YouVersion Logo
Search Icon

కీర్తనలు 119:1-48

కీర్తనలు 119:1-48 TELUBSI

యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు. ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడియుండిన నెంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుము. యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్దిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము. నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు చున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును. నీ సేవకుడనైన నేను బ్రదుకునట్లు నాయెడల నీ దయారసము చూపుము నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతు లను చూచునట్లు నా కన్నులు తెరువుము. నేను భూమిమీద పరదేశినై యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము. నీ న్యాయవిధులమీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనముల ననుసరించుచున్నాను. నామీదికి రాకుండ నిందను తిరస్కారమును తొల గింపుము. అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాట లాడుకొందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపుము నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను. వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయుము సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను నీ న్యాయవిధులను నేను నాయెదుట పెట్టుకొని యున్నాను యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని యున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞలమార్గమున పరుగెత్తెదను. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయ చేయుము అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకా రము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము. లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృద యము త్రిప్పుము. వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికిం పుము. నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము. నీ న్యాయవిధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతినిబట్టి నన్ను బ్రదికింపుము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము నీ మాటచొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించువారికి నేను ఉత్తరమీయ గలను ఏలయనగా నీమాట నమ్ముకొనియున్నాను. నా నోటనుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసి వేయకుము నీ న్యాయవిధులమీద నా ఆశ నిలిపియున్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును నేను నిత్యము దాని ననుసరించుదును నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధములేక నడుచుకొందును సిగ్గుపడక రాజులయెదుట నీ శాసనములనుగూర్చి నేను మాటలాడెదను. నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతు లెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించుదును.