ప్రసంగి 8
8
జ్ఞానం మరియు అధికారం
1ఆయా విషయాలను ఒక జ్ఞాని అర్థం చేసుకుని, వివరించి చెప్పగలిగినట్లు మరొకరెవరూ చెయ్యలేరు. అతని జ్ఞానం అతనికి ఆనందాన్నిస్తుంది. జ్ఞానంవల్ల ముఖంలో విచారం తొలగి, ఆనందం చోటు చేసుకుంటుంది.
2నేను చెప్పేదేమిటంటే, నీవు ఎల్లప్పుడూ రాజాజ్ఞను పాటింలించాలి. నీవు దేవుని ఎదుట ప్రమాణం చేశావు కనుక నీవీ పని చెయ్యాలి. 3రాజుకు సలహాలు ఇచ్చేందుకు భయపడకు. చెడ్డదాన్ని దేన్ని సమర్థించకు. కాని ఒక విషయం గుర్తుంచుకో: రాజు తనకు సంతోషం కలిగించే ఆజ్ఞలు ఇస్తాడు. 4రాజుకు ఆజ్ఞలు ఇచ్చే అధికారం ఉంది. రాజు ఏమి చెయ్యాలో అతనికి ఎవరూ చెప్పలేరు. 5రాజాజ్ఞను పాటించే వ్యక్తి క్షేమంగా వుంటాడు. అయితే, వివేకవంతుడికి ఈ పని చేయవలసిన సరైన తరుణం ఏదో, ఆ సరైన పని ఎప్పుడు చెయ్యాలో తెలుస్తుంది.
6మనిషి ఏ పనైనా చెయ్యవలసినప్పుడు, దానికి సరైన సమయం, సరైన మార్గం వుంటాయి. (ప్రతి వ్యక్తీ ప్రయత్నించి, తాను చెయ్యవలసింది ఏమిటో నిర్ణయించుకోవాలి.) తనకి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏమి జరుగుతుందో తెలియనప్పుడు కూడా అతనీ పని చెయ్యాలి. 7ఎందుకంటే, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఏ ఒక్కరూ చెప్పలేరు గనుక.
8తన ఆత్మ తొలగిపోకుండా నిలుపుకోగల శక్తి ఏ ఒక్కరికి లేదు. తన మృత్యువును ఆపు చేయగల శక్తి ఏ ఒక్కరికీ లేదు. యుద్ధ సమయంలో తన ఇష్టంవచ్చిన చోటికి పోగల స్వేచ్ఛ సైనికుడికి ఎలా వుండదో, అలాగే ఒక వ్యక్తి పాపం చేస్తే, ఆ పాపం అతన్ని స్వేచ్ఛగా వుండనివ్వదు.
9నేనీ విషయాలన్నీ గమనించాను. ఈ ప్రపంచంలో జరిగే విషయాలను గురించి నేను తీవ్రంగా ఆలోచించాను. మనుష్యులు ఎప్పుడూ యితరుల మీద అధికారం చలాయించే శక్తిని సంపాదించుకునేందుకు తంటాలు పడుతూ ఉంటారన్న విషయం నేను గమనించాను. ఇది వాళ్లకి చెరుపు చేస్తుంది.
10దుర్మార్గులకు ఘనంగా అంత్యక్రియలు జరగడం కూడా నేను చూశాను. అంత్యక్రియలు ముగించి, మనుష్యులు ఇళ్లకి తిరిగివెళ్లేటప్పుడు, చనిపోయిన దుర్మార్గుణ్ణి గురించి మంచి మాటలు చెప్పడం నేను విన్నాను. ఆ దుర్మార్గులు అనేకానేకమైన చెడ్డ పనులు చేసిన పట్టణాల్లో కూడా అర్థరహితమైన పని జరిగింది. అది అర్థరహితమైనది.
న్యాయం, బహుమతులు, దండన
11కొన్ని సందర్భాల్లో, మనుష్యులు చేసిన చెడ్డ పనులకుగాను, వాళ్లు వెంటనే శిక్షింపబడరు. శిక్ష తాపీగా వస్తుంది. దానితో, యితరులకు కూడా చెడ్డ పనులు చెయ్యాలన్న కోర్కె కలుగుతుంది.
12ఒకానొక పాపి నూరు చెడు పనులు చేసియుండవచ్చు, అతను దీర్ఘాయుష్షు కలిగియుండవచ్చు. అయినప్పటికీ, దేవుడిపట్ల విధేయత, గౌరవం కలిగివుండటం మేలన్న విషయం నాకు తెలుసు. 13దుర్మార్గులు దేవుణ్ణి గౌరవించరు. అందుకని, నిజంగానే వాళ్లకి మంచి ఫలితాలు లభించవు. ఆ దుర్మార్గులు దీర్గకాలం జీవించరు. (సూర్యుడు క్రిందకి వాలిన కొద్ది) పొడుగయ్యే నీడల్లాగా వాళ్ల జీవితాలు దీర్ఘంకావు.
14న్యాయంగా కనిపించని మరొకటి కూడా భూమి మీద సంభవిస్తూ ఉంటుంది. చెడ్డవాళ్లకి చెడు, మంచి వాళ్లకి మంచి జరగాలి. కాని, కొన్ని సందర్భాల్లో మంచి వాళ్లకి చెడు, చెడ్డవాళ్లకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇది సరైనది కాదు. 15అందుకని, జీవితాన్ని హాయిగా అనుభవించడం మరింత మెరుగైనదని నేను తీర్మానించుకున్నాను. ఈ ప్రపంచంలో మనుష్యులు చెయ్యగలిగిన అత్యుత్తమమైన పనేమిటంటే, తినడం, తాగడం, జీవితాన్ని హాయిగా అనుభవించడమే. కనీసం అలా చేస్తేనైనా, తమ జీవితకాలంలో దేవుడు తమకిచ్చిన కఠిన శ్రమని మనుష్యులు సరదాగా సంతోషంగా చేసేందుకు అది తోడ్పడుతుంది.
దేవుడు చేసేవన్ని మనకు బోధపడవు
16ఈ ప్రపంచంలో మనుష్యులు చేసే పనులను నేను శ్రద్ధగా పరిశీలించాను. మనుష్యులు ఎంత హడావుడిగా ఉంటారో నేను చూశాను. వాళ్లు రాత్రింబగళ్లు శ్రమిస్తారు. వాళ్లు దాదాపు నిద్రేపోరు. 17దేవుడు చేసేవాటిలో అనేకం కూడా నేను చూశాను. ఈ భూమిమీద దేవుడు చేసేదాన్నంతటినీ మనుష్యులు అర్థంచేసుకోలేరు. మనిషి వాటిని అర్థం చేసుకునేందుకు ఎంతైనా ప్రయత్నించవచ్చు. కాని, అతను అర్థంచేసుకోలేడు. దేవుడు చేసినదాన్ని తాను అర్థం చేసుకున్నానని ఒక జ్ఞాని అనవచ్చు. కాని, అది నిజంకాదు. వాటన్నింటినీ ఏ ఒక్కడూ అర్థం చేసుకోలేడు.
Currently Selected:
ప్రసంగి 8: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International