తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 1
1
1విశ్వాసంలో నా కుమారునితో సమానమైన తిమోతికి పౌలు వ్రాయడం ఏమనగా, నేను మన రక్షకుడైన దేవుని ఆజ్ఞానుసారమూ, మనకు రక్షణ లభిస్తున్న ఆశకు మూలకారకుడైన యేసు క్రీస్తు ఆజ్ఞానుసారమూ, యేసు క్రీస్తుకు అపొస్తలుడనయ్యాను.
2తండ్రి అయినటువంటి దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు, నీపై అనుగ్రహం చూపాలనీ, నిన్ను కరుణించాలనీ, నీకు శాంతి చేకూర్చాలనీ ఆశిస్తున్నాను.
దొంగ బోధకుల విషయంలో జాగ్రత్త
3నేను మాసిదోనియకు వెళ్ళినప్పుడు నీకు చెప్పిన విధంగా నీవు ఎఫెసులో ఉండుము. అక్కడ కొందరు తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు. వాళ్ళతో ఆ విధంగా చెయ్యవద్దని చెప్పు. 4అంతేకాక, వాళ్ళు కల్పితగాథలు చెప్పకూడదనీ, అంతు పొంతులేని వంశావళులతో సమయం వ్యర్థం చేయవద్దని కూడా ఆజ్ఞాపించు. ఇలాంటివి దైవకార్యానికి తోడ్పడడానికి బదులుగా చీలికలు కల్గిస్తాయి. దైవకార్యం విశ్వాసంతో కూడుకొన్నపని. 5ఇందులోని ఉద్దేశ్యం ఏమిటంటే, పవిత్ర హృదయం నుండీ, స్వచ్ఛమైన అంతరాత్మ నుండీ, నిజమైన విశ్వాసం నుండీ ఉద్భవించే ప్రేమను కలిగియుండటమే. 6కొందరు వ్యక్తులు నిజమైన ధ్యేయం మరిచిపోయి, వ్యర్థంగా తిరిగిపోయారు. 7తాము ధర్మశాస్త్ర పండితులు కావాలనుకొంటారు. కాని వాళ్ళకు వాళ్ళు చెప్పే మాటలే తెలియదు. నమ్మకంతో మాట్లాడుతున్న విషయాలను గురించి వాళ్ళకు తెలియదు.
8ధర్మశాస్త్రాన్ని మానవుడు సక్రమంగా ఉపయోగిస్తే మంచిదని మనకు తెలుసు. 9మంచివాళ్ళ కోసం ధర్మశాస్త్రం వ్రాయబడలేదని మనకు తెలుసు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించేవాళ్ళకోసం, తిరుగుబాటు చేసేవాళ్ళ కోసం, దేవుణ్ణి నమ్మనివాళ్ళకోసం, భక్తిహీనుల కోసం, పాపుల కోసం, అపవిత్రమైనవాళ్ళకోసం, తల్లిదండ్రులను గౌరవపరచనివాళ్ళకోసం, హంతకుల కోసం, 10వ్యభిచారుల కోసం, కామంతో అసహజంగా ప్రవర్తించేవాళ్ళకోసం, బానిస వ్యాపారం చేసేవాళ్ళకోసం, అసత్యాలాడేవాళ్ళకోసం, దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళ కోసం, నిజమైన బోధనకు వ్యతిరేకంగా నడుచుకొనేవాళ్ళకోసం, అది వ్రాయబడింది. 11నాకందించిన దివ్యమైన ఆ సువార్తలో ఈ ఉపదేశం ఉంది. దాన్ని తేజోవంతుడైన దేవుడు నాకందించాడు.
దేవుని దయకు నేను కృతజ్ఞుణ్ణి
12నాకు శక్తినిచ్చి, నన్ను విశ్వాసపాత్రునిగా ఎంచి, ఈ సేవకోసం నన్ను నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకు నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. 13ఒకనాడు నేను దైవదూషణ చేసినవాణ్ణి, హింసించిన వాణ్ణి, క్రూరుణ్ణి. నేను అమాయకంగా నాలో విశ్వాసం లేకపోవడం వల్ల అలా ప్రవర్తించానని దేవుడు నన్ను కనికరించాడు. 14మన ప్రభువు తన అనుగ్రహాన్ని నాపై ధారాళంగా కురిపించాడు. ఆ అనుగ్రహంతో పాటు యేసు క్రీస్తులో ఉన్న విశ్వాస గుణాన్ని, ప్రేమను కూడా నాకు ప్రసాదించాడు.
15పాపులను రక్షించటానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది విశ్వసింపదగిన విషయం. దీన్ని అందరూ అంగీకరించాలి. ఆ పాపుల్లో నేను ప్రథముణ్ణి. 16నేను ప్రథముణ్ణి కనుకనే యేసు నాపై దయ చూపాడు. ఈ విధంగా తనను విశ్వసించబోయేవాళ్ళకు, తనవల్ల విముక్తి పొందబోయేవాళ్ళకు అనంతమైన తన సహనము ఆదర్శంగా ఉండాలని అంతులేని సహనాన్ని ప్రదర్శించాడు. 17చిరకాలం రాజుగా ఉండే దేవునికి, కంటికి కనిపించని, చిరంజీవి అయినటువంటి ఆ ఒకే ఒక దేవునికి గౌరవము, మహిమ చిరకాలం కలుగుగాక! ఆమేన్.
18తిమోతీ, నా కుమారుడా! గతంలో ప్రవక్తలు నీ భవిష్యత్తును గురించి చెప్పారు. దాని ప్రకారం మంచి పోరాటం సాగించి ఆ ప్రవక్తలు చెప్పినవి సార్థకం చేయమని ఆజ్ఞాపిస్తున్నాను. 19విశ్వాసంతో, మంచి హృదయంతో పోరాటం సాగించు. కొందరు వీటిని వదిలి తమ విశ్వాసాన్ని పోగొట్టుకొన్నారు. 20హుమెనై, అలెక్సంద్రు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు దైవదూషణ చెయ్యకుండా ఉండటం నేర్చుకోవాలని వాళ్ళను సాతానుకు అప్పగించాను.
Currently Selected:
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 1: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International