YouVersion Logo
Search Icon

పరమగీతము 4

4
1నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి
నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి
నీ తలవెండ్రుకలు
గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి.
2నీ పలువరుస కత్తెరవేయబడినవియు
కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై
జోడుజోడు పిల్లలుకలిగి ఒకదానినైన పోగొట్టుకొనక
సుఖముగానున్న గొఱ్ఱెల కదుపులను పోలియున్నది.
3నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి.
నీ నోరు సుందరము
నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము
వలె నగపడుచున్నవి.
4జయసూచకముల నుంచుటకై
దావీదు కట్టించిన గోపురముతోను
వేయి డాలులును, శూరుల కవచములన్నియును
వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధర సమానము.
5నీ యిరు కుచములు ఒక జింకపిల్లలయి తామరలో
మేయు కవలను పోలియున్నవి.
6ఎండ చల్లారి నీడలు జరిగిపోవువరకు
గోపరస పర్వతములకు
సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును.
7నా ప్రియురాలా, నీవు అధికసుందరివి
నీయందు కళంకమేమియు లేదు.
8ప్రాణేశ్వరీ, లెబానోను విడిచి నాతోకూడ రమ్ము
లెబానోను విడిచి నాతోకూడ రమ్ము
అమానపర్వతపు శిఖరమునుండి
శెనీరు హెర్మోనుల శిఖరమునుండి
సింహ వ్యాఘ్రములుండు గుహలుగల కొండలపైనుండి
నీవు క్రిందికి చూచెదవు.
9నా సహోదరీ, ప్రాణేశ్వరీ,
నీవు నా హృదయమును వశపరచుకొంటివి
ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి.
నీ హారములలో ఒకదానిచేత నన్ను వశపరచుకొంటివి.
10సహోదరీ, ప్రాణేశ్వరీ,
నీ ప్రేమ ఎంత మధురము!
ద్రాక్షారసముకన్న నీ ప్రేమ ఎంత సంతోషకరము
నీవు పూసికొను పరిమళ తైలముల వాసన
సకల గంధవర్గములకన్న సంతోషకరము.
11ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకుచున్న
ట్టున్నవి
నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు
నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె
నున్నది.
12నా సహోదరి నా ప్రాణేశ్వరి
మూయబడిన ఉద్యానము
మూతవేయబడిన జలకూపము.
13నీ చిగురులు దాడిమవనము
వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు కర్పూరవృక్షములు
జటామాంసి వృక్షములు
14జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు
లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు
గోపరసమును అగరు వృక్షములు
నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు.
15నా సహోదరీ, నా ప్రాణేశ్వరీ,
నీవు ఉద్యానజలాశయము
ప్రవాహజలకూపము
లెబానోను పర్వతప్రవాహము.
16ఉత్తరవాయువూ, ఏతెంచుము
దక్షిణవాయువూ, వేంచేయుము
నా ఉద్యానవనముమీద విసరుడి
దాని పరిమళములు వ్యాపింపజేయుడి
నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును
గాక
తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy