కీర్తనలు 119:105-176
కీర్తనలు 119:105-176 TELUBSI
నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర వేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక రించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడెము నీవే నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్‌క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి తొలగుడి. నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక. నాకు రక్షణకలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను. నీ కట్టడలను మీరిన వారినందరిని నీవు నిరాకరించు దువువారి కపటాలోచన మోసమే. భూమిమీదనున్న భక్తిహీనులనందరిని నీవు మష్టువలె లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమైయున్నవి నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను. నేను నీతిన్యాయముల ననుసరించుచున్నాను. నన్ను బాధించువారివశమున నన్ను విడిచిపెట్టకుము. మేలుకొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురు గాక. నీ రక్షణకొరకు నీతిగల నీ మాటకొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృపచొప్పున నీ సేవకునికి మేలుచేయుము నీ కట్టడలను నాకు బోధింపుము నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలుగజేయుము జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసియున్నారు యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞలయందైన యధిక వాంఛచేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగునట్లు నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము. నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుష్యుల బలాత్కారమునుండి నన్ను విమోచిం పుము. నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా, నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను నిరాకరింపబడినవాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పెట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొఱ్ఱ పెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనునట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్నురక్షింపుము. తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు కొందును. నీ కృపనుబట్టి నా మొఱ్ఱ ఆలకింపుము యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగా నున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము. నన్ను తరుమువారును నా విరోధులును అనేకులు అయినను నీ న్యాయశాసనములనుండి నేను తొలగక యున్నాను. ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్యభయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపుసొమ్ము సంపాదించినవానివలె నీవిచ్చిన మాటనుబట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయవిధులనుబట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదువారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు యెహోవా, నీ రక్షణకొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములనుబట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నియు నీయెదుట నున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా, నా మొఱ్ఱ నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాటచొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము నీవిచ్చిన మాటచొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యమునుగూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొనియున్నాను నీ చెయ్యి నాకు సహాయమగును గాక. యెహోవా, నీ రక్షణకొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రదికింపుము నేను నిన్ను స్తుతించెదను నీ న్యాయవిధులు నాకు సహాయములగును గాక తప్పిపోయిన గొఱ్ఱెవలె నేను త్రోవవిడిచితిరిగితిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను.