YouVersion Logo
Search Icon

మార్కు 3

3
చెయ్యి చచ్చుబడిన వాణ్ణి బాగు చెయ్యడం
మత్తయి 12:10-14; లూకా 6:6, 17-19
1యేసు మరోసారి సమాజమందిరంలో ప్రవేశించాడు. అక్కడ చెయ్యి చచ్చుబడిపోయిన వాడొకడు ఉన్నాడు. 2అక్కడివారు ఆయన మీద నేరం మోపే ఉద్దేశంతో, యేసు విశ్రాంతి దినాన ఆ మనిషిని బాగుచేస్తాడేమో అని జాగ్రత్తగా గమనిస్తున్నారు. 3యేసు ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, “ఇటు వచ్చి అందరి ముందూ నిలబడు” అన్నాడు. 4అప్పుడు ఆయన వారితో, “విశ్రాంతి దినాన మేలు చేయడం ధర్మమా? కీడు చేయడమా? ప్రాణాన్ని రక్షించడం ధర్మమా? చంపడమా?” అని అన్నాడు. అందుకు వారు ఏ జవాబూ చెప్పలేదు.
5వారి కఠిన హృదయాలను బట్టి ఆయన నొచ్చుకుని, కోపంతో రగిలిపోతూ అందరి వైపూ చూశాడు. ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, “నీ చెయ్యి చాపు” అనగానే వాడు చెయ్యి చాపాడు. వెంటనే అతని చెయ్యి పూర్తిగా బాగైపోయింది. 6అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్ళి, హేరోదు రాజు మనుషులతో కలిసి యేసుని చంపడానికి కుట్ర పన్నారు.
చాలా మందికి స్వస్థత
మత్తయి 12:15-16; లూకా 6:17-19
7యేసు తన శిష్యులతో కలసి గలిలయ సరస్సు వెంబడి వెళ్తూ ఉన్నాడు. గలిలయ, యూదయ ప్రాంతం నుండి వచ్చిన చాలామంది ప్రజలు ఆయన వెంట వెళ్ళారు. 8యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ, యెరూషలేము, ఇదూమియ ప్రాంతాలనుండీ, యొర్దాను నది అవతలి నుండీ తూరు, సీదోను ప్రాంతాలనుండీ ఆయన దగ్గరికి వచ్చారు. 9ప్రజలు ఎక్కువమంది ఉన్న కారణంగా వారు తన మీద పడకుండా ఉండాలని తన కోసం ఒక పడవ సిద్ధం చేయమని ఆయన తన శిష్యులతో చెప్పాడు.
10ఆయన చాలామందిని బాగు చేశాడు. అందువల్ల రోగులందరూ ఆయనను తాకాలని ఆయన దగ్గరికి తోసుకొస్తున్నారు. 11దయ్యాలు పట్టినవారు ఆయనను చూడగానే, ఆయన ఎదుట నేలపై పడిపోయి, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేశారు. 12యేసు, తానెవరో తెలపవద్దని దయ్యాలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు.
పన్నెండు మంది ఎంపిక
మత్తయి 10:1-4; లూకా 6:12-16
13తరువాత యేసు కొండ ఎక్కి వెళ్ళి తనను ఎవరు అనుసరించాలని ఆయన కోరుకున్నాడో వారిని పిలిచాడు. వారు ఆయన దగ్గరికి వచ్చారు. 14తనతో ఉండడానికీ, సువార్త ప్రకటనకు పంపడానికీ ఆయన పన్నెండు మందిని నియమించాడు. వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు. 15రోగాలను బాగుచేయడానికీ, దయ్యాలను వెళ్ళగొట్టడానికీ వారికి అధికారం ఇచ్చాడు. 16వారి పేర్లు, సీమోను (ఇతనికి ఆయన పేతురు అనే పేరు పెట్టాడు), 17జెబెదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను (వీరికి ఆయన ‘బోయనేర్గెసు’ అనే పేరు పెట్టాడు, ఆ మాటకి ‘ఉరిమేవారు’ అని అర్థం), 18అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, 19యేసును పట్టి ఇచ్చిన ఇస్కరియోతు యూదా.
20తరువాత యేసు, ఆయన శిష్యులు ఒక ఇంటికి వెళ్ళారు. మళ్ళీ అక్కడ చాలా మంది ప్రజలు గుమికూడారు. కాబట్టి వారికి భోజనం చేయడానికి కూడా వీలు లేకపోయింది. 21ఇది తెలిసిన యేసు కుటుంబీకులు ఆయనను పట్టుకుని ఇంటికి తీసుకు వెళ్ళడానికి వచ్చారు. ఎందుకంటే కొందరు “ఈయనకు మతి స్థిమితం లేదు” అన్నారు.
క్షమార్హం కాని పాపం
మత్తయి 12:24-29; లూకా 11:14-20
22యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర పండితులు, “బయల్జెబూలు ఇతణ్ణి ఆవహించాడు. ఆ దయ్యాల అధిపతి సహాయంతోనే దయ్యాలను పారదోలుతున్నాడు” అన్నారు.
23యేసు వారిని తన దగ్గరికి పిలిచి, ఉదాహరణల రూపంలో ఇలా అన్నాడు, “సైతాను సైతానును ఎలా వెళ్ళగొడతాడు? 24చీలికలు వచ్చిన రాజ్యం నిలబడదు. 25చీలికలు వచ్చిన కుటుంబం నిలబడదు. 26అలాగే సైతాను తనకు తానే విరోధంగా ఉంటే వాని అధికారం అంతమౌతుంది గదా. 27నిజానికి ఒక బలవంతుడి ఇంట్లో దొంగతనం చేయాలంటే మొదట అతణ్ణి కట్టివేయాల్సిందే.
28 నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మనుషులు చేసిన అన్ని పాపాలను, వారు పలికే దైవ దూషణలను దేవుడు క్షమిస్తాడు. 29కాని పరిశుద్ధాత్మను దూషించినవాణ్ణి దేవుడు ఎన్నడూ క్షమించడు. అలా చేసేవాడు శాశ్వత పాపం చేసిన దోషంలో ఉంటాడు.” 30‘ఆయనకు దయ్యం పట్టింది’ అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు.
కొత్త సంబంధాలు
మత్తయి 12:46-50; లూకా 8:19-21
31అప్పుడు యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చి, బయట నిలబడి యేసు కోసం కబురు చేశారు. యేసు చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు. 32వారు ఆయనతో, “నీ తల్లి, సోదరులు బయట నీ కోసం చూస్తున్నారు” అన్నారు. 33ఆయన వారితో, “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అన్నాడు. 34తన చుట్టూ కూర్చున్న వారిని చూస్తూ, “ఇదిగో నా తల్లి, నా సోదరులు. 35ఎందుకంటే, దేవుని ఇష్టప్రకారం నడచుకునే వారే నా సోదరులు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లి” అని అన్నాడు.

Currently Selected:

మార్కు 3: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in