడు.
కనుక, బతికున్న వాడెవడూ ఆయనపై ఫిర్యాదు చేయలేడు?
40మన జీవన విధానాన్ని, మన పనులను ఒకమారు
పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించుదాము.
41పరలోకాధిపతియైన దేవునివైపు మన హృదయాలను,
చేతులను చాపుదాము.
42ఆయనకు మనం ఇలా విన్నవించుకుందాము: “మేము పాపం చేశాము, మొండివైఖరి దాల్చాము.
అందువల్ల నీవు మమ్మల్ని క్షమించలేదు.
43నిన్ను కోపం ఆవరించినప్పుడు నీవు మమ్మల్ని వెంటాడినావు.
కనికరం లేకుండా నీవు మమ్మల్ని చంపావు.
44నిన్ను నీవు ఒక మేఘంతో కప్పుకున్నావు.
ఏ ఒక్క ప్రార్థనా నీలో ప్రవేశించకుండ నీవలా చేశావు.
45అన్య దేశాలవారి దృష్టిలో మమ్మల్ని పనికిరాని చెత్తలా,
కల్మశంలా చేశావు.
46మా శత్రువులందరూ మాతో కోపంగా
మాట్లాడుతున్నారు.
47మేము భయానికి గురి అయ్యాము.
మేము గోతిలో పడ్డాము.
మేము బాధపెట్టబడి,
చితుక గొట్టబడ్డాము!”
48నా కన్నీళ్లు ప్రవాహంలా కారుచున్నాయి!
నా ప్రజానాశనం పట్ల నేను మిక్కిలి దుఃఖిస్తున్నాను.
49ఎడతెరిపిలేకుండా నా కన్నీరు కారుతూవుంది!
నా దుఃఖం ఆగదు.
50ఓ యెహోవా, నీ దృష్టి మా పై ప్రసాదించి,
మమ్మల్ని చూసే వరకు నా దుఃఖం ఆగదు.
పరలోకం నుండి నీవు మమ్మల్ని చూసేవరకు
నేను దుఃఖిస్తూనే ఉంటాను.
51నా నగర కుమార్తెలకు ఏమి జరిగిందో నేను చూసినప్పుడు
నా కండ్లు నాకు వేదన కలిగించాయి.
52తగిన కారణం లేకుండానే నాకు శత్రువులైన
వారంతా నన్నొక పక్షిలా తరిమారు.
53నేను బ్రతికి వుండగానే నన్ను గోతిలోకి తోశారు.
నాపై వాళ్లు రాళ్లు విసిరారు.
54నీళ్లు నా తలపైకి వచ్చాయి.
“ఇది నా అంతం” అని నేననుకున్నాను.
55ఓ యెహోవా, నీ పేరు స్మరించాను.
గోతిలో అట్టడుగునుండి నిన్ను పేరుపెట్టి పిలిచాను.
56నీవు నా మొరాలకించావు.
నీవు నీ చెవులు మూసి కొనలేదు.
నన్ను కాచి రక్షించటానికి నీవు వెనుకాడలేదు.
57నేను నిన్ను పిలిచిన రోజున నీవు నాకు దగ్గరగా వచ్చావు
“భయపడవద్దు,” అని నాకు అభయమిచ్చావు.
58ఓ యెహోవా, నీవు నా సంగతి పట్టించుకొని నా పక్షం వహించావు.
నాకు మళ్లీ జీవం పోశావు.
59ఓ యెహోవా, నీవు నా కష్టాలను తిలకించావు.
నా వ్యవహారంలో ఇప్పుడు నీ తీర్పు ఇవ్వు.
60నా శత్రువులు నన్నెలా హింసించారో నీవు చూశావు.
వారు నాపై జరిపిన కుట్రలన్నీ నీవు చూశావు.
61ఓ యెహోవా, వారెలా నన్నవమానించారో నీవు విన్నావు.
వారు నాపై జరిపిన కుట్రలన్నిటిని గురించి నీవు విన్నావు.
62నా శత్రువుల మాటలు, ఆలోచనలు ఎప్పుడూ
నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి.
63ఓ యెహోవా, వారు కూర్చున్నా,
నిలబడినా వారు నన్నెలా ఎగతాళి చేస్తున్నారో చూడు!
64ఓ యెహోవా, వారికి తగిన గుణపాఠం నేర్పు!
వారు చేసిన నేరానికి తగిన శిక్ష విధించు!
65వారి గుండె బండ బారేలా చేయుము!
పిమ్మట వారిని శపించుము!
66కోపంతో వారిని వెంటాడుము! వారిని నాశనం చేయుము.
యెహోవా, వారిని ఈ ఆకాశం కింద లేకుండా చేయుము!
Currently Selected:
విలాప వాక్యములు 3: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International