YouVersion Logo
Search Icon

యిర్మీయా 40

40
1రాజదేహసంరక్షకులకధిపతియైన నెబూజరదాను యెరూషలేములోనుండియు యూదాలోనుండియు బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలోనుండి, సంకెళ్లచేత కట్టబడియున్న యిర్మీయాను తీసికొని రామాలోనుండి పంపివేయగా, యెహోవా యొద్దనుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు. 2రాజదేహసంరక్షకులకధిపతి యిర్మీయాను అవతలికి తీసికొనిపోయి అతనితో ఈలాగు మాటలాడెను–ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసెదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను గదా. 3తాను చెప్పిన ప్రకారము యెహోవా దాని రప్పించి చేయించెను, మీరు యెహోవాకు విరోధముగా పాపముచేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకీగతి పెట్టినది. 4ఆలకించుము, ఈ దినమున నేను నీచేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను, నాతోకూడ బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచినయెడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడెదను; అయితే బబులోనునకు నాతోకూడ వచ్చుట మంచిదికాదని నీకు తోచినయెడల రావద్దు, దేశమంతట నీకేమియు అడ్డములేదు, ఎక్కడికి వెళ్లుట నీ దృష్టికి అనుకూలమో, యెక్కడికి వెళ్లుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్లుము. 5ఇంకను అతడు తిరిగి వెళ్లక తడవు చేయగా రాజదేహసంరక్షకులకధిపతి అతనితో ఈలాగు చెప్పెను–బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీ కాము కుమారుడగు గెదల్యాను యూదాపట్టణములమీద నియమించియున్నాడు, అతని యొద్దకు వెళ్లుము; అతని యొద్ద నివసించి ప్రజలమధ్యను కాపురముండుము, లేదా యెక్కడికి వెళ్లుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్లుము. మరియు రాజదేహసంరక్షకులకధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా 6యిర్మీయా మిస్పాలోనుండు అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వెళ్లి అతనితోకూడ దేశములో మిగిలిన ప్రజలమధ్య కాపురముండెను.
7అయితే అచ్చటచ్చటనుండు సేనల యధిపతులందరును వారి పటాలపువారును, బబులోనురాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశముమీద అధికారిగా నియమించి, బబులోనునకు చెరగొని పోబడక నిలిచినవారిలో స్త్రీలను పురుషులను పిల్లలను, దేశములోని అతినీరసులైన దరిద్రులను అతనికి అప్పగించెనని వినిరి. 8కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును కారేహ కుమారులైన యోహానాను యోనాతానులును తన్హుమెతు కుమారుడైన శెరాయాయును నెటోపాతీయుడైన ఏపయి కుమారులును మాయ కాతీయుడైనవాని కుమారుడగు యెజన్యాయును వారి పటాలపువారును మిస్పాలోనుండిన గెదల్యాయొద్దకు వచ్చిరి. 9అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణముచేసి వారితోను వారి పటాలపువారితోను ఈలాగు చెప్పెను–మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి, దేశములో కాపురముండి బబులోనురాజును సేవించినయెడల మీకు మేలు కలుగును. 10నేనైతేనో నాయొద్దకు వచ్చు కల్దీయుల యెదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును గాని మీరు ద్రాక్షారసమును వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకొని, మీ పాత్రలలో వాటిని పోసికొని మీరు స్వాధీనపరచుకొనిన పట్టణములలో కాపురముండుడి. 11మోయాబులోనేమి అమ్మోనీయులమధ్యనేమి ఎదోములోనేమి యే యే ప్రదేశములలోనేమి యున్న యూదులందరు బబులోనురాజు యూదాలో జనశేషమును విడిచెననియు, షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారిమీద నియమించెననియు వినినప్పుడు 12అందరును తాము తోలివేయబడిన స్థలములన్నిటిని విడిచి మిస్పాకు గెదల్యాయొద్దకు వచ్చి బహు విస్తారమైన ద్రాక్షారసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి.
13మరియు కారేహ కుమారుడైన యోహానానును, అచ్చ టచ్చటనున్న సేనల యధిపతులందరును మిస్పా లోనున్న గెదల్యాయొద్దకు వచ్చి 14–నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీసు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపెనని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీ కాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు. 15కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనెను–నీయొద్దకు కూడివచ్చిన యూదులందరు చెదరిపోవునట్లును, యూదా జనశేషము నశించు నట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంప నేల? దయచేసి నన్ను వెళ్లనిమ్ము, ఎవనికి తెలియకుండ నేను వానిని చంపెదను. 16అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా కారేహ కుమారుడైన యోహానానుతో–ఇష్మాయేలునుగూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, నీవాకార్యము చేయకూడదనెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యిర్మీయా 40