యెహెజ్కేలు 28
28
తూరు తనను తాను దేవునిగా భావించుకోవటం
1యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు: 2“నరపుత్రుడా, తూరు పాలకునికి ఇలా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా నీకు చెప్పునదేమనగా:
“‘నీవు గర్విష్ఠివి!
“నేనే దేవుడను!
సముద్ర మధ్యంలో దైవ స్థానంలో కూర్చున్నాను”
అని నీవంటున్నావు.
“‘కాని నీవు మానవ మాత్రుడవు. దేవుడవు, మాత్రం కాదు.
నీవు దేవుడవని నీకై నీవే అనుకుంటున్నావు.
3నీవు దానియేలు#28:3 దానియేలు దానియేలు ప్రాచీన కాలపు జ్ఞాని. కంటె తెలివిగలవాడవని తల పోస్తున్నావు!
రహస్యాలన్నిటినీ తెలుసుకొనగలవని నీవనుకుంటున్నావు.!
4నీ తెలివితేటల ద్వారా, నీ వ్యాపారం ద్వారా నీవు ధనధాన్యాలు విస్తారంగా సేకరించావు.
నీ ధనాగారాలలో వెండి బంగారాలు నిలువజేశావు.
5గొప్పదైన నీ జ్ఞానంచేత, వ్యాపారం ద్యారా నీ సంపదను పెంచావు.
ఇప్పుడా ఐశ్వర్యాన్ని చూచు కొని నీవు గర్వపడుతున్నావు.
6“‘అందువల్ల నా ప్రభువైన యెహోవా చెపుతున్న దేమంటే,
నీవొక దేవుడిలా ఉన్నావని తలంచావు.
7అన్య జనులను నేను నీ మీదికి రప్పిస్తాను.
వారు దేశాలన్నిటిలో అతి భయంకరులు!
వారు తమ కత్తులను దూస్తారు.
నీ తెలివితేటలు సముపార్జించి పెట్టిన అందమైన వస్తువుల మీద వాటిని ఉపయోగిస్తారు.
వారు నీ కీర్తిని నాశనం చేస్తారు.
8వారు నిన్ను సమాధిలోకి దించుతారు.
నడి సముద్రంలో చనిపోయిన నావికునిలా నీవుంటావు.
9నిన్నొక వ్యక్తి చంపివేస్తాడు.
అప్పుడు “నేను దేవుణ్ణి” అని నీవు చెప్పుకోగలవా?
ఆ సమయంలో అతడు నిన్ను తన అధీనంలో ఉంచుతాడు.
దానితో నీవొక మానవ మాత్రుడవనీ, దేవుడవు కావనీ నీవు తెలుసుకుంటావు!
10క్రొత్తవాళ్లు నిన్ను విదేశీయునిగా చూసి చంపివేస్తారు.
నేను ఇచ్చిన ఆజ్ఞ కారణంగా ఆ పనులు జరుగుతాయి!’”
నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
11యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు: 12“నరపుత్రుడా, తూరు రాజును గురించి ఈ విషాద గీతం ఆలపించు. అతనికి ఈ విధంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“‘నీవు ఆదర్శ పురుషుడవు.
నీకు జ్ఞానసంపద మెండు. నీ అందం పరిపూర్ణమైనది.
13దేవుని ఉద్యానవనమైన ఏదెనులో నీవున్నావు.
నీవద్ద ప్రతి విలువైన రత్నం ఉంది.
కెంపులు, గోమేధికము, ఇతర రత్నాలు;
గరుడ పచ్చలు, సులిమానురాయి, పచ్చరాయి;
నీల మణులు, వైడూర్యము, మరకత పచ్చలు.
వీటిలో ప్రతిరాయీ బంగారంలో పొదగబడింది.
నీవు సృష్టింపబడిన రోజుననే దేవుడు నిన్ను బలవంతుడిగా చేశాడు.
14నీవు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన కెరూబులలొ#28:14 కెరూబులు సాక్ష్యపు మందసం మీదనున్న కాపలా వాళ్లు, రాజ సింహాసనపు దార్లలాగ ఉన్నారు. ఒకడవై యున్నావు.
నీ రెక్కలు నా సింహాసనం మీదికి చాపబడ్డాయి.
దేవుని పవిత్ర పర్వతం మీద నిన్ను ఉంచాను.
అగ్నిలా మెరిసే ఆభరణాల గుండా నీవు నడిచావు.
15నేను నిన్ను సృష్టించినప్పుడు నీవు మంచివాడివి, యోగ్యుడిగా ఉన్నావు.
కాని ఆ తరువాత నీవు దుష్టుడవయ్యావు.
16నీ వ్యాపారం నీకు చాలా ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టింది.
ధనంతో పాటు నీలో మదం (గర్వం) పెరిగింది. దానితో నీవు పాపం చేశావు.
అందువల్ల నిన్నొక అపరిశుభ్రమైన వస్తువుగా నేను పరిగణించాను.
దేవుని పవిత్ర పర్వతం నుండి నిన్ను తోసివేశాను.
నీవు ప్రత్యేక కెరూబులలో ఒకడవు.
నీ రెక్కలు నా సింహాసనం పైకి చాప బడ్డాయి.
కాని అగ్నిలా మెరిసే ఆభరణాలను
వదిలిపెట్టి పోయేలా నిన్ను ఒత్తిడి చేశాను.
17నీ అందాన్ని చూచుకొని నీవు గర్వపడ్డావు.
నీ గొప్పతనం యొక్క గర్వం నీ జ్ఞానాన్ని పాడు చేసింది.
అందువల్ల నిన్ను క్రిందికి పడదోశాను.
ఇప్పుడు ఇతర రాజులు నీవంక తేరిపార జూస్తున్నారు.
18నీవు చాలా పాపాలు చేశావు.
నీవు చాలా కుటిలమైన వర్తకుడవు.
ఈ రకంగా పవిత్ర స్థలాలను నీవు అపవిత్ర పర్చావు.
కావున నీలో నేను అగ్ని పుట్టించాను.
అది నిన్ను దహించి వేసింది!
నీవు నేలమీద బూడిదవయ్యావు.
ఇప్పుడు ప్రతి ఒక్కడు నీ అవమానాన్ని చూడ గలడు.
19ఇతర దేశాల ప్రజలు నీకు సంభవించిన దాన్ని
చూచి ఆశ్చర్యపోయారు.
నీకు వచ్చిన ఆపద ప్రతి ఒక్కరిని భయపెడుతుంది.
నీవు సర్వనాశనమయ్యావు.’”
సీదోనుకు వ్యతిరేకంగా వర్తమానం
20యెహోవా మాట నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 21“నరపుత్రుడా, సీదోను పట్టణం వైపు చూడు. నా తరపున ఆ ప్రదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుము. 22ఈ రకంగా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“‘సీదోనూ, నేను నీకు వ్యతిరేకిని!
నీ ప్రజలు నన్ను గౌరవించటం నేర్చుకుంటారు!
నేను సీదోనును శిక్షిస్తాను.
ప్రజలు నేనే యెహోవానని అప్పుడు తెలుసుకుంటారు.
నేను పవిత్రుడనని వారు నేర్చుకుని
నన్ను ఆ విధంగా చూసుకుంటారు.
23రోగాలను, మరణాన్ని నేను సీదోనుకు పంపిస్తాను.
ఖడ్గం (శత్రు సైన్యం) నగరం వెలుపల చాలా మందిని చంపుతుంది.
వారప్పుడు నేనే యెహోవానని తెలుసుకుంటారు!’”
ఇతర రాజ్యాలు ఇశ్రాయేలును పరిహసించటం మానుట
24“‘గతంలో ఇశ్రాయేలు చుట్టూ ఉన్న దేశాలు దానిని అసహ్యించుకున్నాయి. కాని ఆయా దేశాలకు కీడు జరుగుతుంది. ఇశ్రాయేలు వంశాన్ని బాధించే ముండ్లు గాని, వదలక అంటుకునే ముండ్ల పొదలు గాని ఇక ఎంత మాత్రం ఉండవు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’”
25నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నేను ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు చెదరగొట్టాను. కాని, ఇశ్రాయేలు వంశాన్ని నేను మళ్లీ ఒక్క చోటికి చేర్చుతాను. అప్పుడా రాజ్యాలన్నీ నేను పవిత్రుడనని తెలుసుకుంటాయి. అవి నన్ను ఆ విధంగా గౌరవిస్తాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తమ రాజ్యంలో నివసిస్తారు. ఆ రాజ్యాన్ని నేను నా సేవకుడైన యాకోబుకు ఇచ్చాను. 26వారు ఆ రాజ్యంలో క్షేమంగా ఉంటారు. వారు ఇండ్లు కట్టుకొని, ద్రాక్షాతోటలు పెంచుకుంటారు. నేను వారి చుట్టూ ఉండి, వారిని అసహ్యించుకున్న దేశాల వారిని శిక్షిస్తాను. తరువాత ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా జీవిస్తారు. అప్పుడు నేనే వారి దేవుడనైన యెహోవానని వారు తెలుసుకొంటారు.”
Currently Selected:
యెహెజ్కేలు 28: TERV
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International