2 దినవృత్తాంతములు 36
36
యూదా రాజుగా యెహోయాహాజు
1యెరూషలేములో కొత్త రాజుగా యూదా ప్రజలు యెహోయాహాజును ఎన్నుకొన్నారు. యెహోయాహాజు యోషీయా కుమారుడు. 2యుదాకు రాజయ్యేనాటికి యెహోయాహాజు ఇరువది మూడేండ్లవాడు. అతడు యెరూషలేములో మూడు నెలలపాటు రాజుగా వున్నాడు. 3పిమ్మట ఈజిప్టు రాజైన నెకో యెహోయాహాజును బందీగా పట్టుకున్నాడు. నెకో యూదా ప్రజలను రెండువందల మణుగుల (మూడు ముప్పావు టన్నులు) వెండిని, రెండు మణుగుల (డెబ్బదియైదు పౌనులు) బంగారాన్ని అపరాధ రుసుముగా చెల్లించేలా చేశాడు. 4యెహోయాహాజు సోదరుని యూదా, యెరూషలేములపై నూతన రాజుగా నెకో నియమించాడు. యెహోయాహాజు సోదరుని పేరు ఎల్యాకీము. పిమ్మట ఎల్యాకీముకు నెకో ఒక క్రొత్త పేరు పెట్టాడు. అతనికి యెహోయాకీము అను మారుపేరు పెట్టాడు. కాని యెహోయాహాజును నెకో ఈజిప్టుకు తీసికొని వెళ్లాడు.
యూదా రాజుగా యెహోయాకీము
5యూదాకు కొత్త రాజయ్యేనాటికి యెహోయాకీము ఇరువదియైదేండ్లవాడు. యెహోవా కోరిన విధంగా యెహోయాకీము ధర్మంగా ప్రవర్తించలేదు. దేవుడైన యెహోవా పట్ల అతడు పాపం చేశాడు.
6బబులోను (బాబిలోనియా) రాజైన నెబుకద్నెజరు యూదాపై దండెత్తి వచ్చాడు. అతడు యెహోయాకీమును బందీగాచేసి అతనికి కంచు గొలుసులు తగిలించాడు. తరువాత యెహోయాకీమును నెబుకద్నెజరు బబులోనుకు తీసికొని వెళ్లాడు. 7యెహోవా ఆలయం నుండి నెబుకద్నెజరు కొన్ని వస్తువులను దోచుకుపోయాడు. అతడా వస్తువులను బబులోనుకు పట్టుకుపోయి వాటిని తన స్వంత ఇల్లయిన రాజగృహంలో వుంచాడు. 8యెహోయాకీము చేసిన ఇతర విషయాలు, అతడు చేసిన భయంకరమైన పాపాలు, మరియు అతనిని దోషిగా నిరూపించే అతని ప్రతి కార్యం గురించి ఇశ్రాయేలు, యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. యెహోయాకీము స్థానంలో అతని కుమారుడు యెహోయాకీను కొత్తగా రాజయ్యాడు.
యూదా రాజుగా యెహోయాకీను
9యూదాకు రాజయ్యేనాటికి యెహోయాకీను పద్దెనిమిది సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో మూడు నెలల పది రోజులు రాజుగా వున్నాడు. యెహోవా కోరిన విధంగా అతడు తన కార్యాలను నిర్వర్తించలేదు. యెహోవా పట్ల యెహోయాకీను పాపం చేశాడు. 10వసంత ఋతువులో యెహోయాకీనును పట్టి తెమ్మని రాజైన నెబకద్నెజరు తన మనుష్యులను పంపాడు. వారు యెహోయాకీనును, యెహోవా ఆలయం నుండి కొన్ని ధనరాసులను బబులోనుకు తెచ్చారు. యూదా, యెరూషలేములకు నూతన రాజుగా సిద్కియాను నెబకద్నెజరు నియమించాడు. సిద్కియా అనువాడు యెహోయాకీనుకు బంధువు.
యూదా రాజుగా సిద్కియా
11యూదాకు రాజుయ్యేనాటికి సిద్కియా ఇరువైఒక సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో పద కొండు సంవత్సరాలు రాజుగా వున్నాడు. 12యెహోవా కోరినట్లు సిద్కియా ఉత్తమ కార్యాలు చేయలేదు. యెహోవా పట్ల సిద్కియా పాపం చేశాడు. దేవుని ముందు అతడు వినయ విధేయతలు చూపించలేదు. ప్రవక్త యిర్మీయా చెప్పిన విషయాలను పాటించలేదు. యెహోవా సందేశాన్ని యిర్మీయా ప్రవచించాడు.
యెరూషలేము నాశనమగుట
13రాజైన నెబుకద్నెజరుపై సిద్కియా తిరుగుబాటు చేశాడు. గతంలో నెబుకద్నెజరుకు విశ్వాసంగా వుంటానని సిద్కియాతో బలవంతంగా నెబుకద్నెజరు ప్రమాణం చేయించాడు. నెబుకద్నెజరుకు విశ్వాసంగా వుంటానని సిద్కియా దేవుని మీద ప్రమాణం చేశాడు. కాని సిద్కియా తన జీవన విధానం మార్చుకొని, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా మాటవిని, ఆయనకు విధేయుడైయుండటానికి నిరాకరించి మొండి వైఖరి దాల్చాడు. 14యాజకుల నాయకులు, యూదా ప్రజల నాయకులంతా కూడా మరీ ఎక్కువ పాపం చేసి, యెహోవాకు విశ్వాస ఘాతకులయ్యారు. వారు అన్యదేశీయుల చెడు మార్గాన్నే అనుసరించారు. ఆ నాయకులంతా యెహోవా ఆలయాన్ని అపవిత్రపర్చి పాడుచేశారు. యెరూషలేములో ఆలయాన్ని యెహోవా పవిత్రపర్చాడు. 15తమ పూర్వీకుల దేవుడగు యెహోవా తన ప్రజలను హెచ్చిరించటానికి అనేక పర్యాయములు ప్రవక్తలను పంపినాడు. తన ప్రజలపట్ల, తన ఆలయంపట్ల సానుభూతిగలవాడుగుటచే యెహోవా అలా చేస్తూ వచ్చాడు. యెహోవా తన ప్రజలనుగాని, తన ఆలయాన్నిగాని నాశనం చేయదల్చలేదు. 16కాని దేవుని యొక్క ప్రజలే దేవుడు పంపిన ప్రవక్తలను ఎగతాళి చేశారు. వారు ప్రవక్తలు చెప్పేదానిని వినలేదు. వారు దేవుని వర్తమానములను అసహ్యించుకున్నారు. ఆఖరికి దేవుడు తన కోపాన్ని ఎంత మాత్రమూ ఆపుకోలేకపోయాడు. దేవుడు తన ప్రజలపట్ల కోపపడ్డాడు. ఆ కోపాన్ని ఆపగల శక్తి ఎవరికీ లేదు. 17అందువల్ల యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు వారి మీదికి బబులోను రాజును రప్పించాడు.#36:17 బబులోను … రప్పించాడు క్రీ. పూ. 586 సంవత్సరం చివరిగా బబులోను రాజు యెరూషలేమును నాశన మొనర్చిన సంవత్సరం. బబులోను రాజు యువకులను ఆలయంలో వుండగానే చంపివేశాడు. అతడు యూదా, యెరూషలేము ప్రజలమీద ఏమాత్రం కనికరం చూపలేదు. బబులోను రాజు యువకులను, వృద్ధులను కూడ చంపివేశాడు. అతడు పురుషులను, స్త్రీలను చంపాడు. రోగులను, ఆరోగ్యవంతులను కూడ చంపివేశాడు. యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు నెబుకద్నెజరుకు అనుమతి ఇచ్చినాడు. 18ఆలయంలోని వస్తువులన్నిటినీ నెబుకద్నెజరు బబులోనుకు పట్టుకుపోయాడు. ఆలయంలోను, రాజువద్ద, రాజు యొక్క అధికారులవద్దగల విలువైన వస్తువులన్నిటినీ అతడు పట్టుకుపోయాడు. 19నెబుకద్నెజరు, అతని సైన్యం ఆలయాన్ని తగులబెట్టారు. వారు యెరూషలేము గోడను పడగొట్టి రాజుకు, రాజాధికారులకు చెందిన ఇండ్లన్నీ తగులబెట్టారు. ప్రతి విలువైన వస్తువును వారు తీసికొనటం గాని, లేక నాశనం చేయటంగాని చేశారు. 20చనిపోగా మిగిలిన ప్రజలను నెబుకద్నెజరు బబులోనుకు తీసుకొని వెళ్లి బానిసలుగా పనిచేయించాడు. పర్షియా రాజ్యం (పారసీకము) బబులోను రాజ్యాన్ని ఓడించేవరకు ఆ ప్రజలు బబులోనులో బానిసలుగా వుండి పోయారు. 21ప్రవక్తయగు యిర్మీయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చెప్పిన విషయాలన్నీ ఆ విధంగా సంభవించాయి. యిర్మీయా ద్వారా యెహోవా యిలా చెప్పినాడు: “ఈ ప్రదేశం డెబ్బది యేండ్లపాటు బంజరు#36:21 బంజరు చూడండి యిర్మీ. 25:11; 29:10. భూమిగా మారిపోతుంది. ప్రజలు సబ్బాతు దినాలను#36:21 దినాలను ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి ఏడవ సంవత్సరం భూమిని సాగు చేయకూడదు, చూడండి లేవీ. 25:1-7. పాటించని కారణాన, దానికి పరిహారంగా ఇది జరుగుతుంది.”
22పర్షియా (పారసీక) రాజు కోరెషు (సైరస్) పాలన మొదటి సంవత్సరంలో#36:22 సంవత్సరంలో క్రీ. పూ. 539 వ సంవత్సరం. ఈ విధంగా జరిగింది. ప్రవక్తయగు యిర్మీయా ద్వారా యెహోవా ప్రకటించిన విషయాలు ఆయన నిజంగా జరిగేలా చేసినాడు. యెహోవా సైరస్ (కోరెషు) హృదయాన్ని స్పందింపజేసి, అతనిచే ఒక ఆజ్ఞ వ్రాయించి దూతల ద్వారా తన రాజ్యమంతా ప్రకటింపజేసినాడు:
23పర్షియా రాజైన కోరెషు తెలియజేయున దేమనగా:
ఆకాశమందు ప్రభువైన యెహోవా నన్ను ఈ భూమండలానికంతకు రాజుగా చేసినాడు. యెరూషలేములో ఆయనకొక ఆలయం కట్టించే బాధ్యత నాకు అప్పజెప్పినాడు. దేవుని ప్రజలైన మీరంతా ఇప్పుడు యెరూషలేము వెళ్లటానికి స్వేచ్ఛ కలిగియున్నారు. మీ దేవుడైన యెహోవా మీకు తోడై వుండుగాక.
Currently Selected:
2 దినవృత్తాంతములు 36: TERV
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International