YouVersion Logo
Search Icon

మార్కు 4

4
విత్తనాలు చల్లేవాడి ఉపమానం
మత్తయి 13:1-23; లూకా 8:4-15
1మరొకసారి ఆయన సముద్రం ఒడ్డున ఉపదేశించడం ప్రారంభించాడు. ఆయన చుట్టూ చాలా మంది ప్రజలు ఉండడం వల్ల, ఆయన ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు.
2ఆయన ఉదాహరణల సహాయంతో అనేక విషయాలు వారికి బోధించాడు. ఆయన వారితో ఇలా అన్నాడు. 3“వినండి! ఒక రైతు విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు. 4విత్తనాలు చల్లుతూ ఉండగా, కొన్ని దారి పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినేశాయి.
5 మరికొన్ని విత్తనాలు, మట్టి ఎక్కువగా లేని రాతినేల మీద పడ్డాయి. అవి త్వరగానే మొలకెత్తాయి. 6కాని వాటి వేర్లు లోతుగా లేనందువల్ల సూర్యుడు రాగానే అవి ఆ వేడికి మాడిపోయాయి.
7 ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. ఆ ముళ్ళ తుప్పలు పెరిగి మొక్కలను అణచి వేయడం వల్ల అవి పంటకు రాలేదు.
8 మిగిలిన విత్తనాలు మంచి సారవంతమైన నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, పెరిగి ముప్ఫై రెట్లు, అరవై రెట్లు, వంద రెట్లు పండి కోతకు వచ్చాయి.” 9యేసు ఇలా చెప్పి, “వినడానికి చెవులు ఉన్నవాడు వినుగాక” అన్నాడు.
10తరువాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులు, ఆయన సన్నిహితులు కొందరు ఆ ఉదాహరణల గురించి ఆయనను అడిగారు. 11ఆయన వారితో, “దేవుని రాజ్యం గురించిన రహస్య సత్యం మీకు చెప్పాను. కాని బయటి వారికి ప్రతి విషయమూ ఉపమానాల రూపంలోనే లభిస్తుంది. 12ఎందుకంటే,
వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి.
వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి.
లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో.”
ఉపమానం వివరణ
మత్తయి 13:18-23; లూకా 8:11-15
13ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా? అయితే మిగతా ఉపమానాలు ఎలా అర్థం చేసుకుంటారు? 14విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు. 15దారి పక్కన ఉన్నవారెవరంటే, వాక్కు వారిలో పడింది గాని, వారు విన్న వెంటనే సైతాను వచ్చి వారిలో పడిన వాక్కును తీసివేస్తాడు.
16 అలాగే కొంతమంది రాతినేల లాంటి వారు. వీళ్ళు వాక్కును విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు. 17కానీ వారిలో వాక్కు లోతుగా వేరు పారని కారణంగా కష్టం, హింస కలిగితే దాన్ని వదిలివేస్తారు. 18కొంతమంది ముళ్ళతుప్పలు మొలిచే నేల లాంటి వారు. దేవుని వాక్కు వింటారు. 19కాని, జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు ఆ వాక్కును అణచివేసి ఫలించకుండా చేస్తాయి.
20 మరి కొందరు సారవంతమైన నేలలాంటి వారు, వీళ్ళు దేవుని వాక్కు విని, అంగీకరించి కొందరు ముప్ఫై రెట్లు, కొందరు అరవై రెట్లు, కొందరు వంద రెట్లు ఫలిస్తారు.”
దీపం ఉపమానం
మత్తయి 5:15-16; లూకా 8:16; 11:33
21ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, “దీపాన్ని తెచ్చి బోర్లించిన పాత్ర కింద, లేక మంచం కింద ఉంచుతారా? దాన్ని దీపస్తంభం మీద ఉంచుతాం గదా! 22దాచి ఉంచినవన్నీ బహిర్గతమౌతాయి. అన్ని రహస్యాలూ బయట పడిపోతాయి. 23వినడానికి చెవులు గలవాడు వినుగాక.”
24యేసు వారితో ఇంకా ఇలా అన్నాడు, “నేను మీతో చెప్పేది జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ కొలతలో కొలిచి ఇస్తారో అదే కొలతలో ఇంకా ఎక్కువగా కొలిచి దేవుడు మీకిస్తాడు. 25కలిగిన వారికి దేవుడు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వారి దగ్గర నుండి ఉన్నది కూడా తీసివేస్తాడు.”
లోలోపలి ఎదుగుదల
26ఆయన మళ్ళీ ఇలా అన్నాడు, “దేవుని రాజ్యం ఒక మనిషి భూమి మీద విత్తనాలు చల్లినట్టు ఉంటుంది. 27ఆ వ్యక్తి నిద్ర పోతున్నా మెలకువగా ఉన్నా రాత్రి, పగలు అతనికి తెలియకుండానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతూనే ఉంటాయి. 28ఎందుకంటే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొలక, ఆ తరువాత కంకి, ఆ కంకి నిండా గింజలు పుడతాయి. 29పంట పండినప్పుడు అతడు కోతకాలం వచ్చిందని వెంటనే కొడవలితో కోస్తాడు.”
ఆవగింజ ఉపమానం
మత్తయి 13:31, 32; లూకా 13:18-19
30ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు. “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? ఏ ఉపమానం ఉపయోగించి దాన్ని వర్ణించగలం? 31అది ఆవగింజ లాంటిది. మనం భూమి మీద నాటే విత్తనాలన్నిటిలోకీ అది చిన్నది. 32కాని దాన్ని నాటిన తరువాత తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఎదుగుతాయి. పక్షులు దాని నీడలో గూడు కట్టుకుంటాయి.”
33యేసు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉపయోగించి, వారు అర్థం చేసుకోగలిగిన కొద్దీ వారికి ఉపదేశించాడు. 34ఉపమానం లేకుండా వారికి ఏ ఉపదేశమూ చేయలేదు. తరువాత ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వారికి అన్నీ వివరించి చెప్పాడు.
35ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు. 36శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మరి కొన్ని పడవలు కూడా వారివెంట వచ్చాయి. 37అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి. 38పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు. 39ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది.
40అప్పుడాయన శిష్యులతో, “మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా?” అని అన్నాడు. 41వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!” అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు.

Currently Selected:

మార్కు 4: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in