యెహెజ్కేలు 29
29
ఈజిప్టుకు వ్యతిరేకంగా వర్తమానం
1దేశం నుండి వెళ్లగొట్టబడిన పదవ సంవత్సరం, పదవనెల (జనవరి) పన్నెండవరోజున నా ప్రభువైన యెహోవా మాట నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 2“నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోవైపు చూడు. నా తరపున నీవు అతనికి (ఈజిప్టుకు) వ్యతిరేకంగా మాట్లాడుము. 3నీవు ఈ విధముగా మాట్లాడుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“‘ఈజిప్టు రాజువైన ఫరో, నేను నీకు విరోధిని.
నీవు నైలునదీ తీరాన పడివున్న ఒక పెద్ద క్రూర జంతువువి.
“ఈ నది నాది! ఈ నదిని నేను ఏర్పాటు చేశాను!”
అని నీవు చెప్పుకొనుచున్నావు.
4-5“‘కాని నేను నీ దవడలకు గాలం వేస్తాను.
నైలునదిలోని చేపలు నీ చర్మపు పొలుసులను అంటుకుంటాయి.
పిమ్మట నిన్ను, నీ చేపలను నదిలోనుంచి లాగి నేలమీదికి ఈడ్చుతాను.
నీవు నేలమీద పడతావు.
నిన్నెవ్వరూ లేవనెత్తటం గాని,
పాతిపెట్టడం గాని, చేయరు.
నేను నిన్ను అడవి జంతువులకు, పక్షులకు వదిలివేస్తాను.
నీవు వాటికి ఆహారమవుతావు.
6ఈజిప్టు నివసిస్తున్న ప్రజలంతా నేనే
యెహోవానని అప్పుడు తెలుసుకుంటారు!
“‘నేనీ పనులు ఎందుకు చేయాలి?
ఇశ్రాయేలు ప్రజలు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద ఆధారపడ్డారు.
కాని ఈజిప్టు రెల్లు గడ్డిలా బలహీనమైనది.
7ఇశ్రాయేలు ప్రజలు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద ఆధారపడ్డారు.
కాని ఈజిప్టువారి చేతులకు, భుజాలకు తూట్లు పొడిచింది.
వారు సహాయం కొరకు నీ మీద ఆధారపడ్డారు.
కాని నీవు వారి నడుము విరుగగొట్టి, మెలిపెట్టావు.’”
8కావున నా ప్రభువైన యెహోవా, ఈ విషయాలు చెపుతున్నాడు:
“నేను నీ మీదికి కత్తిని రప్పిస్తున్నాను.
నేను నీ ప్రజలందరినీ, పశువులనూ నాశనం చేస్తాను.
9ఈజిప్టు నిర్మానుష్యమై నాశనమవుతుంది.
అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”
దేవుడు ఇలా చెప్పాడు: “నేనెందుకీ పనులు చేయాలి? ‘ఈ నది నాది. ఈ నదిని నేను ఏర్పాటు చేశాను’ అని నీవు చెప్పుకున్నందువల్ల! నేను ఆ పనులు చేయదలిచాను. 10కావున నేను (దేవుడు) నీకు వ్యతిరేకిని. అనేకంగా ఉన్న నైలు నదీ శాఖలకు నేను విరోధిని. నేను ఈజిప్టును పూర్తిగా నాశనం చేస్తాను. మిగ్దోలునుండి ఆశ్వన్ (సెవేనే) వరకు, మరియు ఇథియోపియ (కూషు) సరిహద్దు వరకు గల నగరాలన్నీ నిర్మానుష్యమై పోతాయి. 11మనుష్యుడే గాని, జంతువే గాని ఈజిప్టు దేశం గుండా వెళ్లరు. 12పాడుబడ్డ దేశాల మధ్యలో ఈజిప్టు దేశాన్ని పాడుబడ్డ నగరాల మధ్యలో దాని నగరాన్ని పాడుగా చేస్తాను. అది నలభై సంవత్సరాలు పాడుగా ఉంటుంది. ఈజిప్టు వారిని జనాల మధ్యలోనికి తోలివేసి చెదరగొడతాను. చెదరగొట్టిన దేశాల్లో నేను వారిని పరాయి వారినిగా చేస్తాను.”
13నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఈజిప్టు ప్రజలను నేను అనేక దేశాలకు చెదరి పోయేలా చేస్తాను. కాని నలభై సంవత్సరాల అనంతరం ఆ ప్రజలను నేను మళ్లీ సమీకరిస్తాను. 14ఈజిప్టు బందీలను నేను వెనుకకు తీసుకొని వస్తాను. ఈజిప్టువారిని వారి జన్మస్థలమైన పత్రోసుకు తిరిగి తీసుకొని వస్తాను. అయితే వారి రాజ్యానికి మాత్రం ప్రాముఖ్యం ఉండదు. 15అది పాముఖ్యం లేని రాజ్యంగా తయారవుతుంది. అది మరెన్నడూ సాటి రాజ్యాల కంటె మిన్నగా పెరగజాలదు. అది ఇతర రాజ్యాల మీద ఆధిపత్యం చేయలేనంత చిన్నగా దానిని నేను తగ్గించి వేస్తాను. 16ఇశ్రాయేలు వంశం వారు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద మరెన్నడు ఆధార పడరు. ఇశ్రాయేలీయులు తమ పాపాన్ని గుర్తు తెచ్చుకుంటారు. తమ సహాయం కొరకు దేవుని అర్థించకుండా ఈజిప్టును ఆశ్రయించిన తమ పాపాన్ని వారు గుర్తు తెచ్చుకుంటారు. నేనే ప్రభువైన యెహోవానని వారు గుర్తిస్తారు.”
బబులోను ఈజిప్టును వశపర్చుకొంటుంది
17దేశంనుండి వెళ్ల గొట్టబడిన ఇరవై ఏడవ సంవత్సరం, మొదటి నెల (ఏప్రిల్) మొదటి రోజున దేవుని వాక్కు నాకు వినబడింది. ఆయన ఇలా చెప్పాడు, 18“నరపుత్రుడా, బబులోను రాజైన నెబుకద్నెజరు తూరుపై యుద్ధంలో తన సైన్యాలు తీవ్రంగా పోరాడేలాగు చేశాడు. వాళ్లు ప్రతి సైనికుని తల గొరిగారు. బరువైన పనులు ప్రతి సైనికుని తలమీద రుద్దబడినవి. ప్రతి సైనికుని భుజం కొట్టుకుపోయి పుండయ్యింది. తూరును ఓడించటానికి నెబుకద్నెజరు, అతని సైన్యం చాలా శ్రమ పడవలసి వచ్చింది. కాని ఆ శ్రమకు తగిన ప్రతిఫలం వారికి దక్కలేదు.” 19అందువల్ల నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెపుతున్నాడు: “నేను ఈజిప్టు రాజ్యాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. నెబుకద్నెజరు ఈజిప్టు ప్రజలను పట్టుకు పోతాడు. ఈజిప్టు నుంచి విలువైన వస్తువుల నెన్నింటినో నెబుకద్నెజరు తీసుకొనిపోతాడు. అదే నెబుకద్నెజరు సైన్యానికి పారితోషికం. 20నెబుకద్నెజరు చేసిన కష్టానికి అతనికి నేను ఈజిప్టు రాజ్యాన్ని ప్రతిఫలంగా ఇస్తున్నాను. వారు నా కొరకు పనిచేశారు గనుక నేనిది వారికి చేస్తున్నాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!
21“ఆ రోజన ఇశ్రాయేలు వంశాన్ని నేను బలపర్చుతాను. పైగా నీ ప్రజలు ఈజిప్టువారిని చూచి నవ్వుతారు. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు.”
Currently Selected:
యెహెజ్కేలు 29: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International