YouVersion Logo
Search Icon

నెహెమ్యా 5

5
1తమ సహోదరులైన యూదులమీద జనులును వారి భార్యలును కఠినమైన ఫిర్యాదుచేసిరి. 2ఏదనగా కొందరు –మేమును మా కుమారులును మా కుమార్తెలును అనేకు లము. అందుచేత మేముతిని బ్రదుకుటకు ధాన్యము మీయొద్ద తీసికొందుమనిరి. 3మరికొందరు–క్షామ మున్నందున మా భూములను ద్రాక్షతోటలను మాయిండ్లను కుదువ పెట్టితిమి గనుక మీయొద్ద ధాన్యము తీసికొందు మనిరి. 4మరికొందరు–రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూములమీదను మా ద్రాక్షతోటలమీదను మేము అప్పు చేసితిమి. 5మా ప్రాణము మా సహోదరుల ప్రాణమువంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను; ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వములోనున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా 6వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని. 7అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించి–మీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి 8–అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తికొలది మేము విడిపించితిమి, మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా? అని వారితో చెప్పగా, వారు ఏమియు చెప్పలేక ఊరకుండిరి. 9మరియు నేను–మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందనుబట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింప కూడదా? 10నేనును నా బంధువులును నా దాసులును కూడ ఆలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి; ఆ అప్పు పుచ్చుకొనకుందము. 11ఈ దినములోనే వారియొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్షతోటలను ఒలీవతోటలను వారి యిండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షారసములోను నూనెలోను నూరవభాగమును వారికి మరల అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని. 12అందుకు వారు–నీవు చెప్పినప్రకారమే యివన్నియు ఇచ్చివేసి వారియొద్ద ఏమియు కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము చేయించితిని. 13మరియు నేను నా ఒడిని దులిపి–ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన యింటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును; ఇటువలె వాడు దులిపి వేయబడి యేమియు లేనివాడుగా చేయబడునుగాకని చెప్పగా, సమాజకులందరు ఆలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరును ఈ మాటచొప్పుననే జరిగించిరి. 14మరియు నేను యూదాదేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడినకాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరము మొదలుకొని ముప్పదిరెండవ సంవత్సరమువరకు పండ్రెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేనుగాని నా బంధువులుగాని తీసికొనలేదు. 15అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి; వారి పనివారు సహా జనులమీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయముచేత నేనాలాగున చేయలేదు. 16ఇదియుగాక నేను ఈ గోడపనిచేయగా నా పనివారును ఆ పనిచేయుచు వచ్చిరి. 17భూమి సంపాదించుకొనినవారము కాము; నా భోజనపు బల్లయొద్ద మా చుట్టునున్న అన్యజనులలోనుండి వచ్చినవారు గాక యూదులును అధికారులును నూట ఏబదిమంది కూర్చునియుండిరి. 18నా నిమిత్తము ప్రతిదినము ఒక యెద్దును శ్రేష్ఠమైన ఆరు గొఱ్ఱెలును సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను, పదిరోజులకు ఒకమారు నానావిధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసితిని. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు. 19నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములనుబట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in