YouVersion Logo
Search Icon

యెహెజ్కేలు 45

45
పవిత్ర కార్యాలకు భూమి విభజన
1“మీరు చీట్లువేసి భూమిని ఇశ్రాయేలు వంశపు వారి మధ్య విభజించాలి. ఆ సమయంలో ఒక భూమి భాగాన్ని మీరు విడిగా ఉంచాలి. అది యెహోవా యొక్క పవిత్ర భాగం. ఆ భూమి పొడవు ఇరవైఐదువేల మూరలు వెడల్పు ఇరవై వేల మూరలు. ఈ భూమి అంతా పవిత్రమైనది. 2రెండువేల ఐదు వందల మూరల చదరపు అడుగుల పొడవున్న చతురస్రాకార స్థలాన్ని గుడికి కేటాయించ బడాలి. గుడి చుట్టూ ఐదువందల మూరలు గల ఖాళీస్థలం ఉండాలి. 3పవిత్ర స్థలంలో ఇరవై ఐదువేల మూరలు పొడవు; పదివేల మూరల వెడల్పు గల స్థలాన్ని కొలవాలి. ఈ ప్రదేశంలోనే గుడి ఉండాలి. గుడి ప్రదేశం అతి పవిత్ర స్థలంగా ఉండాలి.
4“ఆ భూమిలో పవిత్ర భాగం యాజకుల వినియోగార్థమై, ఆలయ సేవకుల నిమిత్తం వాళ్ళు ఎక్కడ యెహోవా దగ్గరకు సేవ చేయటానికి వస్తారో వాళ్ళ కోసం ఉంటుంది. యాజకుల ఇండ్ల నిమిత్తం, ఆలయానికి స్థానంగా అది వినియోగ పడుతుంది. 5ఐదు లక్షల ఇరవై ఐదువేల మూరల పొడవు, పదివేల మూరల వెడల్పుతో మరొక భూభాగం ఆలయంలో సేవ చేసే లేవీయులకు ప్రత్యేకించబడుతుంది. ఈ భూభాగం లేవీయుల నివాస ప్రాంతంగా కూడా ఉపయోగపడుతుంది.
6“మీరు నగరానికి ఐదువేల మూరల వెడల్పు, రెండులక్షల ఏభైవేల మూరల పొడవుగల భూభాగాన్నిస్తారు. ఇది పవిత్ర స్థలం పొడవునా ఉంటుంది. ఇది ఇశ్రాయేలు వంశానికంతటికీ చెంది ఉంటుంది. 7పాలనాధికారికి పవిత్ర స్థలానికి రెండు ప్రక్కల ఉన్న భూమి, నగరానికి చెందిన భూమిగా ఉంటుంది. ఒక తెగకు (గోత్రం) చెందిన స్థలం ఎంత వెడల్పు ఉంటుందో దీని వెడల్పు కూడ అంతే ఉంటుంది. ఇది పడమటి సరిహద్దు నుండి తూర్పు సరిహద్దు వరకు వ్యాపించి ఉంటుంది. 8ఈ స్ధలం ఇశ్రాయేలులో పాలనాధికారి యొక్క ఆస్తి. అందువల్ల ఈ అధిపతి నా ప్రజల జీవితాలను ఏ మాత్రం కష్టాలపాలు చేయనవసరం లేదు. కానివారు ఈ స్థలాన్ని ఇశ్రాయేలీయులకు వంశాలవారీగా ఇస్తారు.”
9నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు, “ఇశ్రాయేలు పాలకులారా, ఇక చాలు! ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తించటం, వారి సొమ్ము కొల్ల గొట్టటం మానండి! న్యాయవర్తనులై మంచి పనులు చేయండి! నా ప్రజలను వారి ఇండ్ల నుండి వెడల గొట్టటం మానండి!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
10“మీరు ప్రజలను మోసగించటం మానండి. మీరు ఖచ్చితమైన తూనికలు, కొలతలు వినియోగించండి! 11‘ఏఫా’#45:11 ఏఫా సుమారు నలభై ఎనిమిదిన్నర గాలనులు, లేక ఆరు బుషెలు లేక ఒక పందుము. (పందుములో పదవ పాలు) మరియు ‘బత్‌’ (తూము) ఒకే పరిమాణంలో ఉండాలి. రెండూ ‘ఓమెరు’ లో పదవ వంతుకు సరిసమానంగా ఉండాలి. ఆ కొలతలు ‘ఓమెరు’ (పందుము) ను పరిమాణంగా చేసుకొని ఉండాలి. 12‘షెకెలు’ (తులం) ఇరవై ‘గెరా’లకు (చిన్నములు) సరి సమానంగా ఉండాలి. ఒక ‘మీనా’ అరవై షెకెలు (తులా)లకు సమానంగా ఉండాలి. అనగా అది ఇరవై తులాలు, ఇరవై ఐదు తులాలు, పదిహేను తులాల కలయికకు సమానం.
13“మీరు ఇచ్చే ప్రత్యేక (ప్రతిష్ఠిత) అర్పణ ఈలాగున ఉండాలి.
గోధుమలలో తూములో ఆరో భాగం,
యవలగింజలలో తూములో ఆరో భాగం వంతున అర్పించాలి.
14తైల పదార్థాలు చెల్లించేటప్పుడు ప్రతి నూట ఎనభై పడుల#45:14 నూట ఎనభై పడుల పది బదులు ఒక కోరు, నూట ఎనుబది పడులు సరిసమానము. కోరు అనగా ఏబదియైదు గాలనకు సమానం. బదులో పదవవంతు ఆదగానుకు సమానము. అనగా ప్రతి ఏభై ఐదు గాన్లు (ఒక కోరు) నూనె అరగాలను లేకబదులో ఐదవవంతు సమర్పించాలి. ఒలీవ నూనెలో ఒక
ముప్పాతిక పడుల వంతు నూనెను చెల్లించాలి. ఇది ఒక నిబంధన.
15ఇశ్రాయేలులో నీటి వనరుగల ప్రాంతాలలో ఉన్న మందలలో
ప్రతి రెండు వందల గొర్రెలకు ఒక మంచి గొర్రె చొప్పున అర్పించాలి.
“ఆ ప్రత్యేక అర్పణలు ధాన్యార్పణల కొరకు, దహన బలులకు, సమాధాన (శాంతి) బలులకు ఇవ్వ బడతాయి. ఈ అర్పణలన్నీ ప్రజలను పరిశుద్ధులను చేయటానికి ఉద్దేశించబడ్డాయి.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
16“ఈ అర్పణ ప్రతి పౌరుడు ఇశ్రాయేలు పాలకునికి చెల్లిస్తాడు. 17కావున పాలకుడు ప్రత్యేక పవిత్ర దినాలకు కావలసిన వస్తువులను తప్పక ఇవ్వాలి. విందు రోజులకు, అమావాస్యలకు, సబ్బాతు రోజులకు ఇశ్రాయేలు వంశం జరిపే ప్రత్యేక విందుల సమయాలకు దహన బలులు. ధాన్యార్పణలు, సానార్పణలు పాలకుడైన వాడు సమకూర్చాలి. ఇశ్రాయేలు వంశాన్ని పవిత్రపర్చే కార్యక్రమంలో ఇచ్చే పాపపరిహార బలులు, ధాన్యపు నైవేద్యాలు, దహన బలులు, సమాధాన బలులు పాలకుడు ఇవ్వాలి.”
18నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “మొదటి నెల మొదటి రోజున ఏ దోషమూ లేని ఒక కోడెదూడను తీసుకోవాలి. ఆలయాన్ని పరిశుద్ధం చేయటానికి మీరు ఆ కోడెదూడను ఉపయోగించాలి. 19పాప పరిహారార్థమైన బలిరక్తాన్ని కొంత యాజకుడు తీసుకొని ఆలయ గుమ్మాల మీద, బలిపీఠం అంచు నాలుగు మూలల మీద మరియు లోపలి ఆవరణ గుమ్మం కమ్మెలమీద చల్లుతాడు. 20ఇదే పని ఆ నెలలో ఏడవ రోజున ఎవరైనా పొరపాటునగాని, తెలియక గాని చేసిన పాప పరిహారం నిమిత్తం మీరు చేస్తారు. అలా మీరు ఆలయాన్ని పరిశుద్ధ పర్చాలి.
పస్కా పండుగ అర్పణలు
21“మొదటి నెల పద్నాలుగవ రోజున మీరు పస్కా పండుగ జరుపుకోవాలి. పులియని రొట్టెల పండుగ ఇదే సమయంలో మొదలవుతుంది. ఆ పండుగ ఏడు రోజులపాటు జరుగుతుంది. 22ఆ సమయంలో పాలకుడు తన కొరకునూ, ఇశ్రాయేలు ప్రజల కొరకునూ ఒక కోడెదూడను బలి ఇస్తాడు. అది పాపపరిహారార్థ బలి. 23పండుగ జరిగే ఏడు రోజులు పాలకుడు ఏ దోషములేని ఏడు కోడెదూడలను, ఏడు పొట్టేళ్లను బలి ఇస్తాడు. అవి యెహోవాకు దహన బలులుగా సమర్పింపబడతాయి. పండుగ ఏడు రోజులూ రోజుకు ఒక కోడెదూడ చొప్పున పాలకుడు బలి ఇస్తాడు. ప్రతి రోజూ పాప పరిహారార్థమై అతడు ఒక మేకపోతును అర్పిస్తాడు. 24ప్రతి కోడెదూడతో పాటు ఒక ఏఫా (సుమారు తొమ్మిది మానికెలు) యవలను ధాన్యపు నైవేద్యంగాను, ఒక ఏఫా యవలను ప్రతి పొట్టేలుతోను అధిపతి చెల్లిస్తాడు. ఇంకా పాలకుడు ప్రతి తొమ్మిది మానికెల ధాన్యంతో పాటు మూడు పడుల (ఒక గాలను) నూనెను సమర్పించాలి. 25పాలకుడు పర్ణశాలల పండుగ జరిపే ఏడు రోజులలోనూ ఇదే విధంగా తప్పక చేయాలి. ఈ పండుగ ఏడవ నెలలో పదిహేనవ రోజున మొదలవుతుంది. ఇవన్నీ పాపపరిహారార్థ అర్పణలు, దహన బలులు, ధాన్యార్పణలు, నూనె అర్పణలుగా పరిగణింపబడుతాయి.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in