YouVersion Logo
Search Icon

సామెతలు 25

25
1ఇవియును సొలొమోను సామెతలే
యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి
వ్రాసిరి.
2–సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత
సంగతి శోధించుట రాజులకు ఘనత.
3ఆకాశముల యెత్తును భూమి లోతును
రాజుల అభిప్రాయమును అగోచరములు.
4వెండిలోని మష్టు తీసివేసినయెడల
పుటము వేయువాడు పాత్రయొకటి సిద్ధపరచును.
5రాజు ఎదుటనుండి దుష్టులను తొలగించినయెడల
అతని సింహాసనము నీతివలన స్థిరపరచబడును.
6రాజు ఎదుట డంబము చూపకుము
గొప్పవారున్న చోట నిలువకుము.
7నీ కన్నులు చూచిన ప్రధానియెదుట
ఒకడు నిన్ను తగ్గించుటకంటె
–ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు
మేలు గదా.
8ఆలోచన లేక వ్యాజ్యెమాడుటకు పోకుము
నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి–దాని అంత
మున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో.
9నీ పొరుగువానితో నీవు వ్యాజ్యెమాడవచ్చును గాని
పరునిగుట్టు బయటపెట్టకుము.
10బయటపెట్టినయెడల వినువాడు నిన్ను అవమానపరచునేమో
అందువలన నీకు కలిగిన అపకీర్తి యెన్నటికిని పోకుండును.
11సమయోచితముగా పలుకబడిన మాట
చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు
పండ్లవంటిది.
12బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణమెట్టిదో
వినువాని చెవికి జ్ఞానముగల ఉపదేశకుడు అట్టివాడు.
13నమ్మకమైన దూత తనను పంపువారికి
కోతకాలపు మంచు చల్లదనమువంటివాడు
వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల
జేయును.
14కపటమనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు
వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు.
15దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించ వచ్చును
సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును.
16తేనె కనుగొంటివా? తగినంతమట్టుకే త్రాగుము
అధికముగా త్రాగినయెడల కక్కి వేయుదువేమో
17మాటిమాటికి నీ పొరుగువాని యింటికి వెళ్లకుము
అతడు నీవలన విసికి నిన్ను ద్వేషించునేమో.
18తన పొరుగువానిమీద కూటసాక్ష్యము పలుకువాడు
సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు.
19శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట
విరిగిన పళ్లతోను కీలు వసిలిన కాలుతోను సమానము.
20దుఃఖచిత్తునికి పాటలు వినుపించువాడు
చలిదినమున పైబట్ట తీసివేయువానితోను
సురేకారముమీద చిరకపోయువానితోను సమానుడు.
21నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము
పెట్టుము
దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము
22అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా
పోయుదువు
యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును.
23ఉత్తరపు గాలి వాన పుట్టించును
కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును.
24గయ్యాళితో పెద్ద యింట నుండుటకంటె
మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు
25దప్పిగొనినవానికి చల్లని నీరు ఎట్లుండునో
దూరదేశమునుండి వచ్చిన శుభసమాచారము అట్లుండును.
26కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు
నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు.
27తేనె నధికముగా త్రాగుట మంచిది కాదు.
దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము.
28ప్రాకారము లేక పాడైన పురము ఎంతో
తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in