YouVersion Logo
Search Icon

యెషయా 36

36
1హిజ్కియా రాజుయొక్క పదునాలుగవ సంవత్సరమున అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనెను. 2అంతట అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణమునుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకి రేవు మార్గమందున్న మెరకకొలను కాలువయొద్ద ప్రవేశింపగా 3హిల్కీయా కుమారుడును రాజు గృహనిర్వాహకుడునునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారియొద్దకు పోయిరి. 4అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను – ఈ మాట హిజ్కియాతో తెలియ జెప్పుడి–మహారాజైన అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా –నీవీలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్ర యాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి? 5యుద్ధవిషయములో నీ యోచనయు నీ బలమును వట్టిమాటలే. ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు? 6నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా; ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొనువారికందరికి అట్టివాడే. 7మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే; యెరూషలేమందున్న యీ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా యెవని ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా. 8కావున చిత్త గించి అష్షూరు రాజైన నా యేలినవానితో పందెము వేయుము; రెండువేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి యున్నయెడల నేను వాటిని నీకిచ్చెదను. 9లేనియెడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించు కొంటివే. 10యెహోవా సెలవు నొందకయే యీ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా? లేదు–ఆ దేశముమీదికి పోయి దాని పాడుచేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను. 11ఎల్యాకీము షెబ్నా యోవాహు అను వారు–చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము, ప్రాకారముమీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా 12రబ్షాకే–ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానునియొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారముమీద ఉన్న వారియొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి 13గొప్ప శబ్దముతో యూదాభాషతో ఇట్లనెను–మహారాజైన అష్షూరురాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చునదేమనగా– 14హిజ్కియాచేత మోసపోకుడి; మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. 15యెహోవానుబట్టి మిమ్మును నమ్మించి–యెహోవా మనలను విడిపించును; ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. 16హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవలదు; అష్షూరురాజు సెలవిచ్చున దేమనగా నాతో సంధి చేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచునుండును. 17అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా నేను వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును మిమ్మును తీసికొనిపోదును; యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు. 18ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలోనుండి విడిపించెనా? హమాతు దేవతలేమాయెను? 19అర్పాదు దేవతలేమాయెను? సెపర్వయీము దేవతలేమాయెను? షోమ్రోను దేశపు దేవత నా చేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా? 20యెహోవా నా చేతిలోనుండి యెరూషలేమును విడిపించు ననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలోనుండి విడిపించినది కలదా? అని చెప్పెను. 21అయితే–అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుటచేత వారెంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకొనిరి. 22గృహనిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.

Currently Selected:

యెషయా 36: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in