యిర్మీయా 25
25
1యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము నాలుగవ సంవత్సరమున, అనగా బబులోనురాజైన నెబుకద్రెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరినిగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. 2ప్రవక్తయైన యిర్మీయా యూదా ప్రజలందరితోను యెరూషలేము నివాసులందరితోను ఆ వాక్కును ప్రకటించెను. 3ఆమోను కుమారుడును యూదారాజు నైన యోషీయా పదుమూడవ సంవత్సరము మొదలుకొని నేటివరకు ఈ యిరువది మూడు సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచువచ్చెను; నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి. 4-6–మీ చేతిపనులవలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగ జేయకుండునట్లును, అన్యదేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారముచేయుటయు మాని, మీరందరు మీ చెడ్డమార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగినయెడల, యెహోవా మీకును మీపితరులకును నిత్యనివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై, యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరిని మీయొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. 7అయితే–మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనులవలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపక పోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 8-9సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీరు నా మాటలను ఆలకింపక పోతిరి గనుక నేను ఉత్తరదేశములోనున్న సర్వజనములను, నా సేవకుడైన నెబుకద్రెజరను బబులోనురాజును పిలువనంపించుచున్నాను; ఈ దేశముమీదికిని దీని నివాసులమీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మ యాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను. 10సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండ చేసెదను. 11ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును; ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోనురాజునకు దాసులుగా ఉందురు. 12యెహోవా వాక్కు ఇదే–డెబ్బది సంవత్సరములు గడచిన తరువాత వారి దోషములనుబట్టి నేను బబులోనురాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును; ఆ దేశము ఎప్పుడు పాడుగనుండునట్లు నియమింతును. 13నేను ఆ దేశమునుగూర్చి సెలవిచ్చిన మాటలన్నియు యిర్మీయా ఈ జనములన్నిటినిగూర్చి ప్రకటింపగా, ఈ గ్రంథములో వ్రాయ బడినదంతయు ఆ దేశముమీదికి రప్పించెదను. 14ఏలయనగా నేను వారి క్రియలనుబట్టియు వారి చేతి కార్యములనుబట్టియు వారికి ప్రతికారముచేయునట్లు అనేక జనములును మహారాజులును వారిచేత సేవ చేయించు కొందురు.
15ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు–నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలోనుండి తీసికొని, నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికి దాని త్రాగింపుము. 16వారు దాని త్రాగి సొక్కి సోలుచు నేను వారిమీదికి పంపుచున్న ఖడ్గమునుబట్టి వెఱ్ఱివాండ్రగుదురు. 17అంతట యెహోవా చేతిలోనుండి నేను ఆ పాత్రను తీసికొని, యెహోవా నన్ను పంపిన జనములన్నిటికి దాని త్రాగించితిని. 18నేటివలెనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని. 19మరియు ఐగుప్తురాజైన ఫరోయును అతని దాసులును అతని ప్రధానులును అతని జనులందరును 20సమస్తమైన మిశ్రిత జనులును ఊజుదేశపు రాజులందరును ఫిలి ష్తీయుల దేశపు రాజులందరును అష్కెలోనును, గాజయును, ఎక్రోనును అష్డోదు శేషపువారును 21ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులును 22తూరు రాజులందరును సీదోను రాజులందరును సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులును 23దదానీయులును తేమానీయులును బూజీయులును గడ్డపుప్రక్కలను కత్తిరించుకొనువారందరును 24అరబిదేశపు రాజులందరును అరణ్యములో నివసించు మిశ్రితజనముల రాజులందరును 25జిమ్రీ రాజులందరును ఏలాము రాజులందరును మాదీయుల రాజులందరును 26సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవా రేమి ఉత్తరదేశముల రాజులందరును భూమిమీదనున్న రాజ్యములన్నియు దానిలోనిది త్రాగుదురు; షేషకురాజు వారి తరువాత త్రాగును. 27నీవు వారితో ఈలాగు చెప్పుము–ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియు నైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను మీమీదికి పంపబోవు యుద్ధముచేత త్రాగి మత్తిల్లి కక్కు కొనినవారివలెనేయుండి మీరు మరల లేవకుండ పడుదురు. 28మేము త్రాగమని వారు నీ చేతిలోనుండి ఆ పాత్రను తీసికొననొల్లని యెడల నీవు వారితో ఇట్లనుము –మీరు అవశ్యముగా దాని త్రాగవలెనని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 29నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడుచేయ మొదలుపెట్టగా మీకు శిక్షలేకుండ పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరిమీదికి నేను ఖడ్గమును రప్పించుచున్నాను; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు. 30కాబట్టి నీవు ఈ మాటలన్నిటిని వారికి ప్రకటించి, ఈలాగు చెప్పవలెను–ఉన్నతస్థలములోనుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయములోనుండి తన స్వరమును వినిపించుచున్నాడు, తన మంద మేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు, ద్రాక్షగానుగను త్రొక్కువారివలె అరచుచు ఆయన భూలోక నివాసులకందరికి విరోధముగా ఆర్భటించుచున్నాడు. 31భూమ్యంతమువరకు సందడి వినబడును, యెహోవా జనములతో వ్యాజ్యెమాడుచున్నాడు, శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడుచున్నాడు, ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు; ఇదే యెహోవా వాక్కు.
32సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–జనమునుండి జనమునకు కీడు వ్యాపించు చున్నది, భూదిగంతములనుండి గొప్ప తుపాను బయలు వెళ్లుచున్నది. 33ఆ దినమున యెహోవాచేత హతులైనవారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు. ఎవరును వారినిగూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు, పెంటవలె వారి శవములు నేలమీద పడియుండును. 34మందకాపరులారా, గోలలెత్తుడి, మొఱ్ఱపెట్టుడి; మందలోని ప్రధానులారా, బూడిద చల్లుకొనుడి. మీరు మరణమునొందుటకై దినములు పూర్తియాయెను, నేను మిమ్మును చెదరగొట్టెదను, రమ్యమైన పాత్రవలె మీరు పడుదురు. 35మందకాపరులకు ఆశ్రయస్థలము లేకపోవును, మందలోని శ్రేష్ఠమైన వాటికి రక్షణ దొరకకపోవును, 36ఆలకించుడి, మంద కాపరుల మొఱ్ఱ వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోలవినబడుచున్నది, యెహోవావారి మేతభూమినిపాడు చేసియున్నాడు. 37నెమ్మదిగల మేతస్థలములు యెహోవా కోపాగ్నిచేత పాడాయెను; 38క్రూరమైన ఖడ్గముచేతను ఆయన కోపాగ్నిచేతను వారి దేశము పాడుకాగా సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను.
Currently Selected:
యిర్మీయా 25: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.