యెహెజ్కేలు 44
44
వెలుపలి ద్వారం
1పిమ్మట ఆ మనుష్యుడు నన్ను ఆలయానికి తూర్పున ఉన్న వెలుపలి ద్వారం వద్దకి తిరిగి తీసుకొని వచ్చాడు. వెలుపలి ద్వారం మూసి ఉంది. 2యెహోవా నాతో ఇలా చెప్పాడు: “ఈ ద్వారం మూయబడి ఉంటుంది. ఇది తెరవబడదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దీనిద్వారా ప్రవేశించాడు గనుక మరెవ్వరూ ఈ ద్వారంగుండా ప్రవేశం చేయరు. అందువల్ల ఇది మూయబడి ఉండాలి. 3యెహోవాతో సమాధాన బలి అర్పణ తినేటప్పుడు ప్రజాపాలకుడు ఈ ద్వారం వద్ద కూర్చుంటాడు. ద్వారం వద్ద గల మండప మార్గం ద్వారా అతడు వచ్చి వెళతాడు.”
ఆలయ పవిత్రత
4తరువాత ఆ మనుష్యుడు ఉత్తర ద్వారం ద్వారా నన్ను ఆలయం ముందుకు తీసుకొని వచ్చాడు. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేస్తున్నట్లు నేను చూశాను. నేను సాష్టాంగపడి నమస్కరించాను. 5యెహోవా ఇలా అన్నాడు: “నరపుత్రుడా, జాగ్రత్తగా చూడు! నీ కండ్లను, చెవులను ఉపయోగించు. ఈ వస్తువులను చూడు. నేను యెహోవా ఆలయం యొక్క నియమ నిబంధనలను గురించి చెప్పే ప్రతి విషయాన్ని నీవు శ్రద్ధగా విను. ఆలయ ప్రవేశద్వారాల వైపు, ఆలయం నుండి బయటికి పోయే ద్వారములన్నిటి వైపూ పరిశీలనగా చూడు. 6తరువాత నాపట్ల తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ వర్తమానాన్ని అందించు. వారికిలా చెప్పు: ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ఇశ్రాయేలు వంశీయులారా, మీరు నాపట్ల చేసిన భయంకరమైన పనులు కోకొల్లలు! ఇక చాలు. 7నా ఆలయం లోకి మీరు అన్యదేశీయులను తీసుకొని వచ్చారు. వారు నిజంగా సున్నతి సంస్కారం లేనివారు. వారు తమను తాము పూర్తిగా నాకు సమర్పించుకోలేదు. ఈ రకంగా మీరు నా ఆలయాన్ని అపవిత్రం చేశారు. మన ఒడంబడికను మీరు భంగపర్చారు. మీరు చెడుకార్యాలు చేశారు. తరువాత మీరు నాకు రొట్టె, కొవ్వు, రక్తం సమర్పించారు. కాని ఇదంతా కేవలం నా ఆలయాన్ని అపవిత్రపర్చింది. 8మీరు నా వవిత్ర వస్తువుల విషయంలో జాగ్రత్త తీసుకోలేదు. పైగా అన్యదేశీయులు నా పవిత్ర స్థలాన్ని గురించి బాధ్యత వహించేలా చేశారు!’”
9నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నిజంగా సున్నతి సంస్కారం పొందని విదేశీయుడెవ్వడూ నా ఆలయంలోకి రాకూడదు. అట్టివాడు శాశ్వతంగా ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్న వాడైనా నా ఆలయ ప్రవేశానికి అర్హుడు కాడు. అతడు నా ఆలయ ప్రవేశం చేసే దానికి ముందు సున్నతి సంస్కారం పొంది తనను తాను నాకు పూర్తిగా సమర్పించుకోవాలి. 10గతంలో ఇశ్రాయేలీయులు నాపై తిరుగుబాటు చేసినప్పుడు లేవీయులు నన్ను వదిలివేశారు. తమ విగ్రహాలను ఆరాధించటానికి ఇశ్రాయేలీయులు నన్ను వదిలిపెట్టారు. లేవీయులు చేసిన పాపానికి వారు శిక్షింపబడతారు. 11నా పవిత్ర స్థలంలో సేవ చేయటానికి లేవీయులు ఎంపిక చేయబడ్డారు. ఆలయ ద్వారాలకు వారు కాపలా ఉన్నారు. వారు ఆలయంలో సేవ చేశారు. ప్రజల తరఫున బలులు దహన బలులు ఇవ్వటానికి వారు జంతువులను వధించారు. ప్రజలకు సహాయం చేయటానికి, వాళ్ళకు సేవ చేయటానికి వారు ఎంపిక చేయబడ్డారు. 12కాని ప్రజలు నాపట్ల పాపం చేయటానికే లేవీయులు వారికి సహాయపడ్డారు! ప్రజల విగ్రహారాధనలో లేవీయులు వారికి సహాయపడ్డారు! కనుక నేను వారికి వ్యతిరేకంగా ఇలా ప్రతిజ్ఞ చేస్తున్నాను, ‘వారు తమ పాపానికి శిక్షింపబడతారు.’” నా ప్రభువైన యెహోవా ఇది చెప్పాడు.
13“కావున యాజకులవలె లేవీయులు నాకు అర్పణలు తీసుకొనిరారు. నా పవిత్ర వస్తువుల వద్దకు గాని, అతి పవిత్రమైనవిగా తలచబడేవాటి దరిదాపులకు గాని వారు రారు. వారు చేసిన నీచమైన పనులకు అవమానాన్ని వారు భరించాలి. 14అయితే వారిని నా ఆలయం గురించి శ్రద్ధ తీసుకోనిస్తాను. వారు ఆలయంలో పనిచేస్తూ, అక్కడ తప్పక జరగవలసిన కార్యాలన్నీ నెరవేర్చుతారు.
15“యాజకులందరూ లేవీ వంశపువారే. కాని ఇశ్రాయేలు ప్రజలు నాపై తిరుగుబాటు చేసినప్పుడు సాదోకు సంతతి యాజకులు మాత్రమే నా పవిత్ర స్థలాన్ని గురించి జాగ్రత్త తీసుకున్నారు. కావున సాదోకు సంతతి వారే నాకు అర్పణలు తెస్తారు. వారు బలి యిచ్చే జంతువుల కొవ్వును, రక్తాన్ని నాకు అర్పించేందుకు వారు నా ముందు నిలబడతారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు! 16“వారు నా పవిత్ర స్థలంలో ప్రవేశిస్తారు. నేను వారి కిచ్చిన వస్తువుల పట్ల జాగ్రత్త తీసుకుంటారు. 17వారు లోపలి ఆవరణ ద్వారాలలో ప్రవేశించినప్పుడు వారు నారబట్టలు ధరిస్తారు. లోపలి ఆవరణ గుమ్మాల వద్ద, ఆలయంలోను సేవ చేసేటప్పుడు వారు ఉన్ని బట్టలు ధరించరు. 18వారు నార పాగాలను తమ తలలపై ధరిస్తారు. నడుముకు చుట్టుకొనేటందుకు కూడ వారు నారబట్టలే ఉపయోగిస్తారు. వారికి చెమట పుట్టించే బట్టలేవీ వారు ధరించరు. 19బయటి ఆవరణలో ప్రజల వద్దకు వారు వెళ్లేముందు, నాకు సేవ చేసేటప్పుడు ధరించే వస్త్రాలను వారు విడుస్తారు. వారు వేరే బట్టలు వేసుకొంటారు. ఈ విధంగా వారు పవిత్ర వస్త్రాలను ప్రజలు ముట్టకుండ చూస్తారు.
20“ఈ యాజకులు తమ తలలు గొరిగించరు. కాని జుట్టు బారుగా పెరగకుండా మాత్రం జాగ్రత్త పడతారు. (తలలు గొరిగించడం విచారానికి దుఃఖానికి సూచన. యాజకులు కేవలం యెహోవా సేవలోనే ఆనందిస్తారు.) యాజకులు తమ తల వెంట్రుకలను తగు మాత్రమే కత్తిరిస్తారు. 21లోపలి ఆవరణలోనికి వెళ్లేటప్పుడు యాజకులెవ్వరూ ద్రాక్షారసం తాగరాదు. 22యాజకులు విధవరాండ్రను, విడాకులిచ్చిన స్త్రీలను వివాహమాడరాదు. వారు కేవలం ఇశ్రాయేలు వంశంలో నుండి కన్యలను మాత్రమే వివాహమాడాలి. లేదా చనిపోయిన భర్త యాజకుడైతే, ఆ విధవస్త్రీని వారు పెండ్లి చేసుకోవచ్చు.
23“పవిత్ర వస్తువులకు, పవిత్ర వస్తువులు కాని వాటికి మధ్య వ్యత్యాసాన్ని గురించి కూడా నా ప్రజలకు యాజకులు తెలియజేస్తారు. శుభ్రమైన పదార్థాలు ఏవో, అపరిశుభ్రమైనవి ఏవో నా ప్రజలు తెలుసుకొనేటందుకు వారు సహాయపడతారు. 24న్యాయస్థానంలో యాజకులు న్యాయాధీశులుగా వ్యవహరిస్తారు. ప్రజలకు తీర్పు తీర్చేటప్పుడు వారు నా కట్టడలను అనుసరిస్తారు. నా ప్రత్యేక విందుల (సమావేశాల) సమయంలో వారు నా నియమ నిబంధనలను పాటిస్తారు. వారు నేను ఏర్పాటు చేసిన ప్రత్యేక విశ్రాంతి రోజులను గౌరవించి, వాటిని పవిత్రంగా ఉంచుతారు. 25వారు శవాలను తాకి వారిని వారు అపవిత్ర పర్చుకోరు. కాని ఆ చనిపోయిన వ్యక్తి గనుక తండ్రి గాని, తల్లి గాని, కుమారుడు, కుమార్తె, సోదరుడు గాని లేక వివాహితకాని సోదరిగాని అయితే వారు శవాలను ముట్టి తమను తాము అపవిత్రం చేసుకొంటారు. 26ఇది యాజకుని అపరిశుద్ధుణ్ణి చేస్తుంది. యాజకుడు పరిశుద్ధుడయిన తరువాత అతడు ఏడు రోజులు ఆగాలి. 27అప్పుడతడు తిరిగి పవిత్ర స్థలానికి వెళ్లవచ్చు. పవిత్ర స్థలంలో సేవ నిమిత్తం అతడు లోపలి ఆవరణలోకి వెళ్లే రోజున తన నిమిత్తం ఒక పాప పరిహారపు బలిని ఇచ్చుకోవాలి.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
28“లేవీయులకు సంబంధించిన భూమి విషయమేదంటే, వారి ఆస్తిని నేనే. ఇశ్రాయేలులో లేవీయులకు మీరేమీ ఆస్తిని (భూమిని) ఇవ్వవద్దు. ఇశ్రాయేలులో నేనే వారి భాగం. 29ధాన్యార్పణలు, పాప పరిహారార్థ బలిమాంసం, అపరాధ పరిహారార్థ బలి సమర్పణ వారికి ఆహారంగా ఇవ్వబడతాయి. ఇశ్రాయేలులో ప్రజలు యెహోవాకు సమర్పించేదంతా వారికి చెందుతుంది. 30కోత కాలంలో ప్రతి పంటలోను మొదటి భాగం యాజకులకు కేటాయించాలి. కలిపిన రొట్టెల పిండి ముద్దలో మొదటి భాగం యాజకులకు ఇవ్వాలి. ఇది మీ కుటుంబాలకు మంచి ఆశీస్సులనిస్తుంది. 31సహజంగా చనిపోయిన పక్షినిగాని, జంతువునుగాని, లేదా ఏదైనా అడవి జంతువుచే చీల్చబడిన దానినిగాని యాజకులు తినరాదు.
Currently Selected:
యెహెజ్కేలు 44: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International