YouVersion Logo
Search Icon

1 సమూయేలు 10

10
సమూయేలు సౌలును అభిషేకించుట
1సమూయేలు ఒక పాత్రలో ప్రత్యేక నూనె తీసుకుని సౌలు తలమీద పోసాడు. సమూయేలు సౌలును ముద్దు పెట్టుకొని, “యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నిన్ను నాయకునిగా ఉండేందుకు అభిషేకించాడు. నీవు దేవుని ప్రజలకు ఆధిపత్యం వహించాలి. చుట్టూరా వున్న శత్రువుల బారినుండి వారిని నీవు కాపాడతావు. యెహోవా తన ప్రజల మీద పాలకునిగా ఉండేందుకు నిన్ను అభిషేకించాడు. ఇది సత్యమని ఋజువు చేసే గుర్తు ఇది. 2ఈ రోజు నీవు నా వద్దనుండి వెళ్లగానే బెన్యామీను సరిహద్దుల్లో సెల్సహు వద్దనున్న రాహేలు సమాధి దగ్గర నీవు ఇద్దరు వ్యక్తులను కలుస్తావు. ‘నీవు వెదకబోయిన గాడిదలు దొరుకుతాయి. నీ తండ్రి గాడిదలను గూర్చి చింత పడటం మానేసాడు. ఇప్పుడు ఆయన నీ విషయంలో చింతిస్తున్నాడు. నా కుమారుని సంగతి నేనేమి చేయాలి? అని ఆయన అంటున్నాడు’” అని ఆ ఇద్దరు మనుష్యులు నీతో అంటారు.
3“ఆ తరువాత తాబోరు వద్ద సింధూర మహా వృక్షంవరకూ నీవు ఆగకుండా ప్రయాణం చేస్తావు. అక్కడ మళ్లీ ముగ్గురు మనుష్యులు నిన్ను కలుస్తారు. వారు బేతేలు పట్టణంలో దేవుని ఆరాధించటానికి వెళుతూఉంటారు. వారిలో ఒకడు మూడు మేక పిల్లలను మోసుకొని వస్తాడు. రెండవ వానివద్ద మూడు రొట్టెలు ఉంటాయి. మూడవ వానివద్ద ఒక తిత్తినిండా ద్రాక్షారసం ఉంటుంది. 4ఆ ముగ్గురు వ్యక్తులూ నిన్ను పలకరించి రెండు రొట్టెలు నీకు ఇస్తారు. ఆ రెండిటినీ వారినుండి నీవు తీసుకుంటావు. 5తరువాత నీవు ఫిలిష్తీయుల కోటవున్న గిబియ-ఎలోహిముకు#10:5 గిబియ-ఎలోహిము దేవుని కొండ. వెళతావు. నీవు ఆ పట్టణం దరిచేరగానే ఒక ప్రవక్తల గుంపు బయటకు రావటం నీవు చూస్తావు. వీరు ఆరాధనా స్థలంనుండి వస్తూ ఉంటారు. వీణలు, తంబూరా, వేణువు, తంతి వాయిద్యాలను ముందు వాయిస్తూ దేవుని గూర్చిన విషయాలు చెబుతూ వస్తారు. 6యెహోవా ఆత్మ నీ మీదకు బలంగా వస్తుంది. నీలో గొప్ప పరివర్తనవస్తుంది. ఆ ప్రవక్తలతో పాటు నీవు కూడా దేవుని విషయాలు చెబుతావు. 7ఈ సూచనలన్నీ ఋజువయ్యాక, నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చును. దేవుడు నీకు తోడై ఉంటాడు.
8“నాకంటె ముందుగా నీవు గిల్గాలుకు వెళ్లు. నేను తరువాత వచ్చి నిన్ను కలుస్తాను. అప్పుడు నేను దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తాను. కానీ, నీవు ఏడు రోజులు ఆగవలసి వుంటుంది. అప్పుడు నిన్ను కలిసి నీవు ఏమి చేయాలో చెబుతాను” అన్నాడు.
సౌలు ప్రవక్తలా మాట్లాడుట
9సమూయేలును వదిలి సౌలు వెళ్లిపోవటానికి మరలగానే దేవుడు సౌలుకు హృదయ పరివర్తన కలుగచేసాడు. అతనికి చెప్పబడిన గుర్తులన్నీ ఆ రోజు నిజమయ్యాయి. 10సౌలు, అతని సేవకుడు గిబియ-ఎలోహిముకు చేరగానే సౌలు కొంతమంది ప్రవక్తలను కలిసాడు. దేవుని ఆత్మ సౌలు మీదికి అతి శక్తివంతంగా దిగాడు. మిగిలిన ప్రవక్తలతో కలసి సౌలుకూడ దేవుని విషయాలు చెప్పసాగాడు. 11ఇదివరకు సౌలును ఎరిగిన ప్రజలు అతడు ఇతర ప్రవక్తలతో కలసి ప్రవక్తలా మాట్లాడటం చూసారు. వారంతా “కీషు కొడుకు సౌలుకు ఏమయ్యిందో ఏమో! సౌలుకూడా ప్రవక్తలలో ఒకడయ్యాడా?” అంటూ ఆశ్చర్యపోయారు.
12గిబియ-ఎలోహిములో నివసిస్తున్న ఒకడు, “అవును, అతడు వారి నాయకుడిలా#10:12 అవును … నాయకుడిలా అక్షరాలా “వారి తండ్రి ఎవరు” అని. ప్రవక్తల నాయకుడు సాధారణంగా వారి తండ్రి అని పిలువబడేవాడు. కనబడుతున్నాడు” అన్నాడు. అందుకే, “సౌలుకూడా ప్రవక్తల్లో ఒకడా?” అనే నానుడి ప్రసిద్ధికెక్కింది.
సౌలు ఇల్లు చేరుట
13దేవుని విషయాలు ప్రవచించటం అయిన తర్వాత సౌలు తన ఇంటివద్ద ఉన్న ఆరాధనా స్థలం దగ్గరకు వచ్చాడు.
14సౌలు తన సేవకుని కలిసి ఇంటికి వెళ్లగానే అతని పినతండ్రి, “ఎక్కడికి పోయారు” అని వారిని అడిగాడు.
“గాడిదలను వెదకటానికి వెళ్లాము. అవి దొరకక పోయేసరికి సమూయేలును చూడటానికి వెళ్లాము.” అని సౌలు చెప్పాడు.
15“సమూయేలు నీకు ఏమి చెప్పాడో దయచేసి నాకు చెప్పు” అన్నాడు సౌలు పినతండ్రి.
16“గాడిదలు దొరికినట్లు వెల్లడి చేశాడని సౌలు అన్నాడు.” అంతేగాని రాజ్యాన్ని గురించి సమూయేలు చెప్పినదేదీ సౌలు తన పినతండ్రికి చెప్పలేదు.
సౌలును రాజుగా సమూయేలు ప్రకటించుట
17మిస్పావద్ద యెహోవాను కలుసుకొనేందుకు ఇశ్రాయేలీయులంతా సమావేశం కావాలని సమూయేలు పిలుపునిచ్చాడు. 18సమూయేలు ఇలా అన్నాడు: “నేను ఇశ్రాయేలును ఈజిప్టునుంచి బయటకు తీసుకుని వచ్చాను. ‘నేను మిమ్మల్ని ఈజిప్టు బంధంనుండి విడుదల చేశాను. మిమ్మల్ని బాధించటానికి ప్రయత్నించిన ఇతర రాజ్యాలనుండి కూడా మిమ్మల్ని రక్షించాను.’ అని ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు చెప్పాడు: 19మళ్లీ ఇశ్రాయేలీయులతో సమూయేలు ఇలా అన్నాడు: ‘మీ అందరి కష్టనష్టాల నుండి మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతూ వస్తూనే వున్నాడు. కానీ నేడు మీరు మీ దేవుని తిరస్కరించారు. మిమ్మల్ని పాలించటానికి మీకో రాజు కావాలని అడుగుతున్నారు.’ సరే. రండి! మీమీ వంశాల వారీగా, కుటుంబాల వారీగా దేవుని ముందర నిలబడండి.”
20ఇశ్రాయేలు వంశాల వారినందరినీ సమూయేలు ఒక చోట చేర్చాడు. వారిలో బెన్యామీను వంశం ఎన్నుకోబడింది. 21బెన్యామీను వంశంలో వున్న కుటుంబాల వారందరినీ గుంపు గుంపుగా వరుసగా నడిపించాడు. వాటిలో మథ్రీ కుటుంబం ఎన్నుకోబడింది. మరల మథ్రీ కుటుంబంలోని వారందరినీ వరుసుగా నడిపించాడు. వారిలో కీషు కుమారుడు సౌలు ఎంపిక చేయబడ్డాడు.
సౌలును చూడాలని వచ్చిన ప్రజలు అతనికోసం వెదకగా అతడు కనిపించలేదు. 22“ఆ మనిషి ఇక్కడ ఉన్నాడా?” అని ప్రజలు అడిగారు.
“సౌలు సామానుల వెనుక దాగి ఉన్నాడని” యెహోవా చెప్పాడు.
23జనం పరుగెత్తుకుంటూ పోయి సామాన్ల వెనుక దాగుకొని ఉన్న సౌలును తీసుకుని వచ్చారు. సౌలు వారందరిలో నిలబడి ఉన్నపుడు అతను అందరికంటె ఎత్తుగా, ఆజానుబాహుడుగా కనబడ్డాడు.
24“ఇదిగో చూడండి, యెహోవా ఎంపిక చేసిన మనిషి, ప్రజలలో సౌలువంటివాడు ఒక్కడూ లేడు.” అని సమూయేలు ప్రజలందరితో అన్నాడు.
అప్పుడు ప్రజలు, “రాజు దీర్ఘకాలం జీవించునుగాక!” అని అరిచారు.
25నూతన రాజ్యంలో నిబంధనావళిని సమూయేలు ప్రజలకు వివరించాడు. రాజ్యపరిపాలన నియమాలను, నిబంధనలను ఒక పుస్తకంలో వ్రాసి సమూయేలు యెహోవా ముందర ఉంచాడు. అలా చేసి సమూయేలు ప్రజలను తమ తమ ఇండ్లకు వెళ్లమన్నాడు.
26సౌలు గిబియాలో వున్న తన ఇంటికి వెళ్లిపోయాడు. దేవుడు అక్కడ వున్న ధైర్యవంతుల హృదయాలను ప్రేరేపించాడు. ఈ ధీరులంతా సౌలు వెంట వెళ్లారు. 27కాని పనికిమాలినవారు కొందరు “ఈ వ్యక్తి మనలను ఎలా రక్షించగలడు” అని అంటూ సౌలును చులకనగా చేసి, అతనికి కానుకలను పట్టుకు వెళ్లటానికి నిరాకరించారు. సౌలు ఏమీ పలకలేదు.
అమ్మోనీయుల రాజు నాహాషు
అమ్మోనీయుల రాజైన నాహాషు గాదీయులను, రూబేనీయులను క్రూరంగా బాధిస్తూండేవాడు. వారిలో ప్రతి ఒక్కడి కుడి కంటినీ రాజు తీసివేస్తూండేవాడు. వారిని ఎవరైనా రక్షించటం కూడా అతడు సహించలేదు. అమ్మోనీయుల రాజైన నాహాషు యొర్దాను నదికి కుడి వైపున ఉన్న ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరి కుడి కన్నూ తోడివేసాడు. కాని ఏడువేలమంది అమ్మోనీయుల నుండి పారిపోయి యాబేష్గిలాదుకు చేరారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in