YouVersion Logo
Search Icon

యిర్మీయా 8

8
1యెహోవా వాక్కు – ఆ కాలమున శత్రువులు యూదారాజుల యెముకలను అధిపతుల యెముకలను యాజకుల యెముకలను ప్రవక్తల యెముకలను యెరూషలేము నివాసుల యెముకలను సమాధులలోనుండి వెలుపలికి తీసి 2వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంటవలె పడియుండును. 3అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న యీ చెడ్డ వంశములో శేషించిన వారందరు జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు; సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే.
4మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము–మనుష్యులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుష్యులు తిరిగిరారా? 5యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్ర యము చేసికొని తిరిగి రామని యేల చెప్పుచున్నారు? 6నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికిమాలిన మాటలు వారాడుకొనుచున్నారు–నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనమునుగూర్చి పశ్చాత్తాపపడువాడొకడును లేక పోయెను? యుద్ధమునకు చొరబడు గుఱ్ఱమువలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. 7ఆకాశమున ఎగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తిపిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు. 8–మేము జ్ఞానులమనియు, యెహోవా ధర్మశాస్త్రము మాయొద్దనున్నదనియు మీరేల అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. 9జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయమొంది చిక్కున పడియున్నారు, వారు యెహోవా వాక్యమును నిరాక రించినవారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు? 10గనుక వారి భార్యలను అన్యుల కప్పగింతును, వారిని జయించువారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి ఘనులేమి అందరును మోసముచేసి దోచుకొనువారు; ప్రవక్తలేమి యాజకులేమి అందరును వంచకులు. 11సమాధానము లేని సమయమున–సమాధానము సమాధానము అని వారు చెప్పుచు, నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగుచేయుదురు. 12తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెనుగాని వారేమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడిపోవువారిలో వారు పడిపోవుదురు; నేను వారిని విమర్శించుకాలమునవారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు 13ద్రాక్షచెట్టున ఫలములులేకుండునట్లును, అంజూరపుచెట్టున అంజూరపు పండ్లులేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను; వారిమీదికి వచ్చు వారిని నేనాలాగున పంపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు. 14మనమేల కూర్చుండియున్నాము? మనము పోగు బడి ప్రాకారములుగల పట్టణములలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము రండి; యెహోవాయే మనలను నాశనముచేయుచున్నాడు, ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. 15మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియు రాదాయెను; క్షేమముకొరకు కనిపెట్టుచున్నాముగాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు. 16దానునుండి వచ్చువారి గుఱ్ఱముల బుసలు వినబడెను, వారి గుఱ్ఱముల సకిలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది, వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనముచేయుదురు, పట్టణమును అందులో నివసించువారిని నాశనము చేయుదురు. 17నేను మిడునాగులను మీలోనికి పంపు చున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు; ఇదే యెహోవా వాక్కు.
18నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? 19యెహోవా సీయో నులో లేకపోయెనా? ఆమె రాజు ఆమెలో లేకపోయెనా? అని బహు దూరదేశమునుండి నా ప్రజల రోదనశబ్దము వినబడుచున్నది; వారి విగ్రహములచేతను అన్యమైన మాయా రూపములచేతను నాకేల కోపము తెప్పించిరి? 20–కోత కాలము గతించియున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణనొందకయే యున్నాము అని చెప్పుదురు. 21నా జనుల వేదననుబట్టి నేను వేదనపడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోరభయము నన్ను పెట్టియున్నది. 22గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యు డును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవు చున్నది?

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యిర్మీయా 8