యెహోషువ 22
22
1యెహోషువ రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రపువారిని పిలిపించి వారితో ఇట్లనెను 2–యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించినదంతయు మీరు చేసియున్నారు. మరియు నేను మీ కాజ్ఞాపించిన వాటన్నిటి విషయములో నా మాట వినియున్నారు. 3బహుదినములనుండి నేటివరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞననుసరించి నడిచియున్నారు. 4ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి యున్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్లుడి. 5అయితే మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, ఆయనమార్గములన్నిటిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. 6అతడీలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్లనంపగా వారు తమ నివాసములకు పోయిరి.
7మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును, యెహోషువ పడమటిదిక్కున యొర్దాను ఇవతల వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్థ్యము లిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్లనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను 8–మీరు మిక్కిలి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోను వెండితోను బంగారుతోను ఇత్తడితోను ఇనుముతోను అతివిస్తారమైన వస్త్రములతోను తిరిగి మీ నివాసములకు వెళ్లుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులును కలిసి పంచు కొనుడి.
9కాబట్టి రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధ గోత్రపువారును యెహోవా మోషేద్వారా సెలవిచ్చిన మాటచొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్యభూమి యైన గిలాదులోనికి వెళ్లుటకు కనాను దేశమందలి షిలో హులోనున్న ఇశ్రాయేలీయుల యొద్దనుండి బయలుదేరిరి. కనానుదేశమందున్న యొర్దాను ప్రదేశమునకు వచ్చి నప్పుడు 10రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధ గోత్రపువారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. 11అప్పుడు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీయుల యెదుటివైపున యొర్దానుప్రదేశములో కనానుదేశము నెదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానము వచ్చెను. 12ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి 13ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్ధగోత్రపువారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. 14ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని, అనగా పదిమంది ప్రధానులను అతనితోకూడ పంపిరి, వారందరు ఇశ్రాయేలీయుల సమూహములలో తమతమపితరుల కుటుంబములకు ప్రధానులు. 15వారు గిలాదుదేశములోనున్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్ధ గోత్రపువారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి 16–యెహోవా సర్వ సమాజపువారు చెప్పుచున్నదేమనగా–నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని, ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరేల తిరుగుబాటు చేయుచున్నారు? 17పెయోరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టెను గదా నేటివరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనకయున్నాము. 18మీరు ఈ దినమున యెహోవా వెంబడినుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగబడి ద్రోహము చేసెదరేమి? ఆలాగైతే ఆయన ఇకమీదట ఇశ్రాయేలీయుల సర్వసమాజముమీద కోపపడును గదా? 19మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండినయెడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మామధ్యను స్వాస్థ్యము తీసికొనుడి, మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగబడకుడి, మా మీద తిరుగబడకుడి, 20జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దానివిషయములో తిరుగబడినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మీదికి కోపము రాలేదా? తన దోషమువలన ఆ మనుష్యుడొకడే మరణమాయెనా?
21అందుకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపువారును ఇశ్రాయేలీయుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా 22–దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు; సంగతి ఆయనకు తెలియును, ఇశ్రాయేలీయులు తెలిసికొందురు, ద్రోహము చేతనైనను యెహోవామీద తిరుగుబాటుచేతనైనను మేము ఈ పని చేసినయెడల నేడు మమ్ము బ్రదుకనియ్యకుడి. 23యెహోవాను అనుసరింపక తొలగిపోయి, దహనబలినైనను నైవేద్యమునైనను దానిమీద అర్పించుటకేగాని సమాధానబలులను దానిమీద అర్పించుటకేగాని మేము ఈ బలిపీఠమును కట్టినయెడల యెహోవా తానే విమర్శచేయునుగాక. వేరొక హేతువుచేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. 24ఏమనగా రాబోవుకాలమున మీ సంతానపు వారు మా సంతానపువారితో–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? 25రూబేనీయులారా గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెనుగదా యెహోవాయందు మీకు పాలేదియు లేదని చెప్పుటవలన మీ సంతానపువారు మా సంతానపువారిని యెహోవా విషయములో భయభక్తులులేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువుచేతనే దీని చేసితిమి. 26కాబట్టి మేము–మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పు కొంటిమి; అది దహనబలులనర్పించుటకైనను బలినర్పిం చుటకైనను కాదు. 27మన దహనబలుల విషయములోను బలుల విషయములోను సమాధానబలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవచేయవలయు ననుటకు–యెహోవాయందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతివారు మా సంతతివారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన మన తరములవారికిని మధ్య సాక్షియైయుండును. 28అందుకు మేము–ఇకమీదట వారు మాతోనేగాని మా తరముల వారితోనేగాని అట్లు చెప్పినయెడల మేము–మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి; యిది దహనబలినర్పించుటకు కాదు బలినర్పించుటకు కాదు గాని, మాకును మీకును మధ్యసాక్షియై యుండుటకే యని చెప్పుదమని అనుకొంటిమి. 29ఆయన మందిరము నెదుట నున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహనబలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయినయెడలనేమి యెహోవామీద ద్రోహము చేసినయెడలనేమి మేము శాపగ్రస్తులమగుదుము గాక.
30ఫీనెహాసను యాజకుడును సమాజ ప్రధానులును, అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులును రూబేనీయులును గాదీయులును మనష్షీయులును చెప్పిన మాటలను విని సంతోషించిరి. 31అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసు రూబేనీయులతోను గాదీయులతోను మనష్షీయులతోను–మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము; ఇప్పుడు మీరు యెహోవా చేతిలోనుండి ఇశ్రాయేలీయులను విడిపించియున్నారని చెప్పెను.
32యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసును ప్రధానులును గిలాదులోని రూబేనీయుల యొద్దనుండియు, గాదీయుల యొద్దనుండియు ఇశ్రాయేలీయుల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా 33ఇశ్రాయేలీయులు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి, రూబేనీయులును గాదీయులును నివసించు దేశమును పాడుచేయుటకు వారిమీద యుద్ధము చేయుట మానిరి. 34రూబేనీయులును గాదీయులును యెహోవాయే దేవుడనుటకు ఇది మనమధ్యను సాక్షియగు నని దానికి ఏద#22:34 సాక్షి. అను పేరు పెట్టిరి.
Currently Selected:
యెహోషువ 22: TELUBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.