న్యాయాధిపతులు 6
6
1ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా యేడేండ్లు వారిని మిద్యానీయుల కప్ప గించెను. 2మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయులమీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయులయెదుట నిలువలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి.
3ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యా నీయులును అమాలేకీయులును తూర్పుననుండు వారును తమ పశువులను గుడారములను తీసికొని మిడతల దండంత విస్తారముగా వారిమీదికి వచ్చి 4వారి యెదుట దిగి, గాజాకు పోవునంతదూరము భూమి పంటను పాడుచేసి, ఒక గొఱ్ఱెనుగాని యెద్దునుగాని గాడిదనుగాని జీవనసాధనమైన మరిదేనినిగాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. 5వారును వారి ఒంటెలును లెక్కలేకయుండెను. 6దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి.
7మిద్యానీయులవలని బాధనుబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా 8యెహోవా ఇశ్రాయేలీయులయొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెను – ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా–నేను ఐగుప్తులోనుండి మిమ్మును రప్పించి, దాసుల గృహములోనుండి మిమ్మును తోడుకొని వచ్చితిని. 9ఐగుప్తీయుల చేతిలోనుండియు మిమ్మును బాధించిన వారందరిచేతిలోనుండియు మిమ్మును విడిపించి, మీ యెదుటనుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని; మీ దేవుడనైన యెహోవాను నేనే. 10మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితినిగాని మీరు నా మాట వినకపోతిరి.
11యెహోవాదూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవా షునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకివృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లుగానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుచుండగా 12యెహోవాదూత అతనికి కనబడి–పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనగా 13గిద్యోను–చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను. 14అంతట యెహోవా అతనితట్టు తిరిగి–బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షిం పుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా 15అతడు –చిత్తము నా యేలినవాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా–అయిన నేమి? 16నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను. 17అందుకతడు–నాయెడల నీకు కటాక్షము కలిగినయెడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలిసి కొనునట్లు ఒక సూచన కనుపరచుము. 18నేను నీయొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టువరకు ఇక్కడనుండి వెళ్లకుమీ అని వేడుకొనగా ఆయన–నీవు తిరిగి వచ్చువరకు నేను ఉండెదననెను. 19అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లనుకుండలో పోసి ఆయనకొరకు ఆ మస్తకివృక్షముక్రిందికి దానిని తీసికొనివచ్చి దగ్గర ఉంచగా 20దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతిమీద పెట్టి– నీళ్లు పోయుమని అతనితో చెప్పెను. 21అతడాలాగుచేయగా యెహోవాదూత తన చేతనున్న కఱ్ఱను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలోనుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చి వేసెను, అంతట యెహోవాదూత అతనికి అదృశ్య మాయెను. 22గిద్యోను ఆయన యెహోవాదూత అని తెలిసికొని–అహహా నా యేలినవాడా, యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవాదూతను చూచితిననెను. 23అప్పుడు యెహోవా–నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. 24అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠముకట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరుపెట్టెను. నేటివరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.
25మరియు ఆ రాత్రియందే యెహోవా–నీ తండ్రి కోడెను, అనగా ఏడేండ్ల రెండవ యెద్దును తీసికొని వచ్చి, నీ తండ్రికట్టిన బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి, దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికివేసి 26తగిన యేర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠముకట్టి, ఆ రెండవ కోడెను తీసికొనివచ్చి నీవు నరికిన ప్రతిమయొక్క కఱ్ఱతో దహనబలి నర్పించుమని అతనితో చెప్పెను. 27కాబట్టి గిద్యోను తన పనివారిలో పదిమందిని తీసికొనివచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరివారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేసెను. 28ఆ ఊరివారు వేకువనే లేచినప్పుడు బయలుయొక్క బలిపీఠము విరుగగొట్టబడియుండెను, దానికి పైగా నున్న దేవతాస్తంభమును పడద్రోయబడి యుండెను, కట్టబడిన ఆ బలిపీఠముమీద ఆ రెండవ యెద్దు అర్పింప బడి యుండెను. 29అప్పుడు వారు–ఈ పని యెవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణచేసి వెదకి, యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పనిచేసినట్టు తెలిసికొనిరి. 30కాబట్టి ఆ ఊరివారు–నీ కుమారుడు బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా 31యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో–మీరు బయలు పక్షముగా వాదింతురా? మీరు వాని రక్షించుదురా? వానిపక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను; ఎవడో వాని బలిపీఠమును విరుగగొట్టెను గనుక, వాడు దేవతయైనందున తన పక్షమున తానేవాదించ వచ్చును. 32ఒకడు తన బలిపీఠమును విరుగ గొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలను#6:32 వాదించువాడు. పేరు పెట్టెను.
33మిద్యానీయులందరును అమాలేకీయులందరును తూర్పు వారందరును కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో దిగగా 34యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపువారు అతని యొద్దకు వచ్చిరి. 35అతడు మనష్షీ యులందరియొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతనియొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు జెబూలూను నఫ్తాలి గోత్రములవారియొద్దకు దూతలను పంపగా వారును కూడినవారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. 36అప్పుడు గిద్యోను –నీవు సెలవిచ్చినట్లు నాచేత ఇశ్రాయేలీయులను రక్షింప నుద్దేశించినయెడల 37నేను కళ్లమున గొఱ్ఱెబొచ్చు ఉంచినతరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొఱ్ఱెబొచ్చుమీద మాత్రమే మంచుపడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. 38ఆలాగున జరిగెను; అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండువరకు ఆ బొచ్చునుండి మంచును పిండెను. 39అప్పుడు గిద్యోను–నీ కోపము నా మీద మండనియ్యకుము; ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటిమీద మంచు పడియుండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా 40ఆ రాత్రి దేవుడు ఆలాగున చేసెను; నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చుమాత్రమే పొడిగానుండెను.
Currently Selected:
న్యాయాధిపతులు 6: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.