సామెతలు 10
10
1జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును
బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.
2భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు
నీతి మరణమునుండి రక్షించును.
3యెహోవా నీతిమంతుని ఆకలిగొననియ్యడు
భక్తిహీనుని ఆశను భంగముచేయును.
4బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును
శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.
5వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు
కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు.
6నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును
బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును.
7నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకర
మగును
భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును
8జ్ఞానచిత్తుడు ఉపదేశము నంగీకరించును
పనికిమాలిన వదరుబోతు నశించును.
9యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును.
కుటిలవర్తనుడు బయలుపడును.
10కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును
పనికిమాలిన వదరుబోతు నశించును.
11నీతిమంతుని నోరు జీవపు ఊట
భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును.
12పగ కలహమును రేపును
ప్రేమ దోషములన్నిటిని కప్పును.
13వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును
బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును.
14జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు
మూఢుల నోరు అప్పుడే నాశనముచేయును.
15ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము
దరిద్రుని పేదరికము వానికి నాశనకరము.
16నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము
భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును.
17ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గములో
ఉన్నాడు
గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును.
18అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు
కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు.
19విస్తారమైన మాటలలో దోషముండక మానదు
తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.
20నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది
భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది.
21నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును
బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు.
22యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును
నరుల కష్టముచేత ఆయాశీర్వాదము ఎక్కువ కాదు.
23చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది
వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే.
24భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి
వచ్చును
నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును.
25సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును.
నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమువలె ఉన్నాడు.
26సోమరి తనను పని పెట్టువారికి
పండ్లకు పులుసువంటివాడు కండ్లకు పొగవంటివాడు.
27యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట
దీర్ఘాయువునకు కారణము
భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును.
28నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును.
భక్తిహీనుల ఆశ భంగమై పోవును.
29యథార్థవంతునికి యెహోవా యేర్పాటు ఆశ్రయదుర్గము
పాపముచేయువారికి అది నాశనకరము.
30నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు
భక్తిహీనులు దేశములో నివసింపరు.
31నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును
మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును.
32నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు
పలుకును
భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును.
Currently Selected:
సామెతలు 10: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.