YouVersion Logo
Search Icon

కీర్తనలు 94

94
1యెహోవా, ప్రతికారముచేయు దేవా,
ప్రతికారముచేయు దేవా, ప్రకాశింపుము
2భూలోక న్యాయాధిపతీ లెమ్ము
గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము
3యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు?
భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు?
4వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు
దోషము చేయువారందరు బింకములాడుచున్నారు.
5–యెహోవా చూచుటలేదు
యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని
6యెహోవా, వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు
నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు
7విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు
తండ్రిలేనివారిని హతముచేయుచున్నారు.
8జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి
బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు?
9చెవులను కలుగచేసినవాడు వినకుండునా?
కంటిని నిర్మించినవాడు కానకుండునా?
10అన్యజనులను శిక్షించువాడు
మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా?
11నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి
యున్నది.
12యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును
బట్టి నీవు బోధించువాడు ధన్యుడు.
13భక్తిహీనులకు గుంట త్రవ్వబడువరకు
నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది
కలుగజేయుదువు.
14యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు
తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు.
15నీతిని స్థాపించుటకై న్యాయపుతీర్పు జరుగును
యథార్థహృదయులందరు దాని ననుసరించెదరు.
16దుష్టులమీదికి నా పక్షమున ఎవడు లేచును?
దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున
ఎవడు నిలుచును?
17యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల
నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి
యుండును.
18–నాకాలు జారెనని నేననుకొనగా
యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.
19నా అంతరంగమందు విచారములు హెచ్చగా
నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ
జేయుచున్నది.
20కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు
పొందుకలుగునా?
21దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారిమీద
పడుదురు
దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు.
22యెహోవా నాకు ఎత్తయిన కోట
నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము.
23ఆయన వారిదోషము వారిమీదికి రప్పించునువారి చెడుతనమునుబట్టి వారిని సంహరించును.
మన దేవుడైన యెహోవావారిని సంహరించును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for కీర్తనలు 94