ఎజ్రా 10
10
1ఎజ్రా యేడ్చుచు దేవుని మందిరము ఎదుట. సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థనచేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా 2ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను –మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లిచేసికొని మా దేవునిదృష్టికి పాపము చేసితిమి; అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడ వడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. 3కాబట్టి యీ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచ ననుబట్టియు, దైవాజ్ఞకు భయపడువారి యోచననుబట్టియు, ఈ భార్యలను వారికి పుట్టినవారిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసికొనెదము. 4లెమ్ము ఈ పని నీ యధీనములోనున్నది, మేమును నీతోకూడ నుందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుమనగా 5ఎజ్రా లేచి, ప్రధానయాజకులును లేవీయులును ఇశ్రాయేలీయులందరును ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారిచేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసికొనగా 6ఎజ్రా దేవుని మందిరము ఎదుటనుండి లేచి, ఎల్యాషీబు కుమారుడైన యోహానానుయొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి, చెరపట్టబడినవారి అపరాధమునుబట్టి దుఃఖించుచు, భోజనమైనను పానమైనను చేయకుండెను. 7చెరనుండి విడుదల నొందినవారందరు యెరూషలేమునకు కూడి రావలెనని యూదా దేశమంతటియందును యెరూషలేము పట్టణమందును ప్రకటనచేయబడెను. 8మరియు మూడుదినములలోగా ప్రధానులును పెద్దలును చేసిన యోచనచొప్పున ఎవడైనను రాకపోయినయెడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు, వాడు విడుదల నొందినవారి సమాజములోనుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. 9యూదా వంశస్థులందరును బెన్యామీనీయులందరును ఆ మూడుదినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది తొమ్మిదవ నెల; ఆ నెల యిరువదియవ దినమున జనులందరును దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాలచేత తడియుచు, ఆ సంగతిని తలం చుటవలన వణకుచుండిరి.
10అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను –మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లిచేసికొని, ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి. 11కాబట్టి యిప్పుడు మీపితరులయొక్క దేవుడైన యెహోవా యెదుట మీ పాపమును ఒప్పుకొని, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి, దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని యుండుడి. 12అందుకు సమాజకులందరు ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి–నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసియున్నది. 13అయితే జనులు అనేకులై యున్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము, ఈ పని యొకటి రెండు దినములలో జరుగునది కాదు; ఈ విషయములో అనేకులము అపరాధులము; కాబట్టి సమాజపు పెద్దలనందరిని యీ పనిమీద ఉంచవలెను, 14మన పట్టణములయందు ఎవరెవరు అన్యస్త్రీలను పెండ్లిచేసికొనిరో వారందరును నిర్ణయకాలమందు రావలెను; మరియు ప్రతి పట్టణముయొక్క పెద్దలును న్యాయాధిపతులును ఈ సంగతినిబట్టి మామీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మామీదికి రాకుండ తొలగి పోవునట్లుగా వారితోకూడ రావలెను అనిచెప్పెను. 15అప్పుడు అశాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి#10:15 ఆ పనికి విరోధముగా లేచిరి. నిర్ణ యింప బడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతైయును వారికి సహాయులై యుండిరి. 16చెరనుండి విడుదలనొందినవారు అట్లుచేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులును వారి పితరుల యింటి పేరులనుబట్టి తమతమ పేరుల ప్రకారము అందరిని వేరుగా ఉంచి, పదియవ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. 17మొదటి నెల మొదటి దినమున అన్యస్త్రీలను పెండ్లి చేసికొనిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి.
18యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యున్నట్లు కనబడినవారు ఎవరనగా – యోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను, అతని సహోదరులలోను మయశేయాయు, ఎలీయెజెరును, యారీబును గెదల్యాయును. 19వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట యిచ్చిరి. మరియు వారు అపరాధులై యున్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి. 20ఇమ్మేరు వంశములో హనానీ జెబద్యా 21హారీము వంశములో మయశేయా ఏలీయా షెమయా యెహీయేలు ఉజ్జియా, 22పషూరు వంశములో ఎల్యో యేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాశా, 23లేవీయులలో యోజాబాదు షిమీ కెలిథా అను కెలాయా పెతహయా యూదా ఎలీయెజెరు, 24గాయకులలో ఎల్యాషీబు, ద్వారపాలకులలో షల్లూము తెలెము ఊరి అనువారు. 25ఇశ్రాయేలీయులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్యా యిజ్జీయా మల్కీయా మీయామిను ఎలియేజరు మల్కీయా, బెనాయా, 26ఏలాము వంశములో మత్తన్యా జెకర్యా యెహీయేలు అబ్దీ యెరేమోతు ఏలీయ్యా. 27జత్తూ వంశములో ఎల్యోయేనై ఎల్యాషీబు మత్తన్యా యెరేమోతు జాబాదు అజీజా. 28బేబై వంశములో యెహోహానాను హనన్యా జబ్బయి అత్లాయి, 29బానీ వంశములో మెషుల్లాము మల్లూకు అదాయా యాషూబు షెయాలు 30రామోతు, పహత్మో యాబు వంశములో అద్నా కెలాలు బెనాయా మయ శేయా మత్తన్యా బెసలేలు బిన్నూయి మనష్షే, 31హారిము వంశములో ఎలీయెజెరు ఇష్షీయా మల్కీయా షెమయా 32షిమ్యోను బెన్యామీను మల్లూకు షెమర్యా, 33హాషుము వంశములో మత్తెనై మత్తత్తా జాబాదు ఎలీపేలెటు యెరేమై మనష్షే షిమీ, 34బానీ వంశములో మయదై అమ్రాము ఊయేలు బెనాయా బేద్యా కెలూహు 35వన్యా మెరేమోతు ఎల్యాషీబు 36మత్తన్యా మత్తెనై యహశావు బానీ బిన్నూయి షిమీ 37-42షిలెమ్యా నాతాను అదాయా మక్నద్బయి షామై షారాయి అజరేలు షెలెమ్యా షెమర్యా షల్లూము అమర్యా యోసేపు 43నెబో వంశములో యెహీయేలు మత్తిత్యా జాబాదు జెబీనా యద్దయి యోవేలు బెనాయా అనువారు. 44వీరందరును అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.
Currently Selected:
ఎజ్రా 10: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.