YouVersion Logo
Search Icon

ప్రసంగి 7

7
జ్ఞాన బోధల సేకరణ
1మంచి పరిమళ ద్రవ్యంకంటె మంచి పేరు (గౌరవం) కలిగివుండటం మేలు.
జన్మ దినం కంటె మరణ దినం మేలు.
2విందుకి పోవడంకంటె, మరణించినవారి అంత్య క్రియలకి హాజరవడం మేలు.
ఎందుకంటే, పుట్టిన వాళ్లెవరూ గిట్టకమానరు, బ్రతికున్న ప్రతివాడు ఈ విషయం గుర్తుంచుకోవాలి.
3నవ్వుకంటె దుఃఖం మరింత మేలు,
ఎందుకంటే, మన ముఖం విచారగ్రస్తమైనప్పుడు, మన మనస్సు మెరుగవుతుంది.
4అవివేకి సరదాగా హాయిగా గడపాలని మాత్రమే ఆలోచిస్తాడు,
కాని, వివేకి మృత్యువు గురించి ఆలోచిస్తాడు.
5మూర్ఖుడి పొగడ్త పొందడం కంటె,
వివేకిచే విమర్శింప బడటం మేలు.
6మూర్ఖుల నవ్వులాటలు
కుండ కింద చిటపట మండే ముళ్లలా ఉంటాయి.
(కుండ వేడైనా ఎక్కకముందే, ఆ ముళ్లు చురచుర మండి పోతాయి.)
ఇది కూడా నిష్ర్పయోజనమే.
7ఎవడైనా తగినంత డబ్బు ముట్టచెప్పితే
వివేక వంతుడైనా తన వివేకాన్ని విస్మరిస్తాడు.
ఆ డబ్బు అతని విచక్షణను నాశనం చేస్తుంది.
8ఏదైనా మొదలెట్టడం కంటె
దాన్ని ముగించడం మేలు.
అహంభావం, అసహనం కంటె
సాధుత్వం, సహనము మేలు.
9తొందరపడి కోపం తెచ్చుకోకు
ఎందుకంటే అది అవివేకం (మూర్ఖులు అవి చేస్తారు)
10“గడిచి పోయిన రోజులే మేలు” అనబోకు.
“అప్పుడు జరిగినదేమిటి?”
ఇది అవివేకమైన ప్రశ్న.
11నీకు ఆస్తితో బాటు జ్ఞానం కూడా ఉంటే మరింత మంచిది. నిజానికి, వివేకవంతులు కావలసిన దానికంటే అధికంగానే ఐశ్వర్యాన్ని పొందుతారు. 12వివేకవంతుడు సంపన్నుడవగలడు. ధనం అండ అయినట్టే వివేకం అండ అవుతుంది. కాని జ్ఞానంయొక్క ప్రయోజనం ఏమంటే, వివేకం తన యజమానికి అండ అవుతుంది.
13దేవుడు చేసినవాటిని పరిశీలించి చూడండి. వాటిలో ఏదైనా ఒకటి పొరపాటైనదని నీవు అనుకున్నా వాటిలో ఏ ఒక్కదాన్ని నీవు మార్చలేవు! 14రోజులు బాగున్నప్పుడు, నీవు దాన్ని అనుభవించు. కాని, రోజులు బాగుండనప్పుడు, దేవుడు మనకి మంచి రోజులు, చెడ్డ రోజులు వ్రాసి పెట్టాడన్న విషయం మరచిపోకు. ముందేమి జరుగుతుందో ఏ ఒక్కరికీ తెలియదు.
మంచివాళ్లుగా ఉండటం నిజంగా అసాధ్యం
15నా స్వల్ప జీవిత కాలంలో నేను అన్ని చూశాను. మంచివాళ్లు చిన్న వయస్సులోనే మరణించడం చూశాను. చెడ్డవాళ్లు సుదీర్ఘకాలం జీవించడం చూశాను. 16-17అందుకని అకాలంగా నిన్ను నీవు చంపుకోవడం దేనికి? అతి మంచిగా కాని, అతి చెడ్డగా కాని ఉండకు. అతి తెలివిగా కాని అతి మూర్ఖంగా కాని ఉండకు. నీ ఆయువు తీరక ముందే నువ్వెందుకు చనిపోవాలి?
18దీనిని పట్టుకో గాని దానిని చేయి విడువకుండా ఉండటం మేలు. దేవునికి భయపడేవారు కూడా కొన్ని మంచికార్యాలు, కొన్ని చెడ్డకార్యాలు చేస్తారు. 19-20ఎప్పుడు మంచి పనులే చేసి, ఎన్నడూ పాపాలు చేయని మంచివాడంటూ లేడని ఖచ్చితంగా చెప్పవచ్చు. జ్ఞానం మనిషికి శక్తిని చేకూరుస్తుంది. నగరంలో పదిమంది (మూర్ఖులైన) నాయకులకంటె ఒక్క వివేకవంతుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు.
21జనం చెప్పే మాటలన్ని చెవిని చొరనీయకు. నీ స్వంత నౌకరే నీ గురించి చెడ్డ మాటలు చెప్పడం నీవు వినవచ్చు. 22నీవు కూడా అనేకసార్లు యితరులను గురించి చెడ్డ మాటలు చెప్పియుండ వచ్చునని నీకు తెలుసు.
23నేను నా వివేకాన్ని వినియోగించి, ఈ విషయాలన్నింటిని గురించి ఆలోచించాను. నేను సరైన వివేకిగా వుండాలని కోరుకున్నాను. కాని అది దుస్సాధ్యం. 24విషయాలెందుకిలా ఉన్నాయో నేను అర్థం చేసుకోలేను. దాన్ని అర్థం చేసుకోవడం ఎవరికైనా చాలా కష్టమే. 25నేను అధ్యయనం చేసి, సరైన జ్ఞానాన్ని అన్వేషించేందుకు చాలా గట్టి ప్రయత్నం చేశాను. ప్రతి ఒక్కదానికి హేతువును కనుక్కునేందుకు నేను ప్రయత్నించాను. (నేనేమి తెలుసుకున్నాను?)
చెడ్డగా ఉండటం మూర్ఖత్వమనీ, మూర్ఖంగా వ్యవహరించడం పిచ్చితనమనీ నేను తెలుసుకున్నాను. 26(కొందరు) స్త్రీలు వలల మాదిరిగా ప్రమాద కారులు అన్న విషయం కూడా నేను తెలుసుకున్నాను. వాళ్ల హృదయాలు వలల్లాంటివి, వాళ్ల చేతులు గొలుసుల్లాంటివి. ఆ స్త్రీల చేతుల్లో చిక్కడం మరణం కంటె హీనం. దేవుణ్ణి అనుసరించే వ్యక్తి అలాంటి స్త్రీలనుండి పారిపోతాడు. అయితే, పాపులు సరిగ్గా వాళ్లకే చిక్కుతారు.
27-28ప్రసంగి ననే నేను చెప్పేదేమిటంటే, “వీటన్నింటికీ సమాధానాలు కనుగొనగలనేమోనని నేను పై విషయాలన్నీ మొత్తంగా పరిశీలించాను. సమాధానాల కోసం నేనిప్పటికీ అన్వేషిస్తూనే వున్నాను. అయితే, నేను కనుగొన్నది ఇది: నాకు వెయ్యి మందిలో ఒక్క మంచి మగాడు కనిపించగా, వెయ్యి మందిలో ఒక్క మంచి స్త్రీ కూడా కనిపించలేదు.
29“నేను తెలుసుకున్న మరో విషయం: దేవుడు మనుష్యుల్ని నిజాయితీగల (మంచి) వాళ్లుగా సృష్టించాడు. కాని, మనుష్యులు చెడ్డగా ఉండేందుకు అనేక మార్గాలు కనుగొన్నారు.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in