YouVersion Logo
Search Icon

థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ లేఖ 3

3
మా కోసం ప్రార్థించండి
1సోదరులారా! చివరకు చెప్పేదేమిటంటే మా కోసం ప్రార్థించండి. ప్రభువు సందేశం మీలో వ్యాపించిన విధంగా త్వరలోనే మిగతా వాళ్ళలో కూడా వ్యాపించి కీర్తి చెందాలని ప్రార్థించండి. 2విశ్వాసం అందరిలో ఉండదు. కనుక దుర్మార్గుల నుండి, దుష్టుల నుండి మేము రక్షింపబడాలని ప్రార్థించండి.
3కాని ప్రభువు నమ్మతగినవాడు. కనుక ఆయన మిమ్మల్ని సాతాను నుండి రక్షించి మీకు శక్తి కలిగిస్తాడు. 4మా ఆజ్ఞల్ని పాటిస్తున్నారనీ ఇక ముందుకునూ పాటిస్తారని మాకు నమ్మకం ఉంది. ఈ నమ్మకం మాకు ప్రభువు వల్ల కలిగింది. 5తండ్రియైన దేవునిలో ఉన్న ప్రేమ, క్రీస్తులో ఉన్న సహనము మీ హృదయాల్లో నింపబడాలని మా అభిలాష.
పని చెయ్యటం మీ కర్తవ్యం
6సోదరులారా! యేసు క్రీస్తు ప్రభువు పేరిట మేము ఆజ్ఞాపిస్తున్నదేమనగా, మా నుండి విన్న క్రీస్తు సందేశం ప్రకారం జీవించక అక్రమంగా జీవిస్తున్న ప్రతి సోదరునితో సాంగత్యం చెయ్యకండి. 7మమ్మల్ని అనుసరించాలని మీకు బాగా తెలుసు. మేము మీతో ఉన్నప్పుడు సోమరులంగా ఉండలేదు. 8అంతేకాక మేము ఎవరి ఇంట్లోనైనా ఊరికే భోజనం చేయలేదు. మీలో ఎవ్వరికీ కష్టం కలిగించరాదని మేము రాత్రింబగళ్ళు కష్టపడి పని చేసాము. 9మీ నుండి అలాంటి సహాయం కోరే అధికారం మాకు ఉంది. కాని మీకు ఆదర్శంగా ఉండాలని అలా చేసాము. 10మేము మీతో ఉన్నప్పుడే, “మనిషి పని చేయకపోతే భోజనం చేయకూడదు” అని చెప్పాము.
11మీలో కొందరు సోమరులని విన్నాము. వాళ్ళు పని చెయ్యకపోవటమే కాకుండా ఇతరుల విషయంలో జోక్యం కలుగ చేసుకొంటున్నారని విన్నాము. 12వాళ్ళు ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోరాదని, తాము తినే ఆహారం పనిచేసి సంపాదించాలని యేసు క్రీస్తు పేరిట ఆజ్ఞాపిస్తున్నాము. 13ఇక మీ విషయమంటారా, మంచి చెయ్యటం మానకండి.
14ఈ లేఖలో వ్రాసిన మా ఉపదేశం ఎవరైనా పాటించకపోతే అలాంటివాళ్ళను ప్రత్యేకంగా గమనించండి. అలాంటివాణ్ణి సిగ్గుపడేటట్లు చెయ్యటానికి అతనితో సాంగత్యం చేయకండి. 15అయినా అతణ్ణి శత్రువుగా పరిగణించకుండా సోదరునిగా భావించి అతణ్ణి వారించండి.
చివరి మాట
16శాంతిని ప్రసాదించే ప్రభువు మీకు అన్ని వేళలా, అన్ని విధాలా శాంతి ప్రసాదించు గాక! పైగా ఆయన మీ అందరికీ తోడై ఉండుగాక!
17పౌలను నేను, నా స్వహస్తాలతో మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా లేఖలన్నిటిలో నేను ఇదే విధంగా సంతకం చేస్తాను. ఇది నా పద్ధతి.
18మన యేసు క్రీస్తు అనుగ్రహం మీ అందరికీ లభించుగాక!

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ లేఖ 3