YouVersion Logo
Search Icon

సామెతలు 23

23
1నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల
నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము.
2నీవు తిండిపోతువైనయెడల
నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము.
3అతని రుచిగల పదార్థములను ఆశింపకుము
అవి మోసపుచ్చు ఆహారములు.
4ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము
నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము.
5నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును
నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును.
పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును.
6ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము
చేయకుము
వాని రుచిగల పదార్థముల నాశింపకుము.
7అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు
తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని
అది హృదయములోనుండి వచ్చు మాట కాదు.
8నీవు తినినను తినినదానిని కక్కి వేయుదువు
నీవు పలికిన యింపైన మాటలు వ్యర్థములగును.
9బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము
అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును.
10పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము
తలిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడకూడదు
11వారి విమోచకుడు బలవంతుడు
ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.
12ఉపదేశముమీద మనస్సు నుంచుము
తెలివిగల మాటలకు చెవి యొగ్గుము.
13నీ బాలురను శిక్షించుట మానుకొనకుము
బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును
14బెత్తముతో వాని కొట్టినయెడల
పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు.
15నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినయెడల
నా హృదయము కూడ సంతోషించును.
16నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా
అంతరింద్రియములు ఆనందించును.
17పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము
నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము.
18నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును
నీ ఆశ భంగము కానేరదు.
19నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము
నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు
చక్కగా నడిపించుకొనుము.
20ద్రాక్షారసము త్రాగువారితోనైనను
మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము.
21త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు.
నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును.
22నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము
నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.
23సత్యమును అమ్మివేయక దాని కొని యుంచుకొనుము
జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని యుంచుకొనుము.
24నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును
జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము
నొందును.
25నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను
నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను.
26నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము
నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము,
27వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట.
28దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచి
యుండును
అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును.
29ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము?
ఎవరికి జగడములు? ఎవరికి చింత?
ఎవరికి హేతువులేని గాయములు? ఎవరికి మంద దృష్టి?
30ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా
కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.
31ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను
గిన్నెలో తళతళలాడుచుండగను
త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.
32పిమ్మట అది సర్పమువలె కరచును
కట్లపామువలె కాటువేయును.
33విపరీతమైనవి నీ కన్నులకు కనబడును
నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు
34నీవు నడిసముద్రమున పండుకొనువానివలె నుందువు
ఓడకొయ్య చివరను పండుకొనువానివలె నుందువు.
35–నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు
నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు
నేనెప్పుడు నిద్ర మేల్కొందును?
మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in