సామెతలు 8
8
1జ్ఞానము ఘోషించుచున్నది
వివేచన తన స్వరమును వినిపించుచున్నది
2త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను
నడిమార్గములలోను అది నిలుచుచున్నది
3గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను
పట్టణపు గవునులయొద్దను నిలువబడి అది ఈలాగు
గట్టిగా ప్రకటన చేయుచున్నది
4– మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను
నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను.
5జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనుడి
బుద్ధిహీనులారా, బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి.
6నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి
నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును
7నా నోరు సత్యమైన మాటలు పలుకును
దుష్టత్వము నా పెదవులకు అసహ్యము
8నా నోటి మాటలన్నియు నీతిగలవి
వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు
9అవియన్నియు వివేకికి తేటగాను
తెలివినొందినవారికి యథార్థముగాను ఉన్నవి.
10వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి
మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి.
11జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠమైనది
విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు.
12జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా
చేసికొనియున్నాను
సదుపాయములు తెలిసికొనుట నాచేతనగును.
13యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట
చెడుతనము నసహ్యించుకొనుటయే.
గర్వము అహంకారము దుర్మార్గత
కుటిలమైన మాటలు నాకు అసహ్యములు.
14ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు
నా వశము
జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే.
15నావలన రాజులు ఏలుదురు
అధికారులు న్యాయమునుబట్టి పాలనచేయుదురు.
16నావలన అధిపతులును లోకములోని ఘనులైన
న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు.
17నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను
నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు
18ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు
నాయొద్ద నున్నవి.
19మేలిమి బంగారముకంటెను అపరంజికంటెను నావలన
కలుగు ఫలము మంచిది
ప్రశస్తమైన వెండికంటె నావలన కలుగు వచ్చుబడిదొడ్డది.
20నీతిమార్గమునందును న్యాయమార్గములయందును నేను
నడచుచున్నాను.
21నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదునువారి నిధులను నింపుదును.
22పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య
ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను
కలుగజేసెను.
23అనాదికాలము మొదలుకొని మొదటినుండి
భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను
నియమింపబడితిని.
24ప్రవాహజలములు లేనప్పుడు
నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని.
25పర్వతములు స్థాపింపబడకమునుపు
కొండలు పుట్టకమునుపు
26భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు
నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను
పుట్టితిని.
27ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు
మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు
నేనక్కడ నుంటిని.
28ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు
జలధారలను ఆయన బిగించినప్పుడు
29జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు
ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు
భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు
30నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతో
షించుచు
నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.
31ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు
నరులను చూచి ఆనందించుచునుంటిని.
32కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి
నా మార్గముల ననుసరించువారు ధన్యులు
33ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై
యుండుడి.
34అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని
నా ద్వారబంధములయొద్ద కాచుకొని
నా ఉపదేశము వినువారు ధన్యులు.
35నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును
యెహోవా కటాక్షము వానికి కలుగును.
36నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును
నాయందు అసహ్యపడువారందరు మరణమును
స్నేహించుదురు.
Currently Selected:
సామెతలు 8: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.