యిర్మీయా 26
26
1యోషీయా కుమారుడును యూదారాజునగు . యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్దనుండి వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 2–యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీవు యెహోవామందిరావరణములో నిలిచి, నేను నీ కాజ్ఞాపించు మాట లన్నిటిని యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికి ప్రకటింపుము; వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు. 3వారి దుర్మార్గమునుబట్టి వారికి చేయదలచిన కీడును చేయక నేను సంతాప పడునట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదు రేమో. 4నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చునదేమనగా 5–మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము ననుసరించి నడుచు కొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులగు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. 6మీరీలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసెదను, ఈ పట్టణమును భూమిమీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను. 7యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులును ప్రవక్తలును జనులందరును వినిరి. 8జనులకందరికిని ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తరువాత యాజకులును ప్రవక్తలును జనులందరును అతని పట్టుకొని–నీవు మరణశిక్ష నొందక తప్పదు. 9యెహోవా నామమునుబట్టి ఈ మందిరము షిలోహువలెనగుననియు, ఈ పట్టణము నివాసిలేక పాడైపోవుననియు నీవేల ప్రకటించుచున్నావు అనుచు, ప్రజలందరు యెహోవా మందిరములో యిర్మీయాయొద్దకు కూడివచ్చిరి.
10యూదా అధిపతులు ఆ సంగతులు విని రాజు నగరులోనుండి యెహోవా మందిరమునకు వచ్చి, యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా 11యాజకులును ప్రవక్తలును అధిపతులతోను సమస్త ప్రజలతోను ఈలాగనిరి–మీరు చెవులార వినియున్న ప్రకారము, ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు; గనుక ఇతడు మరణమునకు పాత్రుడు. 12అప్పుడు యిర్మీయా అధిపతులందరితోను జనులందరితోను ఈ మాట చెప్పెను–ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటిని ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు. 13కాబట్టి యెహోవా మీకు చేసెదనని తాను చెప్పిన కీడునుగూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. 14ఇదిగో నేను మీ వశములోనున్నాను, మీ దృష్టికేది మంచిదో యేది యుక్తమైనదో అదే నాకు చేయుడి. 15అయితే మీకు చెవులార ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీయొద్దకు నన్ను పంపియున్నాడు గనుక, మీరు నన్ను చంపినయెడల మీరు మీమీదికిని ఈ పట్టణముమీదికిని దాని నివాసులమీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలిసికొనుడి. 16కాగా అధిపతులును జనులందరును యాజకులతోను ప్రవక్తలతోను ఇట్లనిరి–ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామమునుబట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు. 17మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి. 18–యూదారాజైన హిజ్కియా దినములలో మోరష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను–సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–చేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును. 19అట్లు పలికినందున యూదారాజైన హిజ్కియాయైనను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? యెహోవావారికి చేసెదనని తాను చెప్పిన కీడును చేయక సంతాప పడునట్లు రాజు యెహోవాయందు భయభక్తులుకలిగి యెహోవా దయను వేడుకొనెను గదా? మనము ఈ కార్యము చేసినయెడల మనమీదికే గొప్పకీడు తెచ్చు కొందుము అని చెప్పిరి.
20మరియు కిర్యత్యారీము వాడైన షెమయా కుమారుడగు ఊరియాయను ఒకడు యెహోవా నామమునుబట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటల రీతిని యీ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను. 21రాజైన యెహోయాకీమును అతని శూరులందరును ప్రధానులందరును అతని మాటలు వినినమీదట రాజు అతని చంపజూచుచుండగా, ఊరియా దాని తెలిసికొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను. 22అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను; 23వారు ఐగుప్తులోనుండి ఊరియాను తీసికొనివచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా, ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్యజనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను. 24ఈలాగు జరుగగా షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడైయున్నందున అతని చంపుటకు వారు జనులచేతికి అతనిని అప్పగింప లేదు.
Currently Selected:
యిర్మీయా 26: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.