కీర్తనలు 119
119
ఆలెఫ్.
1యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి
నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు
2ఆయన శాసనములను గైకొనుచు
పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు.
3వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ
పాపమును చేయరు
4నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని
నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు.
5ఆహా నీ కట్టడలను గైకొనునట్లు
నా ప్రవర్తన స్థిరపడియుండిన నెంత మేలు.
6నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు
నాకు అవమానము కలుగనేరదు.
7నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు
యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
8నీ కట్టడలను నేను గైకొందును
నన్ను బొత్తిగా విడనాడకుము.
బేత్.
9యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్దిపరచు కొందురు?
నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట
చేతనే గదా?
10నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను
నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము.
11నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు
నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని
యున్నాను.
12యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు
నీ కట్టడలను నాకు బోధించుము.
13నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని
నా పెదవులతో వివరించుదును.
14సర్వసంపదలు దొరికినట్లు
నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు
చున్నాను.
15నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను
నీ త్రోవలను మన్నించెదను.
16నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను.
నీ వాక్యమును నేను మరువకయుందును.
గీమెల్.
17నీ సేవకుడనైన నేను బ్రదుకునట్లు నాయెడల నీ
దయారసము చూపుము
నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును.
18నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతు
లను చూచునట్లు నా కన్నులు తెరువుము.
19నేను భూమిమీద పరదేశినై యున్నాను
నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము.
20నీ న్యాయవిధులమీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది
దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది.
21గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు.
నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు.
22నేను నీ శాసనముల ననుసరించుచున్నాను.
నామీదికి రాకుండ నిందను తిరస్కారమును తొల
గింపుము.
23అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాట
లాడుకొందురు
నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును.
24నీ శాసనములు నాకు సంతోషకరములు
అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి.
దాలెత్.
25నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది
నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము.
26నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు
ఉత్తరమిచ్చితివి
నీ కట్టడలను నాకు బోధింపుము
27నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము.
నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను.
28వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను
నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము.
29కపటపు నడత నాకు దూరము చేయుము
నీ ఉపదేశమును నాకు దయచేయుము
30సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను
నీ న్యాయవిధులను నేను నాయెదుట పెట్టుకొని
యున్నాను
31యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని
యున్నాను
నన్ను సిగ్గుపడనియ్యకుము.
32నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు
నేను నీ ఆజ్ఞలమార్గమున పరుగెత్తెదను.
హే.
33యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు
నేర్పుము.
అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును.
34నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయ
చేయుము
అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకా
రము నడుచుకొందును.
35నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను
దానియందు నన్ను నడువజేయుము.
36లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృద
యము త్రిప్పుము.
37వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పివేయుము
నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికిం
పుము.
38నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును
పుట్టించుచున్నది
నీ సేవకునికి దాని స్థిరపరచుము.
39నీ న్యాయవిధులు ఉత్తమములు
నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును
కొట్టివేయుము.
40నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు
నీతినిబట్టి నన్ను బ్రదికింపుము.
వావ్.
41యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము
నీ మాటచొప్పున నీ రక్షణ రానిమ్ము.
42అప్పుడు నన్ను నిందించువారికి నేను ఉత్తరమీయ
గలను
ఏలయనగా నీమాట నమ్ముకొనియున్నాను.
43నా నోటనుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసి
వేయకుము
నీ న్యాయవిధులమీద నా ఆశ నిలిపియున్నాను.
44నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును
నేను నిత్యము దాని ననుసరించుదును
45నేను నీ ఉపదేశములను వెదకువాడను
నిర్బంధములేక నడుచుకొందును
46సిగ్గుపడక రాజులయెదుట
నీ శాసనములనుగూర్చి నేను మాటలాడెదను.
47నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను
అవి నాకు ప్రియములు.
48నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతు
లెత్తెదను
నీ కట్టడలను నేను ధ్యానించుదును.
జాయిన్.
49నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసికొనుము
దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు.
50నీ వాక్యము నన్ను బ్రదికించియున్నది
నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.
51గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి
అయినను నీ ధర్మశాస్త్రమునుండి నేను తొలగక
యున్నాను.
52యెహోవా, పూర్వకాలమునుండి యుండిన నీ న్యాయ
విధులను జ్ఞాపకము చేసికొని
నేను ఓదార్పు నొందితిని.
53నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా
నాకు అధిక రోషము పుట్టుచున్నది
54యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు
నీ కట్టడలు హేతువులాయెను.
55యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణచేయు
చున్నాను
నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచున్నాను
56నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను
ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది.
హేత్.
57యెహోవా, నీవే నా భాగము
నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను
నిశ్చయించుకొని యున్నాను.
58కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను
బతిమాలుకొనుచున్నాను
నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము.
59నా మార్గములు నేను పరిశీలనచేసికొంటిని
నీ శాసనములతట్టు మరలుకొంటిని.
60నీ ఆజ్ఞలను అనుసరించుటకు
నేను జాగుచేయక త్వరపడితిని.
61భక్తిహీనులపాశములు నన్ను చుట్టుకొని యున్నను
నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు
62న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుటకు
అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను.
63నీయందు భయభక్తులు గలవారందరికిని
నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను చెలి
కాడను.
64యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది
నీ కట్టడలను నాకు బోధింపుము.
తేత్.
65యెహోవా, నీ మాటచొప్పున
నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు.
66నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను
మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము.
67శ్రమకలుగకమునుపు నేను త్రోవ విడిచితిని
ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను
చున్నాను.
68నీవు దయాళుడవై మేలుచేయుచున్నావు
నీ కట్టడలను నాకు బోధింపుము.
69గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు
అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశ
ములను అనుసరింతును.
70వారి హృదయము క్రొవ్వువలె మందముగా ఉన్నది
నేను నీ ధర్మశాస్త్రమునుబట్టి ఆనందించుచున్నాను.
71నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు
శ్రమనొంది యుండుట నాకు మేలాయెను.
72వేలకొలది వెండి బంగారు నాణెములకంటె
నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు.
యోద్.
73నీచేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను
నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయ
చేయుము.
74నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నాను
నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతో
షింతురు
75యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు
విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును.
76నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున
నీ కృప నన్ను ఆదరించును గాక.
77నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము.
నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు
కలుగును గాక.
78నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను.
గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకువారు సిగ్గుపడుదురు గాక.
79నీయందు భయభక్తులుగలవారును
నీ శాసనములను తెలిసికొనువారును నా పక్షమున
నుందురు గాక.
80నేను సిగ్గుపడకుండునట్లు
నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును
గాక.
కఫ్.
81నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది.
నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను
82–నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని
నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి
83నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని
అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు.
84నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను?
నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట యెప్పుడు?
85నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు
నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి.
86నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి
పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు
నాకు సహాయముచేయుము.
87భూమిమీద నుండకుండ వారు నన్ను నాశనము
చేయుటకు కొంచెమే తప్పెను
అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను.
88నీవు నియమించిన శాసనమును నేను అనుసరించునట్లు
నీ కృపచేత నన్ను బ్రదికింపుము.
లామెద్.
89యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము
నిలకడగా నున్నది.
90నీ విశ్వాస్యత తరతరములుండును.
నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది
91సమస్తము నీకు సేవచేయుచున్నవి
కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి
92నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల
నా శ్రమయందు నేను నశించియుందును.
93నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి
నేనెన్నడును వాటిని మరువను.
94నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను
నేను నీవాడనే నన్ను రక్షించుము.
95నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు
పొంచియున్నారు
అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను.
96సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను
నీ ధర్మోపదేశము అపరిమితమైనది.
మేమ్.
97నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది
దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.
98నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి.
నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ
జేయుచున్నవి.
99నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను
కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము
కలదు.
100నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను
కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు.
101నేను నీ వాక్యము ననుసరించునట్లు
దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను
102నీవు నాకు బోధించితివి గనుక
నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను.
103నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు
అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.
104నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను
తప్పుమార్గములన్నియు నా కసహ్యములాయెను.
నూన్.
105నీ వాక్యము నా పాదములకు దీపమును
నా త్రోవకు వెలుగునై యున్నది.
106నీ న్యాయవిధులను నేననుసరించెదనని
నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర
వేర్చుదును.
107యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను
నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము.
108యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక
రించుము.
నీ న్యాయవిధులను నాకు బోధింపుము
109నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది.
అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను.
110నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి
అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుటలేదు.
111నీ శాసనములు నాకు హృదయానందకరములు
అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను.
112నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను
లోపరచుకొనియున్నాను
ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము.
సామెహ్.
113ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను
నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.
114నాకు మరుగుచోటు నా కేడెము నీవే
నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను.
115నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను
దుష్‌క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి
తొలగుడి.
116నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదుకొనుము
నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక.
117నాకు రక్షణకలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము
అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను.
118నీ కట్టడలను మీరిన వారినందరిని నీవు నిరాకరించు
దువువారి కపటాలోచన మోసమే.
119భూమిమీదనున్న భక్తిహీనులనందరిని నీవు మష్టువలె లయపరచుదువు
కావున నీ శాసనములు నాకు ఇష్టమైయున్నవి
120నీ భయమువలన నా శరీరము వణకుచున్నది
నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.
అయిన్.
121నేను నీతిన్యాయముల ననుసరించుచున్నాను.
నన్ను బాధించువారివశమున నన్ను విడిచిపెట్టకుము.
122మేలుకొరకు నీ సేవకునికి పూటపడుము
గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురు గాక.
123నీ రక్షణకొరకు నీతిగల నీ మాటకొరకు కనిపెట్టుచు
నా కన్నులు క్షీణించుచున్నవి.
124నీ కృపచొప్పున నీ సేవకునికి మేలుచేయుము
నీ కట్టడలను నాకు బోధింపుము
125నేను నీ సేవకుడను
నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలుగజేయుము
126జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసియున్నారు
యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము.
127బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు
ప్రియముగానున్నవి.
128నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని
మన్నించుచున్నాను
అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు.
పే.
129నీ శాసనములు ఆశ్చర్యములు
కావుననే నేను వాటిని గైకొనుచున్నాను.
130నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును
అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును
131నీ ఆజ్ఞలయందైన యధిక వాంఛచేత
నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను.
132నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగునట్లు
నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము.
133నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము
ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము.
134నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు
మనుష్యుల బలాత్కారమునుండి నన్ను విమోచిం
పుము.
135నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము
నీ కట్టడలను నాకు బోధింపుము.
136జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు
నా కన్నీరు ఏరులై పారుచున్నది.
సాదె.
137యెహోవా, నీవు నీతిమంతుడవు
నీ న్యాయవిధులు యథార్థములు
138నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు
నీ శాసనములను నీవు నియమించితివి.
139నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు
కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది.
140నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది
అది నీ సేవకునికి ప్రియమైనది.
141నేను అల్పుడను నిరాకరింపబడినవాడను
అయినను నీ ఉపదేశములను నేను మరువను.
142నీ నీతి శాశ్వతమైనది
నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము.
143శ్రమయు వేదనయు నన్ను పెట్టియున్నవి
అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి
144నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి
నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.
ఖొఫ్.
145యెహోవా, హృదయపూర్వకముగా నేను మొఱ్ఱ
పెట్టుచున్నాను
నీ కట్టడలను నేను గైకొనునట్లు నాకు ఉత్తరమిమ్ము.
146నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను
నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్నురక్షింపుము.
147తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని
నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను
148నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై
నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు
కొందును.
149నీ కృపనుబట్టి నా మొఱ్ఱ ఆలకింపుము
యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.
150దుష్కార్యములు చేయువారును
నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు
సమీపించుచున్నారు
151యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు.
నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి.
152నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని
నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని
యున్నాను.
రేష్.
153నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను
నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము
154నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము
నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము.
155భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు
గనుక రక్షణ వారికి దూరముగా నున్నది.
156యెహోవా, నీ కనికరములు మితిలేనివి
నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.
157నన్ను తరుమువారును నా విరోధులును అనేకులు
అయినను నీ న్యాయశాసనములనుండి నేను తొలగక
యున్నాను.
158ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని
నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు.
159యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు
నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము
160నీ వాక్య సారాంశము సత్యము
నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.
షీన్.
161అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు
అయినను నీ వాక్యభయము నా హృదయమందు
నిలుచుచున్నది.
162విస్తారమైన దోపుసొమ్ము సంపాదించినవానివలె
నీవిచ్చిన మాటనుబట్టి నేను సంతోషించుచున్నాను.
163అబద్ధము నాకసహ్యము అది నాకు హేయము
నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.
164నీ న్యాయవిధులనుబట్టి
దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను.
165నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదువారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు
166యెహోవా, నీ రక్షణకొరకు నేను కనిపెట్టుచున్నాను
నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను.
167నేను నీ శాసనములనుబట్టి ప్రవర్తించుచున్నాను
అవి నాకు అతి ప్రియములు.
168నా మార్గములన్నియు నీయెదుట నున్నవి
నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను.
తౌ.
169యెహోవా, నా మొఱ్ఱ నీ సన్నిధికి వచ్చునుగాక
నీ మాటచొప్పున నాకు వివేకము నిమ్ము.
170నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము
నీవిచ్చిన మాటచొప్పున నన్ను విడిపింపుము.
171నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు
నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును
172నీ ఆజ్ఞలన్నియు న్యాయములు
నీ వాక్యమునుగూర్చి నా నాలుక పాడును.
173నేను నీ ఉపదేశములను కోరుకొనియున్నాను
నీ చెయ్యి నాకు సహాయమగును గాక.
174యెహోవా, నీ రక్షణకొరకు నేను మిగుల ఆశపడుచున్నాను
నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము.
175నీవు నన్ను బ్రదికింపుము నేను నిన్ను స్తుతించెదను
నీ న్యాయవిధులు నాకు సహాయములగును గాక
176తప్పిపోయిన గొఱ్ఱెవలె నేను త్రోవవిడిచితిరిగితిని
నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా
నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను.
Currently Selected:
కీర్తనలు 119: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.