యిర్మీయా 9
9
1నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక. 2నా జనులందరు వ్యభిచారులును ద్రోహుల సమూహమునై యున్నారు. అహహా, అరణ్యములో బాటసారులబస నాకు దొరికిన ఎంత మేలు? నేను నా జనులను విడిచి వారియొద్దనుండి తొలగిపోవుదును. 3విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉప యోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడుచేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు. 4మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. 5సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధము లాడుట తమ నాలుకలకు అభ్యాసముచేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు. 6నీ నివాసస్థలము కాపట్యము మధ్యనే యున్నది, వారు కపటులై నన్ను తెలిసికొననొల్లకున్నారు; ఇదే యెహోవా వాక్కు.
7కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలకింపుము, వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరగించుచున్నాను, నా జనులనుబట్టి నేను మరేమి చేయుదును? 8వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది; ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును. 9నేను ఈ సంగతులను తెలిసికొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతి దండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.
10పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును; అరణ్యములోని మేతస్థలములనుబట్టి విలా పము చేయుదును; అవి పాడాయెను. సంచారము చేయువాడెవడును లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశపక్షులును జంతువులును పారిపోయి యున్నవి, అవి తొలగిపోయి యున్నవి. 11యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను, యూదాపట్టణములను నివాసిలేని పాడు స్థలముగా చేయుచున్నాను. 12ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని యెవడు? దానిని వాడు తెలియజేయునట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను?ఎవడును సంచరింపకుండ ఆ దేశము ఎడారివలె ఏల కాలిపోయి పాడాయెను?
13అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– వారు నా మాట వినకయు దాని ననుసరింపకయు, నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి 14తమ హృదయమూర్ఖతచొప్పున జరిగించుటకై తమపితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను. 15సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. 16తామైనను తమపితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టు దును, వారిని నిర్మూలముచేయువరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును.
17సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలోచింపుడి, రోదనముచేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి. 18మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పలనుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలెను. 19మనము వలసబోతిమే సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసివచ్చెనే అని సీయోనులో రోదనధ్వని వినబడు చున్నది. 20స్త్రీలారా, యెహోవా మాట వినుడి–మీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. 21వీధులలో పసిపిల్లలులేకుండను, రాజ మార్గములలో యౌవనులులేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. 22యెహోవా వాక్కు ఇదే–నీవీమాట చెప్పుము–చేలమీద పెంటపడునట్లు పంట కోయు వాని వెనుక పిడికిళ్లు పడునట్లు ఎవడును సమకూర్చకుండ మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడును లేకపోవును.
23యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు. 24అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 25అన్యజనులందరును సున్నతిపొందనివారు గనుక, ఇశ్రాయేలీయులందరు హృదయ సంబంధమైన సున్నతినొందినవారుకారు గనుక, రాబోవుదినములలో సున్నతిపొందియు సున్నతిలేని వారివలెనుండు 26ఐగుప్తీయులను యూదావారిని ఎదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరిని నేను శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు.
Currently Selected:
యిర్మీయా 9: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.