యెహోషువ 21
21
1లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులయొద్దకును వచ్చి 2–మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించెననగా 3ఇశ్రాయేలీయులు యెహోవా మాటచొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి.
4వంతుచీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికులనుండియు, షిమ్యోను గోత్రి కులనుండియు, బెన్యామీను గోత్రికులనుండియు చీట్లవలన వచ్చినవి పదమూడు పట్టణములు. 5కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండియు, దాను గోత్రికుల నుండియు, మనష్షే అర్ధ గోత్రపువారినుండియు వంతుచీట్లవలన వచ్చినవి పది పట్టణములు.
6ఇశ్శాఖారు గోత్రికులనుండియు, ఆషేరు గోత్రికుల నుండియు, నఫ్తాలి గోత్రికులనుండియు, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపువారినుండియు చీట్లవలన గెర్షోనీయులకు కలిగినవి పదమూడు పట్టణములు. 7రూబేను గోత్రి కులనుండియు, గాదు గోత్రికులనుండియు, జెబూలూను గోత్రికులనుండియు, వారి వంశములచొప్పున మెరారీయులకు కలిగినవి పండ్రెండు పట్టణములు. 8యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయుల కిచ్చిరి.
9వారు యూదావంశస్థుల గోత్రములోను షిమ్యోనీయుల గోత్రములోను చెప్పబడిన పేరులుగల యీ పట్టణములను ఇచ్చిరి. 10అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి, ఏలయనగా మొదట చేతికివచ్చిన వంతుచీటి వారిది. 11యూదావంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా, అనగా హెబ్రోను నిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టునున్న పొలమును వారి కిచ్చిరి. 12అయితే ఆ పట్టణముయొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి.
13-16యాజకుడైన అహరోను సంతానపువారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును దాని పొలమును లిబ్నాను దాని పొలమును యత్తీరును దాని పొలమును ఎష్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును దెబీరును దాని పొలమును ఆయినిని దాని పొలమును యుట్టయును దాని పొలమును బేత్షెమెషును దాని పొలమును, అనగా ఆ రెండు గోత్రములవారినుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి. 17బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును 18అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. 19యాజకు లైన అహరోను వంశకుల పట్టణములన్నియు వాటి పొలములు పోగా పదమూడు పట్టణములు.
20కహాతీయుల వంశపువారైన లేవీయులకు, అనగా కహాతు సంబంధులలో మిగిలినవారికి వంతుచీట్లవలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రమునుండి వారికియ్యబడెను. 21నాలుగు పట్టణములను, అనగా ఎఫ్రాయిమీయుల మన్యదేశములో నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమైన షెకెమును దాని పొలమును గెజెరును దాని పొలమును 22కిబ్సాయిమును దాని పొలమును బేత్‌హోరోనును దాని పొలమును వారికిచ్చిరి. 23దాను గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా ఎల్తెకేను దాని పొలమును గిబ్బెతోనును దాని పొలమును 24అయ్యాలోనును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొలమును వారికిచ్చిరి. 25రెండు పట్టణములును, అనగా మనష్షే అర్ధగోత్రికులనుండి తానాకును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి. 26వాటి పొలములు గాక కహాతు సంబంధులలో మిగిలినవారికి కలిగిన పట్టణములన్నియు పది.
27లేవీయుల వంశములలో గెర్షోనీయులకు రెండు పట్టణములను, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును బెయెష్టెరాను దాని పొలమును ఇచ్చిరి. 28ఇశ్శాఖారు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా కిష్యోనును దాని పొలమును దాబెరతును దాని పొలమును యర్మూతును దాని పొలమును 29ఏన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి. 30ఆషేరు గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా మిషెయలును దాని పొలమును అబ్దోనును దాని పొలమును 31హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి. 32నఫ్తాలి గోత్రికులనుండి మూడు పట్టణములను, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు గలిలయలోని కెదెషును దాని పొలమును హమ్మోత్దోరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి. 33వారి వంశములచొప్పున గెర్షోనీయుల పట్టణములన్నియు వాటి పొలములుగాక పదమూడు పట్టణములు.
34లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలూను గోత్రములనుండి నాలుగు పట్టణములను, అనగా యొక్నెయామును దాని పొలమును 35కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలాలును దాని పొలమును ఇచ్చిరి. 36రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును యాహ సును దాని పొలమును 37కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి. 38గాదు గోత్రికుల నుండి నాలుగు పట్టణములును, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు గిలాదులోని రామోతును దాని పొలమును మహనయీమును దాని పొలమును 39హెష్బోనును దాని పొలమును యాజెరును దాని పొలమును ఇచ్చిరి. 40వారి వారి వంశములచొప్పున, అనగా లేవీయుల మిగిలిన వంశములచొప్పున అవన్నియు మెరారీయులకు కలిగిన పట్టణములు. వంతుచీటివలన వారికి కలిగిన పట్టణములు పండ్రెండు.
41ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలుగాక లేవీయుల పట్టణములన్నియు నలువది యెనిమిది. 42ఆ పట్టణములన్నిటికి పొలములుండెను. ఆ పట్టణములన్నియు అట్లేయుండెను. 43యెహోవా ప్రమాణము చేసి వారి పితరుల కిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయుల కప్పగించెను. వారు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి. 44యెహోవావారి పితరులతో ప్రమాణముచేసిన వాటన్నిటి ప్రకారము అన్నిదిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవావారి శత్రువులనందరిని వారి చేతి కప్పగించియుండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలీయులయెదుట నిలువలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను.
Currently Selected:
యెహోషువ 21: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.