YouVersion Logo
Search Icon

నెహెమ్యా 4

4
1మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళిచేసి 2షోమ్రోను దండువారి యెదుటను తన స్నేహితుల యెదుటను ఇట్లనెను–దుర్బలులైన యీ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే యీ పని ముగింతురా? బలులు అర్పించి బలపరచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగాపడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా? 3మరియు అమ్మోనీయుడైన టోబీయా అతనియొద్దను ఉండి–వారు కట్టినదానిపైకి ఒక నక్క యెగిరినట్టయిన వారి రాతిగోడ పడిపోవుననెను. 4–మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము; వారి నింద వారి తలలమీదికి వచ్చునట్లుచేసి, వారు చెరపట్టబడినవారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము. 5వారు కట్టువారినిబట్టి నీకు కోపము పుట్టించి యుండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము, నీయెదుట వారి పాపమును తుడిచి వేయకుము. 6అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగియుండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి యుండెను.
7సన్బల్లటును టోబీయాయును అరబీయులును అమ్మోనీయులును అష్డోదీయులును, యెరూషలేముయొక్క గోడలు కట్టబడెననియు, బీటలన్నియు కప్పబడెననియు వినినప్పుడు 8మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి, పని ఆటంకపరచవలెనని వారందరు కట్టుకట్టి మమ్మును కలతపరచగా, 9మేము మా దేవునికి ప్రార్థనచేసి, వారి భయముచేత రాత్రింబగళ్లు కావలియుంచితిమి. 10అప్పుడు యూదావారు – బరువులు మోయువారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా, 11మా విరోధులును – వారు తెలిసికొనకుండను చూడకుండను మనము వారిమధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిరి. 12మా శత్రువులయొద్ద నివాసులైయున్న యూదులు వచ్చి–నలు దిక్కులనుండి మీరు మా సహాయమునకు రావలెనని మాటి మాటికి మాతో చెప్పగా 13అందునిమిత్తము గోడవెనుక నున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోను వారి యీటెలతోను వారి విండ్లతోను నిలిపితిని. 14అంతట నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను–వారికి మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొని, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని.
15వారి యోచన మాకు తెలియబడెననియు, దేవుడు దానిని వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారము వినగా, మాలో ప్రతివాడును తన పనికి గోడదగ్గరకు వచ్చెను. 16అయితే అప్పటినుండి నా పనివారిలో సగము మంది పనిచేయుచు వచ్చిరి, సగముమంది యీటెలును బల్లెములును విండ్లును కవచములును ధరించినవారై వచ్చిరి; అధికారులు యూదులలో ఆయా యింటివారి వెనుక నిలిచిరి. 17గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును, ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని యుండిరి. 18మరియు కట్టువారిలో ఒక్కొకడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను, బాకా ఊదువాడు నాయొద్ద నిలిచెను. 19అప్పుడు నేను ప్రధానులతోను అధికారులతోను మిగిలినవారితోను ఇట్లంటిని–పని మిక్కిలి గొప్పది, మనము గోడమీద ఒకరొకరికి చాల యెడముగా ఉన్నాము 20గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధముచేయును. 21ఆప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి; సగముమంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడువరకు ఈటెలు పట్టుకొనిరి. 22మరియు ఆ కాలమందు నేను జనులతో– ప్రతివాడు తన పనివానితోకూడ యెరూషలేములో బస చేయవలెను, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పనిచేయుదురని చెప్పితిని. 23ఈలాగున నేనుగాని నా బంధువులుగాని నా పనివారుగాని నా వెంబడియున్న పారావారుగాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in