YouVersion Logo
Search Icon

కీర్తనలు 24

24
దావీదు కీర్తన.
1భూమియు దాని సంపూర్ణతయు
లోకమును దాని నివాసులును యెహోవావే.
2ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను
ప్రవాహజలములమీద దాని స్థిరపరచెను.
3యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు?
ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?
4వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు
కపటముగా ప్రమాణము చేయకయు
నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి
యుండువాడే.
5వాడు యెహోవావలన ఆశీర్వాదము నొందును
తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును.
6ఆయన నాశ్రయించువారు
యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. (సెలా.)
7గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి
మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన
తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి.
8మహిమగల యీ రాజు ఎవడు?
బలశౌర్యములుగల యెహోవా
యుద్ధశూరుడైన యెహోవా.
9గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి,
పురాతనమైన తలుపులారా,
మహిమగల రాజు ప్రవేశించునట్లు
మిమ్మును లేవనెత్తికొనుడి.
10మహిమగల యీ రాజు ఎవడు?
సైన్యములకధిపతియగు యెహోవాయే.
ఆయనే యీ మహిమగల రాజు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 24