YouVersion Logo
Search Icon

హోషేయ 13

13
1ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను; అతడు ఇశ్రాయేలువారిలో తన్ను గొప్ప చేసికొనెను; తరువాత బయలుదేవతనుబట్టి అపరాధియై అతడు నాశన మొందెను. 2ఇప్పుడు వారు పాపము పెంపుచేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు, అదంతయు పనివారు చేయుపనియే, వాటికి బలులను అర్పించువారు–దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు. 3కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘమువలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టువలెను, కిటికీలోగుండ పోవు పొగవలె నుందురు. 4మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను; నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప ఏ రక్షకుడును లేడు. 5మహా యెండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించినవాడను నేనే. 6తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తిపొందిరి; తృప్తిపొంది గర్వించి నన్ను మరచిరి. 7కాబట్టి నేను వారికి సింహమువంటివాడనైతిని; చిరుతపులి మార్గమున పొంచియున్నట్లు నేను వారిని పట్టుకొన పొంచియుందును. 8పిల్లలు పోయిన యెలుగుబంటి యొకనిమీద పడునట్టు నేను వారిమీదపడి వారి రొమ్మును చీల్చివేయుదును; ఆడుసింహము ఒకని మ్రింగివేయునట్లు వారిని మ్రింగివేతును; దుష్టమృగములు వారిని చీల్చివేయును. 9ఇశ్రాయేలూ, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసికొనుచున్నావు. 10నీ పట్టణములలో దేనియందును నీకు సహాయము చేయకుండ నీ రాజు ఏమాయెను? –రాజును అధిపతులను నామీద నియమించుమని నీవు మనవి చేసికొంటివిగదా; నీ అధిపతులు ఏమైరి? 11కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని; క్రోధముకలిగి అతని కొట్టివేయు చున్నాను. 12ఎఫ్రాయిము దోషము నాయొద్ద ఉంచబడి యున్నది, అతని పాపము భద్రము చేయబడియున్నది. 13ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదనపుట్టును, పిల్లపుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధిలేనివాడై వృద్ధికి రాడు. 14అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు. 15నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధినొందును. అయితే తూర్పుగాలి వచ్చును, యెహోవా పుట్టించుగాలి అరణ్యములోనుండి లేచును; అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువు లన్నిటిని శత్రువు కొల్లపట్టును. 16షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటుచేసెను గనుక అది శిక్షనొందును, జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకువేసి కొట్టబడుదురు, గర్భిణిస్త్రీల కడుపులు చీల్చబడును.

Currently Selected:

హోషేయ 13: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in